తుళ్లూరు ఎమ్మార్వో కేసులో ఊహించని పరిణామం  | Unexpected Development In Case Of Thullur MRO | Sakshi
Sakshi News home page

తుళ్లూరు ఎమ్మార్వో కేసులో ఊహించని పరిణామం 

Published Fri, Oct 16 2020 8:23 AM | Last Updated on Fri, Oct 16 2020 4:38 PM

Unexpected Development In Case Of Thullur MRO - Sakshi

సాక్షి, అమరావతి: అనేక మలుపులు తిరుగుతున్న అమరావతి అసైన్డ్‌ భూముల వ్యవహారానికి సంబంధించి దాఖలైన కేసులో ఎవరూ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. తనపై సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని కోరుతూ అప్పటి తుళ్లూరు ఎమ్మార్వో అన్నే సుధీర్‌బాబు దాఖలు చేసిన క్రిమినల్‌ పిటిషన్‌పై సోమవారం వాదనలు విని తీర్పును రిజర్వ్‌ చేసిన న్యాయమూర్తి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ గురువారం ఆకస్మాత్తుగా ఈ పిటిషన్‌ను రిలీజ్‌ చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   (దేశ చరిత్రలో తొలిసారి ఏపీ ప్రభుత్వం‌ కీలక నిర్ణయం)

రాజధానికి భూములిస్తే పరిహారం రాదంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన అసైన్డ్‌ భూములను అప్పటి అధికార పార్టీ నేతలకు కట్టబెట్టడంలో అప్పటి తుళ్లూరు ఎమ్మార్వో అన్నే సుధీర్‌బాబు, మరికొందరు సహకరించారంటూ సీఐడీ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది.  
ఈ కేసును కొట్టేయాలని కోరుతూ సుధీర్‌బాబు మార్చి 23న హైకోర్టులో క్రిమినల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు, ఆ మరుసటి రోజే సీఐడీ దర్యాప్తునకు సంబంధించిన తదుపరి చర్యలన్నింటిపై స్టే విధించింది.
హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. దర్యాప్తుపై హైకోర్టు స్టే ఇవ్వడంపై విస్మయం వ్యక్తం చేసింది. అసాధారణ పరిస్థితులు ఉంటే తప్ప దర్యాప్తుపై స్టే ఇవ్వడం సరికాదని, దర్యాప్తును కొనసాగనివ్వాలని అభిప్రాయపడింది.  
వారంలో విచారణ జరిపి తేల్చాలని ఈ నెల 1న సుప్రీంకోర్టు హైకోర్టుకు సూచించింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ వ్యాజ్యం రోస్టర్‌ మేరకు జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ ముందు విచారణకు రాగా, ఈ నెల 12న ఇరుపక్షాల వాదనలు విని, తీర్పును రిజర్వ్‌ చేశారు.  
అయితే గురువారం ఈ పిటిషన్‌ జస్టిస్‌ రాయ్‌ ముందున్న కేసుల విచారణ జాబితాలో ‘ఫర్‌ బీయింగ్‌ మెన్షన్డ్‌’ శీర్షిక కింద లిస్ట్‌ అయింది. ఈ పిటిషన్‌ను తాను రిలీజ్‌ చేస్తున్నానని, దీనిని మరో న్యాయమూర్తికి నివేదించాలని రిజిస్ట్రీని ఆదేశించారు. దీనిపై పాలనా పరమైన నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ఈ కేసు ఫైళ్లను ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఉంచాలని పేర్కొన్నారు. తీర్పు రిజర్వ్‌ చేసిన కేసును రిలీజ్‌ చేయడానికి గల కారణాలు నిర్దిష్టంగా తెలియరాలేదు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement