లోపిస్తే శరీరం రోగాలమయం
సూర్యరశ్మి శరీరానికి తాకకపోవడంతో ఇబ్బందులు
తగ్గుతున్న వ్యాధి నిరోధకశక్తి
వైద్య పరీక్షల్లో వెలుగు చూస్తున్న వైనం
కాస్త ఎండన పడండి.. అంటున్న వైద్యులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ డి చాలా అవసరం. సూర్యకిరణాల నుంచి సహజంగా లభించే ‘విటమిన్ డి’కి దూరమైతే మధుమేహం, గుండెజబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులు సోకే అవకాశం ఉంది. అందుకే బద్ధకం వీడి ఉదయాన్నే లేవండి. కాస్త ఎండన పడండి, ఆరోగ్యంతో జీవించండి అంటూ వైద్యులు సూచిస్తున్నారు.
మారిన లైఫ్‌స్టైల్..
మారుతున్న కాలానుగుణంగా చదువు, ఉద్యోగాలు, వ్యాపారాలతో మనిషి జీవితం నిరంతరం బిజీ బిజీగా మారుతోంది. ఉదయం 8 గంటలైనా లేవక పోవడం, రాత్రి 12 దాటినా మేల్కొని ఉండటం, నగర వాసులకు నిత్యకృత్యమైంది. చాలా మంది నగర వాసులకు సూర్యోదయమే తెలియకుండా పోతోంది. తద్వారా డి విటమిన్‌కు దూరమై అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఒకప్పుడు తెల్లవారు జామున 5 గంటలకే నిద్రలేచి దైనందిన కార్యక్రమాల్లో నిమగ్నమయ్యే వారు. కానీ రోజులు మారాయి. సిటీ జనులు మాత్రం చాలా మంది ఉదయం 8 గంటల తర్వాతనే నిద్రలేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు చక్కబెట్టుకుని రోడ్డు మీదకు వచ్చేటప్పటికీ ఎండ మండుతోంది. దీంతో ఉదయపు వేళల్లో సూర్యరశ్మి కారణంగా శరీరానికి అందే విటమిన్ డి పొందలేక పోతున్నారు. ఇటీవల కాలంలో వైద్యుల వద్దకు విటమిన్ డి లోపం సమస్యలతో వస్తున్న వారి సంఖ్య పెరిగింది. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి అన్ని రకాల విటమిన్‌లు అందాలి. ఏ ఒక్క విటమిన్ తక్కువైనా శరీరం అనారోగ్యానికి గురవుతుంది. అందులో విటమిన్ డి చాలా ప్రధానమైంది. కండరాలు, ఎముకలు, ప్రతి ఒక్క భాగం ఆరోగ్యంగా ఉండాలంటే డి విటమిన్ తప్పనిసరి.
నవజాత శిశువులకు అవసరమే..
ఒకప్పుడు పుట్టిన బిడ్డని కాసేపు ఎండలో ఉంచేవారు. తద్వారా చిన్నారులకు డి విటమిన్ సమృద్ధిగా లభించేది. కానీ ప్రస్తుతం పిల్లలను ఎండలో తిప్పితే నల్లబడి పోతారని, ఇంటి నుంచి బయటకు తీసుకురావడమే లేదు. దీంతో చిన్నారులకు నేరుగా సూర్యరశ్మి అందే అవకాశం లేకుండా పోతోంది. విటమిన్ డి చిన్నారులకు సమృద్ధిగా అందితే బరువు పెరగడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెబుతున్నారు.
నీడపట్టున ఉద్యోగం అనుకుంటే..
నీడపట్టున కూర్చుని పనిచేసే ఉద్యోగం అంటే చాలా లగ్జరీగా భావిస్తారు. కానీ ఇదే వారి అనారోగ్యానికి కారణం అవుతోంది. ఎండ బారిన పడకుండా హాయిగా ఏసీ గదిలో కూర్చుని పనిచేసే వారికి విటమిన్ డి లోపం అధికంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఆఫీస్ గదుల్లోనే ఉండే ఉద్యోగులు, షిఫ్ట్ ఉద్యోగులు, హెల్త్ కేర్ వర్కర్స్‌కు విటమిన్ డి లోపం ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు.
విటమిన్ డి తక్కువైతే..
శరీరంలో విటమిన్ డి తక్కువైతే తీవ్రమైన అలసట, బలహీనత, నీరసం, నడుంనొప్పి, బలహీనమైన కండరాలు, ఆలోచన శక్తి తగ్గిపోవడం, డిప్రెషన్, మానసిక స్థితిలో తేడా కనిపిస్తుంది. తరచూ ఇన్‌ఫెక్షన్‌ల బారిన పడతారు. తరచుగా ఎముకలు విరగడం, పగుళ్లు రావడంతో పాటు, జట్టు రాలడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మెదడు పనితీరుపైనా తీవ్ర ప్రభావం ఉంటుంది. వ్యాధి నిరోధకశక్తి తగ్గుతుంది. పిల్లల్లో రికెట్స్, పెద్దల్లో కీళ్ల వ్యాధులు వస్తాయి. ఇన్సులిన్‌పై ప్రభావం చూపుతుంది. దీంతో రక్తంలోని గ్లూకోజ్ త్వరగా ఖర్చుకాకపోవడంతో సుగర్ వస్తుంది. మహిళల్లో మోనోపాజ్ తర్వాత సహజంగా కాల్షియం తగ్గుతుంది. కాల్షియం తగ్గితే క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ.
విటమిన్ డి అవసరం..
శరీరానికి డి విటమిన్ ఎంతో అవసరం. విటమిన్ డి లోపంతో కండరాల, ఎముకలు బలహీన పడతాయి. ప్రతి ఒక్కరూ వ్యాధి నిరోధకశక్తిని పెంచుకునేందుకు విటమిన్ డి అవసరం. ఇది సహజంగా సూర్యరశ్మి ద్వారా లభిస్తుంది. ఎండలో కొద్దిసేపు గడపడంతో పాటు వైద్యుల సూచనలు పాటిస్తే డి విటమిన్ లోపాన్ని అధిగమించవచ్చు. ఇటీవల కాలంలో విటమిన్ డి లోపం ఉన్న వారిని ఎక్కువగా చూస్తున్నాం. – డాక్టర్ కె. సుధాకర్, ఆర్థోపెడిక్ నిపుణుడు, జీజీహెచ్
వీటిల్లో విటమిన్ డి పుష్కలం..
చేపలు, లివర్, కాడ్‌లివర్ ఆయిల్, కోడిగుడ్లు, ఆర్గాన్ మీట్స్, పాలు, పన్నీరు, నెయ్యి, వెన్న, పుట్టగొడుగుల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆహారంలో ఈ పదార్థాలను తప్పక చేర్చుకోవాలి. తరచూ వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఆహారం కంటే ముఖ్యంగా పైసా ఖర్చులేకుండా ఉదయం ఎండలో కాసేపు గడిపితే విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది.
– గర్రే హరిత, నూట్రీíÙయన్
Comments
Please login to add a commentAdd a comment