
సాక్షి, అమరావతి: జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం ప్రారంభించారు. ఆజాది కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పింగళి జీవిత చరిత్రపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం ప్రారంభించి, తిలకించారు. సాంస్కృతిక శాఖ డైరెక్టర్ రేగుళ్ల మల్లిఖార్జునరావు స్వయంగా చిత్రించిన పింగళి వెంకయ్య చిత్రపటాన్ని సీఎం ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో విద్యుత్, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్) జీవీడీ.కృష్ణమోహన్, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, మొండితోక అరుణ్‌కుమార్, చీఫ్ సెక్రటరీ డాక్టర్ సమీర్ శర్మ, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, సమాచార శాఖ కమిషనర్ తమ్మా విజయ్‌కుమార్ రెడ్డి, సీఎంవో అధికారులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
పింగళి వెంకయ్య స్వస్థలం కృష్ణా జిల్లా భట్లపెనుమర్రు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్, నగరిలో మంత్రి ఆర్కే రోజా పాల్గొన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో జయంత్యుత్సవాలు నిర్వహిస్తున్నారు. అలాగే, పింగళి వెంకయ్యపై రూపొందించిన ప్రత్యేక కవర్‌ను పోస్టల్ శాఖ ఆవిష్కరించింది.
Comments
Please login to add a commentAdd a comment