స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సభలో మాట్లాడుతున్న ఎంపీ విజయసాయిరెడ్డి. చిత్రంలో మంత్రి అవంతి, ఎంపీ ఎంవీవీ, ఎమ్మెల్యేలు, వామపక్ష నేతలు
ఉక్కునగరం (గాజువాక)/ద్వారకానగర్ (విశాఖ దక్షిణ): విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రస్తుత గడ్డు పరిస్థితులను అధిగమించడానికి మూడు ఆర్ (రివైవల్, రీ స్ట్రక్చర్, రీఆర్గనైజింగ్)లు ముఖ్యమని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధానకార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్‌కు ఉన్న రుణాలను మూలధనంగా మార్చడం, ఉత్పత్తి స్థిరీకరణ చేయడం, సొంత గనులు ఇవ్వడం అత్యంత అవసరమన్నారు. ఉక్కు అఖిల పక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం స్టీల్‌ప్లాంట్‌లోని పొట్టి శ్రీరాములు కూడలి వద్ద జరిగిన స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ సభలో ఆయన ఉద్యోగులనుద్దేశించి మాట్లాడారు. గత ఐదేళ్లుగా స్టీల్‌ప్లాంట్ సమస్యలపై రాజ్యసభలో మాట్లాడుతూనే ఉన్నానన్నారు. ప్లాంట్ ప్రైవేట్‌పరం అయ్యే అవకాశం ఉందని, గనులు ఉంటేనే ప్లాంట్‌కు లాభాలు వస్తాయని ఎన్నికల ముందు స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ప్రచార సభలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్రమంత్రితో గనుల అంశంపై మాట్లాడినప్పుడు గనుల బిడ్డింగ్‌లో పాల్గొనాలని చెప్పిన సలహాను.. స్టీల్‌ప్లాంట్ యాజమాన్యానికి చెప్పినా పట్టించుకోలేదన్నారు. రాజకీయాలకతీతంగా స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు ఉద్యమించాల్సి ఉందన్నారు.
దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష
మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ గుంటూరుకు చెందిన టి.అమృతరావు దీక్షతో జరిగిన మహోద్యమంతో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటైందన్నారు. కేంద్ర ప్రభుత్వాలు అన్ని దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతూనే ఉన్నాయన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇస్తానన్న రైల్వే జోన్, ప్రత్యేక హోదా ఇవ్వకపోగా ఇప్పుడు స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలని కుట్ర చేస్తోందన్నారు. విశాఖ ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ ఈ విషయమై వైఎస్సార్‌సీపీ ఎంపీలమంతా ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి, ఉక్కు శాఖ మంత్రి, హోంమంత్రులను కలిసి తమ నిరసన తెలిపామన్నారు. ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, గుడివాడ అమర్‌నాథ్, అదీప్‌రాజ్ మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యేలు చింతలపూడి వెంకట్రామయ్య, గురుమూర్తిరెడ్డి, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కె.కె.రాజు, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్.నరసింగరావు, వివిధ కార్మీక సంఘాలు, అసోసియేషన్ల నాయకులు పాల్గొన్నారు.
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు పూర్తి వ్యతిరేకం
నష్టాల పేరుతో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయడాన్ని వైఎస్సార్‌సీపీ పూర్తిగా వ్యతిరేకిస్తోందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. కేంద్రం వైఖరికి నిరసనగా విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ బుధవారం జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఒక రోజు దీక్ష చేపట్టారు. విజయసాయిరెడ్డి హాజరై మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment