
సాక్షి, న్యూఢిల్లీ: సాంకేతికతను సరైన విధంగా వినియోగించుకోవడం ద్వారా తిరుమల దర్శన విధానంలో వచ్చిన సానుకూల మార్పులను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. అసౌకర్యానికి తావు లేకుండా రోజూ 70 వేల నుంచి లక్ష మంది దర్శనం చేసుకుంటున్న ఆ విధానాన్ని ఆదర్శంగా తీసుకుని, వివిధ రంగాల్లో సానుకూల సాంకేతిక సౌకర్యాలు రావాలని సూచించారు. శనివారం ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ సమావేశ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి డాక్టర్ ఎం.రామచంద్రన్ రచించిన ‘బ్రింగింగ్ గవర్నమెంట్స్ అండ్ పీపుల్ క్లోజర్’ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వర్చువల్ వేదికగా ఆవిష్కరించారు.
ప్రజల జీవితాల నాణ్యతను పెంచడం, సౌకర్యాలను అందించడమే సుపరిపాలనకు గీటురాయి అని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యకలాపాలను సౌకర్యవంతంగా, పారదర్శకంగా, ఇబ్బందుల్లేకుండా పొందాలని ప్రజలు భావిస్తారన్న రచయిత అభిప్రాయాలతో తాను ఏకీభవిస్తున్నానన్న ఉపరాష్ట్రపతి, ఈ సదుపాయాన్ని కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత డా. ఎం.రామచంద్రన్, పలువురు సీనియర్ అధికారులు, ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.