సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ)లకు మరిన్ని అధికారాలివ్వాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి చెప్పారు. కేంద్రం, రాష్ట్రంలోని కార్యనిర్వాహక అధిపతులను, మొత్తం న్యాయ వ్యవస్థను మినహాయించి అన్ని ప్రభుత్వ కార్యాలయాల అధికారులకు సమన్లు జారీ చేసే అధికారాలను ఇవ్వాలని అన్నారు. కొన్ని ఆంశాలపై దర్యాప్తు కోసం కాగ్‌కి సూచించే అధికారం పీఏసీకి లేదని, మెజారిటీ సభ్యుల నిర్ణయం ప్రకారం కాగ్‌కి అంశాలను సూచించడానికి అనుమతించాలని కోరారు. శనివారం పార్లమెంట్‌లో జరిగిన పార్లమెంటు, రాష్ట్రాల పీఏసీల అధ్యక్షుల సదస్సులో ఆయన ప్రసంగించారు. ‘పీఏసీల సిఫార్సుల అమలు – సమయపాలన – ఖచ్చితమైన సమ్మతి కోసం మెకానిజం’ అనే అంశంపై మాట్లాడారు.
కాగ్ నివేదికలోని అంశాల ప్రాధాన్యత తగ్గిపోకముందే, వాటిని పీఏసీలు పరిశీలించాలని సూచించారు. దీని ద్వారా పీఏసీలు మరింత శక్తివంతమవుతాయని తెలిపారు. కాగ్ నివేదికల్లో పరిశీలించాల్సిన అంశాలు, వ్యవధితో వార్షిక క్యాలెండర్‌ను రూపొందించాలని చెప్పారు. 2010 కామన్వెల్త్ క్రీడల గేమ్స్ అవినీతిపై పీఏసీ నివేదిక 7 సంవత్సరాల తర్వాత ఇచ్చిందని, ఈ ఆలస్యం వల్ల కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందనే వాస్తవాన్ని అందరూ మరిచిపోయారని చెప్పారు. పబ్లిక్ అకౌంట్లలోని అస్థిరతలను సరైన సమయంలో గుర్తించి, మొగ్గలోనే తుంచివేయడం ఎంత కీలకమో చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని తెలిపారు.
విజయసాయిరెడ్డి చేసిన మరికొన్ని సూచనలు..
► పీఏసీ సిఫార్సులను ప్రభుత్వాలు ఏ విధంగా ఆచరణలో పెట్టాయో అంచనా వేయడానికి మానిటరింగ్ ఫ్రేమ్‌వర్క్ ప్రధానమైనది. పీఏసీ సిఫార్సులపై సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాలు తీసుకున్న చర్యల సమర్పణను రియల్ టైంలో ఆన్‌లైన్ ద్వారా పర్యవేక్షించే ఆడిట్ పారా మానిటరింగ్ సిస్టమ్ పోర్టల్ ప్రభావవంతంగా పనిచేసేందుకు రెండు ప్రధాన సమస్యలు అడ్డంకిగా ఉన్నాయి. కాగ్ నివేదికలను పీఏసీ సత్వరమే చర్చించలేకపోవడం ఓ సమస్య.
► మంత్రిత్వ శాఖలు తీసుకున్న చర్యల సమర్పణలో ఆలస్యం మరో సమస్య. ఈ చర్యల ప్రత్యుత్తరాలను సమర్పించేలా చూసేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖలో సెక్రటరీ స్థాయి నోడల్ అధికారిని నియమించాలి.
► మంత్రిత్వ శాఖలు, విభాగాలు తీసుకున్న చర్యలపై ప్రత్యుత్తరాల కోసం ఒక ఫార్మాట్‌ను రూపొందించాలి. దీని ద్వారా మంత్రిత్వ శాఖలు జవాబుదారీతనం నుంచి తప్పించుకోలేవు
► ఆడిట్ పారా మానిటరింగ్ సిస్టమ్ పోర్టల్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచాలి
► పీఏసీ ఆఫ్ విక్టోరియా (ఆస్ట్రేలియా) అనుసరించే స్వీయ–అప్రైజల్ మోడల్‌ను అనుసరించాలి. దీనివల్ల రాబోయే సంవత్సరానికి లక్ష్యాలను, గత పనితీరును వివరించే వార్షిక ఎజెండాను నిర్ణయించవచ్చు
► పీఏసీ సభ్యులు ఆడిట్ నివేదికను అర్థం చేసుకోవడానికి కాగ్ ఉద్యోగులను డిప్యుటేషన్‌పై సాంకేతిక సలహాదారులుగా నియమించాలి.
► పీఏసీ సమావేశాలను యూఎస్‌ఏలో మాదిరిగా ప్రత్యక్ష ప్రసారం చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment