కేంద్ర మంత్రి మాండవీయతో రాష్ట్ర మంత్రి రజని
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: ఏపీలో నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాలలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం అందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ మన్సుక్ మాండవీయను కోరారు. ఆమె బుధవారం కేంద్రమంత్రిని న్యూఢిల్లీలోని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్యశాఖకు సంబంధించి పలు విషయాలను చర్చించి వినతిపత్రాలు ఇచ్చారు. పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్లలో వైద్యకళాశాలల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు.
రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కనీసం ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఉండేలా 16 వైద్య కళాశాలల నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఇప్పటికే వీటి నిర్మాణం ప్రారంభమైందన్నారు. వీటికి తగిన ఆర్థికసాయం అందించాలని కోరారు. వైద్య ఆరోగ్య రంగంలో ఏపీలో తీసుకొస్తున్న కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వ చేయూత తోడైతే ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. రాష్ట్రంలో త్వరలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేయబోతున్నట్లు చెప్పారు.
పూర్తిస్థాయిలో సహకరిస్తాం
ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాండవీయ మాట్లాడుతూ రాష్ట్రంలో వైద్య కళాశాలల నిర్మాణానికి సాయం చేస్తామని చెప్పారు. 10 లక్షల జనాభా దాటిన ప్రతి జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మించుకునే అవకాశం ఉందన్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానానికి, హెల్త్ క్లినిక్‌ల నిర్మాణానికి కూడా సహకరిస్తామని తెలిపారు. ఏపీలో రైల్వే, ఈఎస్‌ఐ ఆస్పత్రుల పరిధిలో వైద్య కళాశాలల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపితే వెంటనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం రాష్ట్ర మంత్రి రజని మీడియాతో మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయాలు, విలేజ్ క్లినిక్‌ల అధ్యయనానికి సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలనకు ప్రధాని నరేంద్రమోదీని ఏపీకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు కేంద్రమంత్రి చెప్పారన్నారు. రాష్ట్రంలో వైద్యం, ఆరోగ్యం విషయంలో సీఎం వైఎస్ జగన్ ముందుకెళ్తున్న తీరును ఆయన ప్రశంసించారని తెలిపారు. రాష్ట్ర మంత్రి వెంట ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఏపీభవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్‌ప్రకాష్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment