
సాక్షి, తిరుమల: శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. అర్థరాత్రి నుండే వేలాది మంది భక్తులు సర్వదర్శనం టికెట్ల కోసం గుమికూడారు. సర్వదర్శనం ప్రారంభించిన గంటలోనే 5 వేల టికెట్ల కోటా పూర్తి అయింది. ఇంకా భక్తులు అధిక సంఖ్యలో ఉండటంతో దర్శన టికెట్లు కోసం భక్తులు నిరసనకు దిగారు. దీనిపై సమాచారం అందుకున్న టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని.. సమస్యను పరిష్కరించారు. సోమవారం వరకు దర్శన టికెట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు.
'భక్తులు సర్వదర్శనం టికెట్ల కోసం వేచి ఉన్న సమయంలో కోవిడ్ నిబంధనలు పాటించడం లేదు. కనీసం భౌతిక దూరం పాటించడం లేదు. మాస్కులు కొందరు వేసుకోవడం లేదు. ఇలా ఉంటే కరోనా మహమ్మారి విజృంభించే అవకాశం ఉంది. వీటన్నిటిని పరిగణలోకి టీటీడీ చైర్మన్‌తో చర్చించి.. సర్వదర్శనం టికెట్లపై నిర్ణయం తీసుకుంటాం' అని అదనపు ఈఓ ధర్మారెడ్డి తెలిపారు.