స్పెషల్ వార్డులు ఇలా..
వ్యాక్సిన్ వేసే సమయంలో ఏవైనా దుష్ప్రభావాలు వచ్చిన వారికి అన్ని బోధనాసుపత్రుల్లో ప్రత్యేక వార్డును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇలాంటి వారిని తక్షణమే ఇక్కడకు తీసుకొస్తే వైద్యం చేసేలా 20 పడకలను అందుబాటులో ఉంచింది. ఈ వార్డులో జనరల్ ఫిజీషియన్, హృద్రోగ నిపుణులు, నరాల వైద్య నిపుణులు, అనస్థీషియా వైద్యనిపుణులను అందుబాటులో ఉంచింది.
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం కోవిడ్–19 టీకాను అనుమతించిన నేపథ్యంలో కొద్దిరోజుల్లోనే ఆంధ్రప్రదేశ్‌కు ఆ టీకా రానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నెలలో తొలిడోసుగా 1.70 లక్షల వయెల్స్ ఏపీకి రానుంది. ఈ నేపథ్యంలో టీకాను నిల్వ చేయడం, అక్కడి నుంచి పంపిణీ చేయడం వంటి వాటిపై అధికారులు దృష్టి సారించారు. టీకా పంపిణీలో కోల్డ్‌చైన్ మేనేజ్‌మెంట్ (శీతలీకరణ నిర్వహణ)అత్యంత కీలకం కానుంది. 8 మాసాల పాటు కోల్డ్‌చైన్ మేనేజ్‌మెంట్ చేయాల్సి రావడం ఒకరకంగా సవాలే. ప్రాధాన్యతల వారీగా ఎవరికి ఎప్పుడు వేయాలో నిర్ణయించడం వల్ల వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ పూర్తయ్యే వరకు శీతలీకరణ చేయాల్సిన అవసరం ఉంది. శీతలీకరణ కేంద్రాల వద్ద ఇప్పటికే పూర్తిస్థాయి పహరాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రెండ్రోజుల్లో తిరిగి వ్యాక్సిన్ నిర్వహణపై రాష్ట్రస్థాయి సమావేశం జరగనుంది.
వ్యాక్సిన్ నిర్వహణ ఇలా...
– ప్రతి శీతలీకరణ కేంద్రంలో వ్యాక్సిన్‌ను 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో భద్రపరుస్తారు.
– దీనికోసం అన్ని వ్యాక్సిన్ కేంద్రాల్లో నిరంతరంగా విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు.
– విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే జనరేటర్లు ఏర్పాటు.
– మండలస్థాయిలో తహశీల్దార్ మొదలుకొని రాష్ట్రస్థాయిలో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి వరకు వ్యాక్సిన్ నిల్వ, పంపిణీపై టాస్క్‌ఫోర్స్ కమిటీలతో పర్యవేక్షణ.
– ఒక్కో కేంద్రంలో 40 వేల లీటర్ల వ్యాక్సిన్ నిల్వ ఉంచేందుకుగాను గన్నవరం, విశాఖ, తిరుపతిల్లో వాక్ ఇన్ కూలర్స్ ఏర్పాటు.
– కర్నూలు, గుంటూరు, కడపల్లోని ఒక్కో కేంద్రంలో 16,500 లీటర్ల నిల్వ సామర్థ్యం ఉన్న వాక్ ఇన్ కూలర్స్ ఏర్పాటు.
– ఒక్కో కేంద్రంలో 20 వేల లీటర్ల నిల్వ సామర్థ్యంతో గన్నవరం, గుంటూరుల్లో వాక్ ఇన్ ఫ్రీజర్స్ ఏర్పాటు.
– శీతలీకరణ కేంద్రాల నుంచి వ్యాక్సినేషన్ కేంద్రాలకు తీసుకెళ్లేందుకుగాను ఐస్‌ప్యాక్స్, బాక్స్‌లను ప్రభుత్వం సిద్ధం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment