వచ్చీరాని మాటల వయసది.. బోసి నవ్వులతో ఆలిపించిన వంద దేవుళ్లే కలిసొచ్చినా (బిచ్చగాడు చిత్రం) పాట సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతే ఒక్కసారిగా ఆ చిన్నారి వాగ్దేవి ఫేమస్ అయింది. తల్లి శాంతమ్మ పర్యవేక్షణలో ఆలపించిన ఈ గీతం టాలీవుడ్ మ్యూజిక్ మెజిషియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఆరేళ్ల ప్రాయంలో జీ తెలుగు లిటిల్ ఛాంప్ సరిగమప విన్నర్‌గా నిలిచి బుల్లితెర లతా మంగేష్కర్‌గా శభాష్ అనిపించుకుంది. – మద్దిలపాలెం (విశాఖ తూర్పు)
‘వెయ్యి జన్మలెత్తిన నీ రుణం తీర్చుకోలేనమ్మ’కు 60 లక్షల వ్యూస్
శ్రీమాత రికార్డింగ్ కంపెనీ అధినేత పల్లి నాగభూషణ్‌రావు రచించిన వెయ్యి జన్మలేత్తినా నీ రుణం తీర్చుకోలేనమ్మా.. గీతాన్ని వాగ్దేవి తండ్రి వేణుమాధవ్ సంగీతం అందించారు. ఈ పాటను వాగ్దేవి ఆలపించింది. యూట్యూబ్ అప్‌లోడ్ చేయగా అనూహ్య రీతిలో 60 లక్షల వ్యూస్ లభించాయి.
వెండితెరపై వెలుగుతున్న వాగ్దేవి
కేరాఫ్ కంచరపాలెం ఫేం సంగీతం దర్శకుడు స్వీకర్ ఆగస్తీ మెయిల్ చిత్రంలో వాగ్దేవికి అవకాశం కల్పించారు. ప్రియాంకదత్ నిర్మాతగా ప్రియదర్శి íహీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో వాగ్దేవి టిపిరి..టిపిరి గీతాన్ని ఆలపించింది. హీరో విశ్వక్సేన్ చిత్రం పాయల్‌లో, జాతిరత్నలు చిత్ర సంగీత దర్శకుడు రథన్ కంపోజ్ చేసిన సిద్ శ్రీరామ్‌తో కలిసి అమ్మా అమ్మా నీ వెన్నెల.. నిత్యం నాపై ఉండాలి ఇలా...అనే గీతాన్ని ఆలపించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నామన్నారు.
అటు పాటలు..ఇటు డబ్బింగ్
వాగ్ధేవి ఓ వైపు పాటలతో అలరిస్తూనే..మరో వైపు బుల్లితెర చిన్నారి నటులకు డబ్బింగ్ చెబుతోంది. రామసక్కని సీత, జెమినిలో వస్తున్న భాగ్యరేఖ సీరియల్స్‌కు డబ్బింగ్ చెబుతోంది.
కీరవాణి ఫిదా
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వరా భక్తి చానల్‌లో వాగ్దేవి ఆలపించిన అన్నమయ్య కీర్తనలకు ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు
ఎం.ఎం.కీరవాణి ఫిదా అయ్యారు. వ్యాఖ్యాతగా ఉన్న గాయకురాలు సునీతను సైతం వరెవ్వా అనిపించింది. దీంతో బుల్లితెరపై అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి.
సాధించిన విజయాలు
►2007 లిటిల్ ఛాంప్ విన్నర్ సాయిదేవ హర్షతో వాగ్దేవి బుల్లితెరపై పాడడం ప్రారంభించింది
►ఐదేళ్ల ప్రాయంలో లవ్ ఇండియా నేషనల్ సింగింగ్ రియాల్టీ షోలో పాల్గొంది
►ఐదేళ్ల ప్రాయంలో హిందీ పాటాలు పాడేందుకు వాగ్దేవి ముంబై కేంద్రంగా లవ్‌మీ ఇండియా నేషనల్ సింగింగ్ రియాల్టీ షోకు ఎంపికైంది. ఈ షో హిమేష్ రేషి్మయా, నేహా బాసిన్‌ను తన గానంతో మైమరపించింది.
►జీ తెలుగు లిటిల్ చాంప్ సరిగమప విన్నర్ ( 2019 )గా నిలిచింది. దీంతో స్వర్ణభూమి సంస్థ రూ.35 లక్షల విలువైన విల్లా బçహూకరించారు.
మ్యూజిక్ ఫ్యామిలీ
వాగ్దేవి తల్లిదండ్రులు మాధవధారలో నివాసముంటున్నారు. తండ్రి సుదర్శనం వేణుమాధవ్ సంగీతం మాస్టర్‌గా, తల్లి శాంతి గాయని..అన్నయ్య సాయిదేవ హర్ష జీ లిటిల్ ఛాంప్ 2007 విన్నర్‌గా సుపరిచితులు.
మణిశర్మ సంగీత దర్శకత్వంలో...
అరుణగిరి ప్రొడక్షన్‌లో య్యూట్యూబ్ చానల్‌కు ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ఆధ్వర్యంలో 14 పాటల వాగ్దేవి ఆలపించే అవకాశం రావడం గొప్ప అవకాశమని ఆమె తల్లి శాంతి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment