ఉద్దానం గూనచారు.. తింటే వదల్లేరు | Uddanam nutrients goonacharu ichchapuram Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఉద్దానం గూనచారు.. తింటే వదల్లేరు

Published Mon, Oct 25 2021 3:01 AM | Last Updated on Mon, Oct 25 2021 7:45 AM

Uddanam nutrients goonacharu ichchapuram Andhra Pradesh - Sakshi

గూనచారుకు పాకం తయారు చేస్తున్న దృశ్యం

ఇచ్ఛాపురం రూరల్‌: ఉద్దానం ప్రాంతంలో చేసే విందుల్లో విశేష వంటకం ‘గూనచారు’. వేడివేడి అన్నంలో గూనచారు వేసుకుంటే ‘ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి’ అంటూ పాట పాడక తప్పదు. ఈ వంటకం అంత రుచికరంగా ఉంటుంది మరి. అరచేతికి అంటిన గూనచారు వాసన వారం రోజులపాటు పోదంటే అతిశయోక్తి కాదు. శ్రీకాకుళం జిల్లాలో ‘భోజీ పులుసు’గా పిలిచే గూనచారు కేవలం ఉద్దానం ప్రాంతానికే సొంతం. మట్టి బాన (పెద్ద కుండ)లో తయారు చేసే ఈ చారు 10 నుంచి 15 రోజులపాటు నిల్వ ఉంచినా చెక్కు చెదరకుండా.. రంగూ, రుచి పోకుండా అంతే రుచిగా ఉంటుంది. ఈ చారును ఉద్దానం వాసులు ఇతర రాష్ట్రాల్లో ఉండే మిత్రులు, బంధువులు, సహోద్యోగులకు పంపిస్తుంటారు.

పోషకాల రారాజు
గూనచారులో అన్నిరకాల పోషక విలువలు ఉంటాయని విశ్రాంత వైద్యాధికారి డాక్టర్‌ పూడి రామారావు తెలిపారు. ముఖ్యంగా ఇందులో ఏ, బీ, సీ, డీ, కే విటమిన్లు ఉంటాయని చెప్పారు. ఇది క్యాన్సర్‌ నిరోధకంగా పని చేస్తుందని.. రక్తహీనతను తగ్గించే ఔషధ గుణాలు, నరాల బలహీనతను తగ్గించే గుణాలు, వీర్యకణాల వృద్ధి, ఐరన్, మాంసకృత్తులు, శరీర నిర్మాణానికి అవసరమైన ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయని ఆయన వివరించారు. గూనచారు ఎసిడిటీని రూపుమాపుతుందని పేర్కొన్నారు.  

ఇలా తయారు చేస్తారు
► మొదట చింతపండు నానబెట్టి రసం తీయాలి. ఆ రసాన్ని కనీసం గంటపాటు బానలో మరిగించాలి. మరిగించిన రసంలో బెల్లం, పసుపు పొడి, కారం, అరటి ముక్కలు, మునగ, పనస ఇత్యాది కూర ముక్కలు కలపాలి. 

► ఇలా తయారైన రసాన్ని మరో గంటసేపు మరిగించాలి. అందులో బాగా వేయించిన బియ్యం పిండిని కలుపుకుని పక్కన పెట్టుకోవాలి.

► పోపు పెట్టడం చాలా ముఖ్యమైన ఘట్టం. మొదటిగా వంటనూనెను పావుగంట మరిగించాలి. తరువాత ఉల్లికి గాట్లు పెట్టి ఆ నూనెలో వేసి బాగా వేయించాలి. తర్వాత ఎండుమిరప కాయల్ని దోరగా వేయించాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి ముద్దలు వేయాలి. ఈ పోపు కార్యక్రమం ఇంచుమించు గంటసేపు సాగాలి.

► తయారైన పోపుని బియ్యం పిండి కలిపి, మరిగించిన చింతపండు రసంలో కలిపి తగినంత ఉప్పు, కారం పొడి అందులో వేయాలి. ఆ తరువాత బానపై మూతపెట్టి అరగంట సేపు ఉంచాలి. అంతే.. భోజీ పులుసు అదేనండీ..  అదే ఉద్దానం ‘పేటెంట్‌’ గూనచారు తయార్‌. 

మామూలుగా ఉండదు
ఉద్దానం ప్రాంతంలో వివిధ ఫంక్షన్లకు ప్రత్యేకంగా తయారు చేసే గూనచారు మామూలుగా ఉండదు. నాకెంతో ఇష్టమైన వంటకం ఇది. ఉద్యోగరీత్యా ఇతర దేశంలో ఉన్న నేను స్వదేశానికి వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఈ చారును తయారు చేయించుకుని విందారగిస్తాను. స్థానికంగా దొరికే మసాలా దినుసులతో తయారు చేసే ఈ చారును ఇతర రాష్ట్రాల్లోని వారికి ఉద్దానం వాసులు బహుమతిగా పంపిస్తుంటారు. ఇప్పటివరకు నేను ఎన్నో రాష్ట్రాలు, దేశాలు తిరిగినప్పటికీ ఉద్దానం ప్రాంతంలో తయారు చేసే గూనచారును ఎక్కడా చూడలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఉద్దానం పేటెంట్‌ గూనచారు.
– తిప్పన శంకరరావురెడ్డి, ప్రవాసాంధ్రుడు, తిప్పనపుట్టుగ, ఇచ్ఛాపురం మండలం

ఫంక్షన్లలో భలే డిమాండ్‌ 
మా తాతల కాలం నుంచీ ఉద్దానం ప్రాంతంలో జరిగే ప్రతి ఫంక్షన్‌లో గూనచారు వండాల్సిందే. చింతపండు, బెల్లం, పనస పొట్టుతో ప్రత్యేకంగా తయారు చేసే ఈ చారు చాలా రుచికరంగా ఉంటుంది. పెళ్లిళ్ల సీజన్‌లో మాకు చాలా డిమాండ్‌ ఉంటుంది. దీనిని చాలా జాగ్రత్తగా తయారు చేయాలి. ముఖ్యంగా చింతపండు, బెల్లం, ఉల్లిపాయలతో తయారు చేసే పాకం బాగుండాలి. చారు వాసన సుమారు అర కిలోమీటరు వరకు వ్యాపిస్తుంది. 15 రోజులపాటు నిల్వ ఉంచుకుని దర్జాగా తినొచ్చు. 
– దున్న ఢిల్లీరావు, గూనచారు తయారీదారు, బూర్జపాడు, ఇచ్ఛాపురం మండలం 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement