తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు కంపార్టుమెంట్ల నుంచి కాకుండా నేరుగా దర్శనానికి పంపిస్తున్నారు. . నిన్న (మంగళవారం) 62,566 మంది స్వామివారిని దర్శించుకోగా 16,021 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.20 కోట్లు సమర్పించారు.
జనవరి 10 నుండి 19వ తేది వరకు వైకుంఠ ద్వార దర్శనాలు
తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10వ తేది నుండి 19వ తేది వరకు నిర్వహించనున్న పది రోజుల వైకుంఠద్వార దర్శనాలకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు తెలియజేశారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో మంగళవారం ఆయన వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైకుంఠ ఏకాదశి ఏర్పాట్ల గురించి మీడియాకు వివరించారు.
సమావేశంలోని ముఖ్యాంశాలు
⇒ 10వ తేది నుండి 19వ తేది వరకు 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచబడతాయి.
⇒ జనవరి 10వ తేది ఉదయం 4.30 గంటలకు ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభమవుతాయి. 8 గంటలకు సర్వ దర్శనాలు ప్రారంభమవుతాయి.
⇒ జనవరి 10న వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు.
⇒ అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి 4 గంటల వరకు మలయప్పస్వామి వాహన మండపంలో భక్తులకు దర్శనమిస్తారు.
⇒ జనవరి 11న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తాం.
సర్వ దర్శన టోకెన్లు
⇒ తిరుపతిలోని 8 కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 90 కౌంటర్లలో, తిరుమలలో ఏర్పాటు చేసిన ఒక కేంద్రంలోని 4 కౌంటర్లలో ఈ టోకెన్లు జారీ.
⇒ జనవరి 9వతేది ఉదయం 5 గంటలకు 10, 11, 12 తేదీలకు సంబంధించి 1.20 లక్షల టోకెన్లను భక్తులకు కేటాయింపు. 13వ తేది నుండి 19వ తేది వరకు ఏరోజుకారోజు టోకెన్లు జారీ. సామాన్య భక్తులకు పెద్ద పీఠ వేస్తూ పదిరోజులకు గాను 4.32 లక్షల ఎస్ఎస్ డీ టోకెన్ల జారీ.
⇒ తిరుపతిలోని ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, భైరాగిపట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్ పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జీవకోనలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తిరుమల వాసులకు బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్‌లో ఎస్ఎస్ డీ టోకెన్లు జారీ.
⇒ ఇప్పటికే పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 1.40 లక్షల ఉఈ టికెట్లను, 19500 శ్రీవాణి టికెట్లను ఆన్ లైన్ లో విడుదల.
⇒ ప్రోటోకాల్ ప్రముఖులకు మినిహా వీఐపీ బ్రేక్, వృద్ధులు, చంటిపిల్లలు, దివ్యాంగులు, ఎన్ఆర్ఐ, ఇతర దర్శనాలు పది రోజుల పాటు రద్దు.
⇒ తిరుమలలో వసతి గదులు తక్కువగా ఉన్న కారణంగా దర్శన టోకెన్లు కలిగిన భక్తులను మాత్రమే క్యూలైన్లలోకి అనుమతి. భక్తులు క్యూలైన్లలో వేచి ఉండే సమయాన్ని నివారించేందుకు తమకు కేటాయించిన తేది, సమయానికే దర్శనానికి రావాలని విజ్ఞప్తి.
⇒ దాదాపు 7 లక్షల మందికి పైగా వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకునేందుకు ఏర్పాట్లు.
⇒జనవరి 9వ తేదిన అదేరోజు శ్రీవారి దర్శనానికి సంబంధించి తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్ డీ టోకెన్లు జారీ నిలిపివేత.
⇒ శ్రీవారి మెట్టు మార్గంలోని టోకెన్ జారీ కౌంటర్లు జనవరి 19వ తేది వరకు మూసివేత
⇒ ఎక్కువమంది సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు ఈ పదిరోజులు సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.
Comments
Please login to add a commentAdd a comment