
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: నివర్ తుపాను తీవ్రత నుంచి కోలుకోక ముందే.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడింది. ప్రస్తుత నివర్ తీవ్ర అల్పపీడనంగా బలహీనపడి దక్షిణ కోస్తాంధ్ర – పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. దానికి అనుబంధంగా సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకూ ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ప్రభావంతో కోస్తాంధ్రలో శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పలు చోట్ల కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రకటించింది. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
మరో రెండు తుపాన్లు!: తూర్పు హిందూ మహాసముద్రం – దక్షిణ అండమాన్ సముద్రం మీద 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉంది. దీని ప్రభావం వల్ల రాగల 36 గంటల్లో (ఈ నెల 29న) ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ శుక్రవారం రాత్రి వెబ్‌సైట్‌లో ప్రకటించింది. తదుపరి 24 గంటల్లో ఇది క్రమంగా బలపడి తమిళనాడు–పుదుచ్చేరి మీదుగా అరేబియా సముద్రం వైపు పయనించి డిసెంబర్ 2 తర్వాత తుపానుగా మారే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇది తుపానుగా మారితే.. మాల్దీవులు సూచించిన ‘బురేవి’గా పేరు పెట్టనున్నారు. అదేవిధంగా.. మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో వచ్చే నెల 5న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండగా.. ఇది క్రమంగా బలపడి తుపానుగా మారితే దీనికి మయన్మార్ సూచించిన ‘టకేటీ’గా పేరు పెడతారు. కాగా గడిచిన 24 గంటల్లో నివర్ ప్రభావంతో.. రాష్ట్రమంతటా భారీ వర్షాలతో పాటు మోస్తరు వానలు విస్తారంగా కురిశాయి. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని అధికా>రులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment