YSRCP MP Vijaya Sai Reddy Comments On Union Budget 2022 Over AP Budget - Sakshi
Sakshi News home page

Vijaya Sai Reddy: ఏపీకి ఆత్మనిర్భరత ఏది?

Published Thu, Feb 10 2022 4:41 AM | Last Updated on Thu, Feb 10 2022 10:55 AM

Vijaya Sai Reddy Comments On Union Budget 2022 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: విభజన తర్వాత ఆర్థికంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ఆత్మనిర్భరత ఎక్కడుందని కేంద్ర ప్రభుత్వాన్ని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. బడ్జెట్‌లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్‌ ఆపరేషన్‌ సక్సెస్‌.. పేషెంట్‌ డెడ్‌ అన్నట్లుగా ఉందన్నారు. ఎన్నికల రాష్ట్రాలకే బడ్జెట్‌ అని తొలుత భావించినా చివరకు ఏ రాష్ట్రానికీ చెందని బడ్జెట్‌లా ఉందని విమర్శించారు. రాజ్యసభలో బుధవారం బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. బడ్జెట్‌లో ఆర్భాటం తప్ప విషయం లేదన్నారు. రాష్ట్రాల వాటాను కేంద్రం తెలివిగా ఎలా సొంతం చేసుకుంటోందో గణాంకాలతో సహా సభకు వివరించారు. ఆయన ప్రసంగం ఆయన మాటల్లోనే..

రాష్ట్రాల వాటా తెలివిగా లాగేస్తున్నారు 
‘కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు న్యాయంగా దక్కాల్సిన వాటాను తగ్గించడంలో కేంద్రం చాలా తెలివిగా వ్యవహరిస్తోంది. బడ్జెట్‌ గణాంకాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం స్థూలపన్నుల ఆదాయంలో ఉద్దేశపూర్వకంగానే సెస్సులు, సర్‌చార్జీలను పెంచుకుంటూ పోయింది. సెస్సులు, సర్‌చార్జీల పేరిట వచ్చే ఆదాయంలో నయా పైసా వాటా కూడా రాష్ట్రాలకు ఇవ్వాల్సిన అవసరం లేనందునే కేంద్రం ఈ పనిచేస్తోంది. కేంద్రానికి వచ్చే స్థూలపన్నుల ఆదాయంలో డివిజబుల్‌ పూల్‌ కింద రాష్ట్రాలకు 41 శాతం వాటాను పంపిణీ చేయాలని 15వ ఆర్థికసంఘం సిఫార్సు చేసింది. అయితే.. డివిజబుల్‌ పూల్‌లోకి రాని సెస్సులు, సర్‌చార్జీల పేరిట కేంద్రం వసూలు చేస్తోంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు పన్నుల పంపిణీలో దక్కాల్సిన వాటా 41 శాతం నుంచి 29 శాతానికి పడిపోయింది.

పెట్రోల్, డీజిల్‌ సెస్సులో రాష్ట్రాలకు ఇచ్చిందెంత?
పెట్రోల్, డీజిల్‌పై విధించిన సెస్సు ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.3.35 లక్షల కోట్లు ఆర్జించినా అన్ని రాష్ట్రాలకు కలిపి ఇచ్చింది 5.8 శాతం.. అంటే రూ.19,475 కోట్లు మాత్ర మే. పెట్రోల్, డీజిల్‌పై స్పెషల్‌ అడిషనల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ పేరుతో కేంద్రం మరో రూ.2.87 లక్షల కోట్లు వసూలు చేసింది. ఎక్సైజ్‌ డ్యూటీ కింద రాష్ట్రాలకు వచ్చే ఆదాయంలో పెట్రోల్‌పై 40 శాతం, డీజిల్‌పై 59 శాతం తగ్గిపోయింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై 85 శాతానికిపైగా ఎక్సైజ్‌ డ్యూటీని సెస్‌ రూపంలో వసూలు చేస్తోంది. లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100 ఉంటే అందులో పలు సెస్‌ల కారణంగా రాష్ట్రాలకు రూ.1.40 మాత్రమే పంపిణీ అవుతోంది.

డివిజబుల్‌ పూల్‌లో 4.1 శాతానికి పడిపోయిన ఏపీ వాటా
కేంద్ర ప్రభుత్వం డివిజబుల్‌ పూల్‌ నుంచి రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సిన పన్నుల వాటాలో ఏపీ వాటా నానాటికీ తగ్గిపోతోం ది. 13వ ఆర్థికసంఘం (2010–15) సిఫా ర్సుల ప్రకారం డివిజబుల్‌ పూల్‌లో ఏపీ వాటా 6.9 శాతం. 14వ ఆర్థికసంఘం (20 15–20) దాన్ని 4.3 శాతానికి తగ్గించింది. 15వ ఆర్థికసంఘం (2021–20 26) సిఫా ర్సుల ప్రకారం డివిజబుల్‌ పూల్‌లో ఏపీ వాటా 4.1 శాతానికి పడిపోయింది.  సెస్సులు, సర్‌చార్జీల పేరుతో కేం ద్రం దొడ్డిదారిన వసూలు చేసే ప న్నులతో డివిజబుల్‌ పూల్‌లో జమయ్యే స్థూ ల ఆదాయం మొత్తం క్షీణిస్తుంటే మరోవైపు ఆర్థికసంఘం సిఫార్సుల కారణంగా డివి జబుల్‌ పూల్‌ నుంచి వచ్చే ఏపీ ఆదాయం తగ్గిపోతోంది.  

ఏపీ, కేంద్ర బడ్జెట్‌ మధ్య అంతరం 
సమాజంలోని అన్నివర్గాల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో నామమాత్రపు కేటాయింపులు జరపడం సరికాదు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున ఆర్థిక అరాచకానికి పాల్పడినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శనీయమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఏపీ 2021–22 బడ్జెట్‌లో వ్యవసాయానికి 5.9 శాతం నిధులు కేటాయిస్తే, 2022–23 బడ్జెట్‌లో కేంద్రం 3.8 శాతం కేటాయించింది. విద్యారంగానికి ఏపీ 11.8 శాతం నిధులు కేటాయిస్తే కేంద్ర బడ్జెట్‌లో అది 2.6 శాతం మాత్రమే. ఆరోగ్యరంగానికి ఏపీ బడ్జెట్‌లో 6 శాతం కేటాయిస్తే కేంద్ర బడ్జెట్‌లో 2.2 శాతం, గ్రామీణాభివృద్ధికి ఏపీ 7.1 శాతం నిధులిస్తే కేంద్రం 5.2 శాతం, సామాజిక సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌లో 12.1 శాతం నిధులు కేటాయిస్తే కేంద్రం 1.3 శాతం మాత్రమే కేటాయించింది. 

మధ్య తరగతికి ఊరట లేని బడ్జెట్‌
కేంద్ర పన్నుల ఆదాయంలో 10 శాతం పెరుగుదల నమోదైనప్పటికీ బడ్జెట్‌లో మధ్య తరగతి ప్రజలకు ఎలాంటి ఊరట కల్పించలేదు. ఆదాయపన్ను శ్లాబుల్లో మార్పు చేయనందున మధ్య తరగతి ప్రజల మిగులు ఆదాయం తగ్గిపోయింది. పెరిగిన ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఐటీ డిడక్షన్లలో మినహాయింపులు ఇవ్వాలి. ఒకే ఫారంతో ఐటీ రిటర్న్‌ దాఖలు చేసుకునే అవకాశం కల్పించాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement