ట్రాక్టర్‌తో గేట్‌ను ఢీకొట్టి లోపలికి ప్రవేశించిన గ్రామస్తులు
అడ్మినిస్ట్రేషన్ భవనంలో సామగ్రి ధ్వంసం
పోలీసుల లాఠీచార్జ్ ఐదుగురికి గాయాలు
బాధితులు, గ్రామస్తులతో కలెక్టర్ చర్చలు
మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల చెక్కు అందజేత
బూదవాడ (జగ్గయ్యపేట) : ఎన్టీఆర్ జిల్లా బూదవాడ గ్రామంలోని అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో ఆదివారం జరిగిన బాయిలర్ పేలుడు ప్రమాద ఘటనలో గ్రామానికి చెందిన ఆవుల వెంకటేష్ మృతితో పాటు మరికొందరు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా యాజమాన్యం కనీసం స్పందించకపోవడంపై గ్రామస్తులు తీవ్రస్థాయిలో స్పందించారు. రెండోరోజైన సోమవారం గ్రామస్తులు.. బాధితుల కుటుంబ సభ్యులు మెయిన్ గేట్‌వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.
అక్కడ పోలీసులు నిలువరించినప్పటికీ ట్రాక్టర్లతో మెయిన్ గేట్‌ను ఢీకొట్టి లోపలికి దూసుకెళ్లారు. అడ్మినిస్ట్రేషన్ భవనం వైపునకు వెళ్లి కర్రలు, రాళ్లు, ఇనుప రాడ్లతో సామగ్రిని ధ్వంసంచేసి కంప్యూటర్లను పగలగొట్టారు. కార్యాలయంలోని విలువైన రికార్డులను చించేశారు. దీంతో పోలీసులు వారిని కట్టడి చేసేందుకు లాఠీచార్జి చేయడంతో వారంతా శాంతించారు. ఈ సందర్భంగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
కలెక్టర్ చర్చలు..
గ్రామస్తులు కర్మాగారాన్ని ముట్టడించడంతో సమాచారం అందుకున్న కలెక్టర్ సృజన తెలంగాణ గేటులో నుంచి లోపలికి వచ్చారు. అప్పటికే అక్కడ ఉన్న గ్రామస్తులు, ఆదివారం రాత్రి మృతిచెందిన వెంకటేష్ కుటుంబ సభ్యులతో ఆమె చర్చలు జరిపారు. గ్రామస్తులు మాట్లాడుతూ.. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఘటన జరిగిందని మూడు నెలలుగా బాయిలర్ మరమ్మతులు చేపట్టాలని చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు.
అలాగే, ప్రమాదం జరిగి రెండు గంటలైనా యాజమాన్యం స్పందించకపోవడంతో తామే క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించామని తెలిపారు. వైద్య శిబిరం కూడా ఏర్పాటుచేయటంలేదని సీఎస్‌ఆర్ ఫండ్‌తో గ్రామాన్ని అభివృద్ధిచేయాలని.. మృతుని కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని.. క్షతగాత్రులకు రూ.25 లక్షల ఆరి్థక సహకారం అందించాలని డిమాండ్ చేశారు. దీంతో కలెక్టర్ స్పందిస్తూ.. ఈ ప్రమాదంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
మృతుని కుటుంబానికి కంపెనీ యాజమాన్యం రూ.50 లక్షలు నష్టపరిహారం అందిస్తుందని.. చికిత్స పొందుతున్న వారికి రూ.25 లక్షలు, గాయపడిన వారికి రూ.ఐదు లక్షలు నష్టపరిహారం అందిస్తామని చెప్పారు. మృతుని కుటుంబంలోని ఒకరిని కంపెనీలో ఉద్యోగంతో పాటు పిల్లలను కంపెనీ పాఠశాలలో చదివించనున్నట్లు చెప్పారు. అనంతరం.. యాజమాన్యం నుంచి ప్లాంట్ హెడ్ సతీష్, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ చేతుల మీదుగా కలెక్టర్ రూ.50 లక్షల చెక్కును మృతుని భార్య త్రివేణికి అందించారు. ఈ కార్యక్రమంలో జేసీ సంపత్‌కుమార్, ఆర్డీఓ రవీంద్ర, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ శ్రీనివాస్, పరిశ్రమల శాఖ జీఎం సుధాకర్, జిల్లా అసిస్టెంట్ లేబర్ అధికారి రాఘవేంద్ర నాయక్, స్థానిక అధికారులు పాల్గొన్నారు.
ఆందోళనకరంగానే క్షతగాత్రుల పరిస్థితి..
ఇదిలా ఉంటే.. పేలుడు ధాటికి గాయపడిన దారావత్ శివనారాయణ, గుగులోతు గోపినాయక్, పరిటాల అర్జున్, బాణావత్ స్వామిల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. 90 శాతం శరీరం కాలిపోవటంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment