విశాఖలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మేధావులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు
సాక్షి, విశాఖపట్నం: పాలనా వికేంద్రీకరణతోనే రాష్ట్ర భవిష్యత్తు బంగారుమయమవుతుందని ఉత్తరాంధ్ర మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు ముక్తకంఠంతో చాటి చెప్పారు. ప్రాంతీయ విభేదాలకు సున్నితంగా తెరదించి మూడు రాజధానులకు మద్దతిస్తూ రాష్ట్రమంతా ఏకతాటిపై నిలిచేలా శాంతియుతంగా ఉద్యమాలను నిర్వహించే సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు.
ఉత్తరాంధ్ర వాసులు శ్రీకాకుళం నుంచి అమరావతి వరకూ పాదయాత్ర చేపట్టి కేవలం 29 గ్రామాలు ముఖ్యమా? లేక రాష్ట్రమంతటా అభివృద్ధి జరగడం ముఖ్యమా? అనే అంశంపై ప్రతి గడపలోనూ చర్చ జరిగేందుకు సమాయత్తమవ్వాలని పిలుపునిచ్చారు.
దశాబ్దాలుగా వెనుకబాటుకు గురైన ఉత్తరాంధ్ర అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. ఉత్తరాంధ్ర మేధావుల ఆధ్వర్యంలో ఆదివారం విశాఖలోని గాదిరాజు ప్యాలెస్‌లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.
బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ మాజీ ఉపకులపతి హనుమంతు లజపతిరాయ్ అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో ఉపముఖ్యమంత్రులు పీడిక రాజన్నదొర, బూడి ముత్యాలనాయుడు, మంత్రులు బొత్ససత్యనారాయణ, గుడివాడ అమర్‌నాథ్‌తో పాటు ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, డా.బీవీ సత్యవతి, గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, వంశీకృష్ణ శ్రీనివాస్, దుంపల రవీంద్రబాబు, వివిధ కార్పొరేషన్ల చైర్‌పర్సన్‌లు, డైరెక్టర్లు, మేధావి వర్గాల ప్రతినిధులు, ఉద్యోగ, న్యాయవాద, వైద్య, అధ్యాపక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. తొలుత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్, అమరజీవి పొట్టి శ్రీరాములు, తెలుగుతల్లి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తొలి పంచవర్ష ప్రణాళికలోనే..
మద్రాస్ నుంచి విడిపోయిన సమయంలో తొలుత విశాఖనే రాజధానిగా ప్రతిపాదించారు. దీనికి 61 మంది ఎమ్మెల్యేలు మద్దతిచ్చారు. చివరి నిమిషంలో కర్నూలుకు మార్చారు. వికేంద్రీకరణ భావన ఇప్పటిది కాదు. 1951 మొదటి పంచవర్ష ప్రణాళికలో వికేంద్రీకరణ అంశాన్ని మూడో లక్ష్యంగా పేర్కొన్నారు.
ఇప్పటికైనా మూడు రాజధానులను ఏర్పాటు చేయకుంటే భవిష్యత్తులో రాష్ట్రం మూడు ముక్కలయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన అందరిలో ఉంది. ఒకేచోట రాజధాని ఉంటే ప్రకృతి విపత్తులు వస్తే మొత్తం నాశనమయ్యే ప్రమాదం ఉంది. ఉక్రెయిన్ రాజధాని విషయంలోనూ ఇటీవల అదే జరిగింది.
– ప్రొ.హనుమంతు లజపతిరాయ్, మాజీ ఉపకులపతి
29 గ్రామాలా.. రాష్ట్రాభివృద్ధా?
రాజధానిగా అమరావతి పనికిరాదని అన్ని కమిటీలు చెప్పాయి. 29 గ్రామాలు ముఖ్యమా? లేక రాష్ట్రం మొత్తం ముఖ్యమా? అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. 19 దేశాల్లో, 13 రాష్ట్రాల్లో రాజధాని వికేంద్రీకరణ జరిగింది. హైకోర్టు సీట్ ఒకచోట, బెంచ్ ఒక చోట ఉన్న రాష్ట్రాలు, దేశాలు చాలా ఉన్నాయి. ఎమ్మెల్యే క్వార్టర్లు కాకుండా మూడు చోట్లా ఎమ్మెల్యే హాస్టళ్లు నిర్మించాలి.
– ప్రొ.బాలమోహన్‌దాస్, నాగార్జున యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్‌లర్
విశాఖ రెడీమేడ్ రాజధాని
విశాఖ మహా నగరం అన్ని సదుపాయాలున్న రెడీమేడ్ క్యాపిటల్. అతి తక్కువ ఖర్చుతో రాజధానిని ఏర్పాటు చేయవచ్చు. దీన్ని ఎవరూ కాదనే ప్రసక్తే ఉండదు. టూరిజం, ఇండస్ట్రియల్, ఎడ్యుకేషన్ పరంగా ప్రధాన నగరం. ఇలాంటి నగరాన్ని విడిచిపెట్టి రాజధాని ఎక్కడో ఉండటం సరికాదు. మూడు రాజధానులే సబబు. ప్రభుత్వ నిర్ణయం పర్‌ఫెక్ట్.
– జీఎస్‌ఎన్ రాజు, సెంచూరియన్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్
70 ఏళ్లుగా ఉత్తరాంధ్రపై నిర్లక్ష్యం
అన్ని ప్రాంతాలు, మతాల వారికి విశాఖ భద్రమైన నగరం. ముఖ్యమంత్రి నిర్ణయానికి పూర్తి మద్దతు పలుకుతున్నాం. వైజాగ్‌లో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు చేయాలని గతంలో 200 రోజుల పాటు పోరాటం చేశాం. రాజధానితో పాటు బెంచ్ కూడా నెలకొల్పాలి.
– కృష్ణమోహన్, బార్‌కౌన్సిల్ సభ్యుడు
సులువుగా అభివృద్ధి
రాష్ట్ర ప్రగతికి ఏది మంచిదో ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ దానికే మద్దతిస్తుంటుంది. వికేంద్రీకరణతో ఎన్నో ప్రయోజనాలుంటాయి. రాష్ట్రం మొత్తం ప్రగతి పథంలో పయనించేందుకు కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిందే.
విశాఖ అన్నింటికంటే పెద్ద నగరం. దీన్ని అభివృద్ధి చేయడం చాలా తేలిక. ఒక రాజధానిని పునాదుల నుంచి అభివృద్ధి చేయాలంటే చాలా శ్రమతో కూడుకున్నది. హైదరాబాద్‌తో పోటీ పడాలంటే కచ్చితంగా విశాఖకే సాధ్యమవుతుంది. పరిశ్రమలు, ఐటీ సంస్థలు రావాలంటే విశాఖ కార్యనిర్వాహక రాజధాని కావాల్సిందే. దీనివల్ల వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ ముందుకెళ్తాయి.
– పైడా కృష్ణప్రసాద్, ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర అధ్యక్షుడు
సంక్షోభ రాష్ట్రంపై మరింత భారం
అమరావతి నిర్మాణంతో ఇప్పటికే సంక్షోభంలో ఉన్న ఏపీకి ఎలాంటి ఉపయోగం ఉండదు. పుత్రజయని రాజధానిగా మలేషియా నిర్మించింది. అక్కడ ఇప్పటికీ ప్రజలు నివసించడం లేదు. అమరావతి కూడా అదే మాదిరిగా మారుతుంది. ఇలాంటి సదస్సులతో ప్రజలను చైతన్యం చేయాలి. శ్రీకాకుళం నుంచి అమరావతికి యాత్ర చేపట్టాలి.
– శివశంకర్, ఉత్తరాంధ్ర రక్షణ వేదిక కన్వీనర్
ఉద్యమంలో ముందుంటాం..
విశాఖను రాజధానిగా ప్రతి ఒక్కరూ పరిగణించాలి. సీఎం నిర్ణయంతో మూడు ప్రాంతాలు అభివృద్ధికి నోచుకుంటాయి. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై గ్రామస్థాయి నుంచి అవగాహన కల్పించాలి. రాజధానిగా విశాఖకు సంబంధించిన ఏ ఉద్యమంలోనైనా మా ఉద్యోగుల సంఘం ముందు వరుసలో ఉంటుంది.
– పోలాకి శ్రీనివాసరావు, ఏపీ ఎలక్ట్రికల్ బీసీ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుడు
భావితరాలు క్షమించవు..
విశాఖను రెండో ముంబైగా పోలుస్తూ హైదరాబాద్ తర్వాత అభివృద్ధి చెందే కీలక ప్రాంతమని దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ గతంలోనే చెప్పారు. అలాంటి నగరాన్ని వదిలేసి ఎక్కడో రాజధాని ఏర్పాటు తప్పిదమే. ఇప్పటికే హైదరాబాద్‌లో అన్నీ అభివృద్ధి చేసి ఒక తప్పు చేశాం. మరోసారి పునరావృతం చేస్తే భావితరాలు క్షమించవు.
– షంషుద్దీన్, ముస్లిం సంఘాల ప్రతినిధి
అందరి నగరం విశాఖ
అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. గత ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉంటే విభజన తర్వాత ఇన్ని ఇబ్బందులు ఎదురయ్యేవి కాదు. దేశంలో అన్ని ప్రాంతాలకు చెందిన వారు విశాఖలో నివసిస్తున్నారు.
– పల్లవి, ఏయూ చీఫ్ వార్డెన్, స్పోర్ట్స్ డైరెక్టర్
పాదయాత్ర ఎవరి కోసం.?
అమరావతి రైతుల పాదయాత్ర ఎవరి కోసం? లోకేష్‌ను సీఎం చేయాలనే దుర్భుద్ధితో చంద్రబాబు ఈ పాదయాత్ర చేయిస్తున్నారు. మూడు రాజధానులు ఏర్పడితే రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందుతుంది.
– పాకా సత్యనారాయణ, న్యాయవాది
విద్వేషాలను రెచ్చగొడుతున్నారు..
అమరావతి రాజధానిని వ్యతిరేకిస్తూ 729 రోజులుగా మందడంలో నిరసన కార్యక్రమా లు చేస్తున్నాం. చంద్రబాబుకు పేదల అభివృద్ధి ఇష్టం లేదు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని అడ్డుకుని కోర్టులో పిల్‌వేశారు. దుర్భుద్ధితో పాదయాత్రలు నిర్వహిస్తూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు.
–పెరికె వరప్రసాద్, దళిత జేఏసీ నాయకుడు
బాబు బినామీల యాత్ర
అది చంద్రబాబు బినామీల యాత్ర. విశాఖ పరిపాలన రాజధానిగా మారితే ఉత్తరాంధ్రలో వలసలు ఆగిపోతాయి. గతంలో చంద్రబాబును విశాఖ ఎయిర్‌పోర్టు నుంచే వెనక్కి పంపించాం. పాదయాత్రను కూడా అదేమాదిరిగా తిప్పికొట్టాలి.
– కాంతారావు, ఏయూ విద్యార్థి జేఏసీ నాయకుడు
నాడు.. దొంగ లెక్కలతో
రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని రాజ్యాంగంలో అంబేడ్కర్ స్పష్టం చేశారు. 2014–15లో రాజధానిపై ప్రజాభిప్రాయ సేకరణ చేపడితే 42 శాతం మంది విశాఖకు మద్దతిచ్చారు. 22 శాతం మంది విజయవాడ, 25 శాతం గుంటూరుకు మద్దతిచ్చారు. మిగిలిన వారు ఇతర ప్రాంతాల్ని ఎంపిక చేశారు.
నాడు విశాఖను రాజధానిగా ఎందుకు ఎంపిక చేయలేదని చంద్రబాబు, నారాయణను నిలదీస్తే గుంటూరు, విజయవాడ కలిపి 47 శాతం అయిందంటూ దొంగ లెక్కలు చెప్పారు. అమరావతిని అభివృద్ధి చేయాలంటే రూ.లక్ష కోట్లు అవసరం. అంత డబ్బుతో 200 మెడికల్ కాలేజీలు, 200 స్టీల్ ప్లాంట్‌లు వస్తాయి. సీఎం జగన్ నిర్ణయానికి అంతా మద్దతు పలకాలి.
– వాసుపల్లి గణేష్‌కుమార్, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే
క్షుద్రశక్తులు.. వెన్నుపోటు రాజకీయాలు
రూ.3 లక్షల కోట్లు రెవెన్యూ వచ్చే విశాఖకు రాజధానిగా అన్ని హక్కులున్నాయి. కొన్ని క్షుద్రశక్తులు, ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు వికేంద్రీకరణను వ్యతిరేకిస్తూ వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారు. నెత్తిపై తన్నేవారిని చూస్తూ ఊరుకోలేం. ఉద్యమాల పురిటిగడ్డ ఉత్తరాంధ్రలో శాంతియుతంగా పోరాడతాం.
– కరణం ధర్మశ్రీ, చోడవరం ఎమ్మెల్యే
విస్తృతంగా చాటి చెప్పాలి..
వికేంద్రీకరణ ద్వారా ఉత్తరాంధ్రకు ఒనగూరే, ప్రయోజనం, మూడు రాజధానుల ఏర్పాటుతో రాష్ట్రవ్యాప్తంగా జరిగే అభివృద్ధిపై ప్రజలకు విస్తృతంగా తెలియచేయాలి. మేధావులు ఈ తరహా సదస్సులను నిర్వహించాలి. రాజకీయ అజెండాతో చేపట్టిన పాదయాత్ర లాంటి కార్యక్రమాలను విరమించుకోవాలని ఈ వేదిక ద్వారా పిలుపునిస్తున్నాం. ప్రాంతాల మధ్య చిచ్చు రగిల్చే చర్యలకు సున్నితంగా తెర దించాలని భావిస్తున్నాం.
– గుడివాడ అమర్‌నాథ్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment