
సాక్షి, విజయవాడ: తెలుగుదేశం హయాంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం కూల్చిన ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ సర్కార్ శ్రీకారం చుట్టింది. టీడీపీ ప్రభుత్వంలో కూల్చిన 9 ఆలయాల నిర్మాణంతో పాటు, 70 కోట్లతో ఇంద్రకీలాద్రిపై చేపట్టిన అభివృద్ధి పనులకు సీఎం వైఎస్ జగన్ శుక్రవారం భూమిపూజ చేయనున్నారు. అందులో భాగంగానే కృష్ణానది ఒడ్డున సీతమ్మపాదాల వద్ద శంకుస్థాపనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, సీపీ బత్తిన శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్‌తో కలిసి పర్యవేక్షించారు. చదవండి: ('టీడీపీ త్వరలో కనుమరుగవుతుంది')
ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ రామరాజ్యస్థాపనకు కృషిచేస్తున్నారు. కులాలు, మతాలు, పార్టీలతో సంబంధం లేకుండా అన్ని వర్గాలకు సంక్షేమం అందిస్తున్నారు. సీఎం జగన్‌కి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక టీడీపీ మతవిద్వేషాలు రెచ్చగొడుతోంది. అర్ధరాత్రులు ఆలయాలపై దాడులకు తెగబడుతూ కుట్రలు పన్నుతోంది. టీడీపీ పాలనలో పట్టపగలే ఆలయాలు కూల్చితే ప్రశ్నించని పవన్ ఇప్పుడు అనవసర రాద్ధాంతం చేస్తున్నాడు. రాజకీయ రాబందులకి రాష్ట్ర ప్రజలే గుణపాఠం నేర్పుతారు' అని మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు. చదవండి: (బాబుది నీచ బుద్ధి)