ప్రతీకాత్మక చిత్రం
క్రోసూరు (పెదకూరపాడు): ఆ ఇంటి యజమానిని కరోనా కాటేసింది. మనస్థాపానికి గురైన అతడి భార్య, కుమార్తె ఎలుకల మందు తిని బలవన్మరణం పొందారు. కొన్ని రోజులుగా ఈ బాధతో కుమిలిపోతున్న కుమారుడు కూడా ఎలుకల మందు తిని చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. గుంటూరు జిల్లా క్రోసూరులో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. క్రోసూరుకు చెందిన తెప్పలి కొండలు, బాలకృష్ణ, నరసింహారావు, అంకారావు అన్నదమ్ములు. చిరు వ్యాపారాలు చేసుకునే ఈ నలుగురు అన్నదమ్ములు పక్కపక్క ఇళ్లలో నివసించేవారు. కాగా.. ఈ ఏడాది ఏప్రిల్‌లో కరోనా సోకడంతో తెప్పలి బాలకృష్ణ (45), అతని తమ్ముడు అంకారావు (37) మృతి చెందారు. అంకరావుకు భార్య వరలక్ష్మి (35), కుమార్తె రూపకావ్య (12), కుమారులు సోమశేఖర్ (14), షణ్ముగం (రెండేళ్లు) ఉన్నారు.
అంకారావు మరణంతో మనస్తాపం చెందిన అతడి భార్య వరలక్ష్మి, కుమార్తె రూపకావ్య (12) మే నెలలో ఎలుకల మందు తిని ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో అంకారావు కుమారులైన సోమశేఖర్, షణ్ముగం బాధ్యతలను పెద్దనాన్నలు కొండలు, నరసింహారావు, నాయనమ్మ హనుమాయమ్మ చూస్తున్నారు. ఈ క్రమంలో సోమశేఖర్ పదేపదే తల్లిదండ్రులు, చెల్లెలి మరణాన్ని పదేపదే గుర్తు చేసుకుంటూ ఆవేదన చెందుతున్నాడు. వారి మరణాన్ని జీర్ణించుకోలేని స్థితిలో సోమశేఖర్ కూడా బుధవారం వేకువజామున ఎలుకల మందు తిని ఆత్యహత్యకు యత్నించాడు. హుటాహుటిన అతడిని గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు బుధవారం సోమశేఖర్ పెదనాన్నలను పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment