Viveka PA Krishna Reddy Sensational Comments In TV Channel Interview, Details Inside - Sakshi
Sakshi News home page

నర్రెడ్డి సోదరులు చెప్పినట్టే చేశా: వివేకా పీఏ కృష్ణా­రెడ్డి

Published Sat, May 6 2023 6:34 AM | Last Updated on Sat, May 6 2023 10:29 AM

Viveka PA Krishna Reddy sensational comments in TV channel interview - Sakshi

సాక్షి ప్రతినిధి, కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి మృతి చెందాక ఆయన అల్లుడు.. బావమరిది నర్రెడ్డి రాజశేఖర­రెడ్డి, అతని సోదరుడు నర్రెడ్డి శివప్రకాశ్‌­రెడ్డిలు చెప్పి­నట్టే చేశానని వివేకా పీఏ కృష్ణా­రెడ్డి స్పష్టం చేశారు. పెద్దోళ్లు కనుక వారు చెప్పినట్టే చేయాల్సి వచ్చిందన్నారు. ‘వారు చెప్పినట్లు చేయకపోతే నువ్వు కూడా జైలుకు వెళ్తావు’ అని వివేకా కుమార్తె సునీ­తమ్మ కూడా చెప్పడంతో వారి సూచనల మేరకు నడుచుకున్నానని పునరు­ద్ఘా­టించారు.

వివేకా మృతదేహాన్ని చూడగానే తనకొచ్చిన సందేహాలన్నింటినీ వారికి స్పష్టంగా వివరించానని, అయినా వారి మార్గనిర్దేశం మేరకే వ్యవహరించానని ఇటీవల ఆయన ఓ టీవీ చానల్‌­(ఎన్‌టీవీ)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాటి ఘటన అనంతర పరిస్థితిని పూసగచ్చినట్లు వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

రోజూలాగే ఆ రోజూ వెళ్లాను
నేను 30 ఏళ్లకు పైగా వివేకా సార్‌ వద్ద పని చేస్తున్నాను. ప్రతిరోజు 5.30 గంటలకు సార్‌ ఇంటికి వెళ్లే అలవాటు. ఆ రోజు కూడా అలాగే వెళ్లాను. ఆయన నిద్ర లేచి ఉంటే హాలులో లైట్‌ వేస్తారు. వాచ్‌మెన్‌ రంగన్న పడుకొని ఉన్నాడు. సార్‌ ఇంకా లేవలేదని బయటికి వచ్చి, వీధిదీపం కింద ఐదు నిమిషాలు ఆంధ్రజ్యోతి పేపర్‌ తిరగేశాను. వివేకా సతీమణి సౌభాగ్యమ్మకు ఫోన్‌ చేశాను. ‘సార్‌ లేట్‌గా వచ్చి ఉంటాడులే.. కొద్దిసేపు పడుకోని’ అని ఆమె సూచించారు.

తిరిగి పేపర్‌ చదువుతుండగా.. వంట మనిషి లక్ష్మి, ఆమె కుమారుడు వచ్చారు. సార్‌ ఇంకా లేవలేదా? అని అడిగారు. ‘రాత్రి లేట్‌గా వచ్చి ఉంటారు.. లేప వద్దని మేడమ్‌ చెప్పింది’ అని చెప్పాను. కొద్ది సేపటి తర్వాత.. సార్‌ లేవకపోతే లేపాలి కదా.. మళ్లీ ఎందుకు లేపలేదు.. అని అరుస్తారని వంటమనిషి లక్ష్మిని బెడ్‌ రూమ్‌ సైడుకు వెళ్లి పిలవాలని చెప్పాను. లక్ష్మి బెడ్‌రూము వద్దకు వెళ్లి పిలిచి వచ్చే సమయంలో వాచ్‌మెన్‌ రంగన్న లేచి.. బెడ్‌షీట్‌ను సందులో పెట్టి ఉత్తరం వైపు ఉండే గార్డెన్‌ వైపు వెళ్లిపోయాడు. అంతలోనే వాచ్‌మెన్‌ రంగన్న పరుగెత్తుకుంటూ వచ్చి సార్‌ పడిపోయాడని చెప్పాడు. నేను వంటమనిషి కుమారుడు ప్రకాశ్‌ నార్త్‌ సైడ్‌ వాకిలి గుండా లోపలికి పరుగెత్తాము. 

లోపలికి వెళ్లి చూస్తే అంతా రక్తమే
ఇంట్లోకి వెళ్లి చూసేసరికి బెడ్‌ రూం అంతా రక్తం. భయం వేసింది. ఏసీ, లైట్‌ ఆన్‌లో ఉంది. సార్‌ మాత్రం బెడ్‌పై లేడు. బాత్‌రూములో పడిపోయి ఉన్నాడు. నాడి పట్టుకుని చూశా. తలపై గాయం కనిపిస్తోంది. నాతోపాటు ఉన్న ప్రకాశ్‌తో మన సార్‌ మనకు లేడని చెప్పా. బయటికి వచ్చి వివేకా సార్‌ అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి ఫోన్‌ చేశాను. ‘బావ ఇక మనకు లేడు. ఎవరో ఏదో చేశారు. ఏదో జరిగింది. తలపై గాయం కనిపిస్తోంది. ఇల్లంతా రక్తం ఉంది’ అని చెప్పాను. తర్వాత ఆయన సోదరుడు శివప్రకాశ్‌రెడ్డికి కూడా అదే చెప్పాను.

తర్వాత కొద్ది సేపటికి వైఎస్‌ వివేకా మొబైల్‌ సోఫాలో కనిపించింది. సైలెంట్‌లో ఉంది. ఏదో ఫోన్‌ రావడంతో రింగ్‌ అవుతున్నట్లు గుర్తించి, జేబులో పెట్టుకున్నాను. బెడ్‌ ముందు ఉన్న వీల్‌ చైర్‌ ముందు ఓ పేపరు పడి ఉంది. ప్రకాశ్, నేను దాన్ని ఓపెన్‌ చేసి చూశాము. అందులో సార్‌ రాసిన మ్యాటర్‌ ఉంది. ఆ లెటర్‌లో అక్షరాలు అంత క్లియర్‌గా లేవు. బాగా పరిశీలిస్తే ‘డ్రైవర్‌ ప్రసాద్‌ నిన్న డ్యూటీకి త్వరగా రమ్మన్నందుకు నన్ను కొట్టి చంపాడు. మీరు డ్రైవర్‌ ప్రసాద్‌ను వదిలి పెట్టవద్దు’ అని రెండుసార్లు రాసి ఉంది. కింద వైఎస్‌ వివేకా అని ఉంది. 

లెటర్‌ను ఎవరికీ చూపించొద్దన్నారు
ఆ లెటర్‌ విషయం వెంటనే అల్లుడు రాజశేఖరరెడ్డికి తెలియజేశాను. ‘ఆ లెటర్‌ను జాగ్రత్తగా దాచి పెట్టు.. ఎవరికీ చూపించవద్దు’ అన్నాడు. నేను పోలీసులతో ప్రాబ్లమ్‌ అవుతుంది కదా అని అడగాను. ‘అదంతా నేను వచ్చిన తర్వాత మాట్లాడతా. నీకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. నేను వచ్చాక పోలీసులకు ఇస్తాను. అప్పటి దాకా దాచి పెట్టు’ అని చెప్పాడు. ఈ విషయంగా శివప్రకాశ్‌రెడ్డికి కూడా తెలియజేసి.. నాకు దిక్కుతోచడం లేదని చెప్పాను.

తర్వాత కొద్ది సేపటికి ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి వచ్చాడు. నేనే ఆయన్ను లోపలికి పిలుచుకుని వెళ్లాను. అవినాశ్‌ రెడ్డితోపాటు శివశంకర్‌రెడ్డి, సురేంద్రనాథ్‌రెడ్డి మరి కొంత మంది ఉన్నారు. తర్వాత అవినాశ్‌రెడ్డి సార్‌ బయటికి వచ్చి లాన్‌లో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. ఆ తర్వాత వైఎస్‌ అవినాష్‌రెడ్డి చిన్నాన్న, పెద్దనాన్న, కుటుంబ సభ్యులు ఒకరి తర్వాత ఒకరు అక్కడికి వచ్చారు. నేను రంగన్న పిలిచి దబాయిస్తే, రాత్రి దోశలు తిని నిద్రయానని చెప్పాడు.

పోలీసులకు చెప్పేద్దామంటే వినలేదు
గుండెపోటు విషయం ఎవరు ఎలా చెప్పారో తెలియదు. లెటర్, రక్తాన్ని బట్టి వైఎస్‌ వివేకాను ఎవరో ఏదో చేశారని నేను భావించాను. కొద్ది సేపటికి సీఐ శంకరయ్య, ఎర్రగంగిరెడ్డి వచ్చారు. ఎర్ర గంగిరెడ్డి రావడంతోటే బ్లడ్‌ వాంటింగ్‌ చేసుకున్నాడని చెప్పాడు. బాత్‌రూములో గోడకు ఆరు, ఏడు అడుగులు రక్తం చిమ్మిందని చెప్పగా.. బేసిన్‌కు తల కొట్టుకుని రక్తం వచ్చి ఉంటుందిలే అన్నాడు. ఈ విషయంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తామా అంటే ఏం అవసరం లేదులే అన్నాడు. ఎర్రగంగిరెడ్డి ఇలా చెబుతున్నాడని నేను నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి ఫోన్‌ చేసి చెప్పాను.

పక్కన సీఐ ఉన్నాడని మాట్లాడాలని ఫోన్‌ సీఐకి ఇచ్చాను. వాళ్లిద్దరు మాట్లాడుకున్నారు. రాజశేఖరరెడ్డి స్టేషన్‌లో కంఫ్‌లైంట్‌ రాసివ్వాలని సూచించారు. కొద్దిసేపటికి ఎర్రగంగిరెడ్డి.. కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఇనాయతుల్లాకు ‘లక్షుమ్మను రమ్మను.. బక్కెట్‌తో నీళ్లు తీసుకుని ఇదంతా క్లీన్‌ చేయాలి’ అని చెప్పాడు. లక్షుమ్మ సగం క్లీన్‌ చేసి.. కళ్లు తిరుగుతున్నాయని చెప్పి వెళ్లిపోయింది. తర్వాత తన వద్ద పనిచేసే పిల్లలు రాజశేఖర్, ట్యాంకర్‌ బాషాతో ఇనాయితుల్లా క్లీన్‌ చేయించారు. సార్‌ డెడ్‌బాడీ బాత్‌రూము నుంచి తేవడానికి ఎర్రగంగిరెడ్డితో కలిసి నలుగురు వెళ్లారు. తర్వాత  అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లారు. 

పోలీసులు బాగా కొట్టారు
అవినాష్‌రెడ్డి ఉదయాన్నే వచ్చి వెళ్లాడు.. మళ్లీ రాలేదు. రక్తం శుభ్రం చేసే సమయంలో ఆయన లేరు. నేను సీఐ చెప్పినట్లు కంప్‌లైంట్‌ రాసిచ్చి ఆస్పత్రికి వెళ్లాను. అక్కడి నుంచి ఇంటికి వెళ్లి.. నా భార్యను తీసుకొచ్చి పోస్టుమార్టం రూమ్‌ వద్ద సార్‌ను చూపించాను. తర్వాత సార్‌ డెడ్‌ బాడీని ఇంటి వద్దకు తెచ్చారు. అప్పుడు లెటర్‌ను నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డికి ఇచ్చాను. తర్వాత 15 నిమిషాలకు ఆ లెటర్‌ను ఎస్పీకి అందజేశానని, నీకు ఇబ్బంది లేదని రాజశేఖర్‌రెడ్డి చెప్పాడు. సాయంత్రం 4 – 4.30 గంటల ప్రాంతంలో నన్ను పోలీసులు తీసుకు వెళ్లి జేఎన్‌టీయూ గెస్ట్‌హౌస్‌లో పెట్టారు. అక్కడి నుంచి నాతోపాటు మరికొందరిని వేముల పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు.

అనంతరం కడప డీటీసీకి తీసుకెళ్లి 13 రోజులు పెట్టుకుని అందరినీ కొట్టారు. తర్వాత నాతోపాటు ప్రకాశ్, ఎర్రగంగిరెడ్డిని ముద్దాయిలుగా చూపిస్తూ రిమాండ్‌కు తరలించారు. మూడు నెలలు జైలులోనే ఉన్నాం. మద్యమధ్యలో సునీతమ్మ, రాజశేఖర్‌రెడ్డి వచ్చి మాట్లాడిపోయే వారు. మేము బయటికి వచ్చిన కొద్దిరోజుల తర్వాత కేసు సీబీకి బదిలీ చేశారు. తర్వాత సునీత, రాజశేఖరరెడ్డి.. సీబీఐకి సహకరించాలని చెప్పేవారు. అప్పటి నుంచి సీబీఐ అధికారులు ఎప్పుడు పిలిచినా వెళ్లి వచ్చాం.

సీబీఐ వాళ్లూ కొడతారనుకోలేదు
సీబీఐ వాళ్లు ఢిల్లీకి రావాలని చెప్పారని నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి తెలియజేశాను. వెళ్లమని చెప్పి.. టికెట్‌ ఆయనే తీసిచ్చాడు. వారికి సహకరించాలని సూచించాడు. ఢిల్లీలో వాళ్లు నెల రోజులు పెట్టుకున్నారు. మధ్యలో రాంసింగ్‌ వచ్చి ‘నేను చెప్పినట్లు చెబుతావా? లేదా? వైఎస్‌ అవినాష్‌రెడ్డి, శంకర్‌రెడ్డిలు మిమ్మల్ని మ్యానేజ్‌ చేశారు.

ఆ విషయం మీరు చెప్పడం లేదు. మేము చెప్పినట్లు చెప్పకపోతే జైలుకు పంపుతాం’ అని బెదిరిస్తూ కొట్టేవారు. సీబీఐ అధికారులు ఇలా కొడతారని ఊహించలేదు. నెల తర్వాత నన్ను పంపించేశారు. ఆ తర్వాత నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, సునీతలు నన్ను హైదరాబాదుకు రమ్మని పిలిచారు. అక్కడికి వెళ్లాక ‘నువ్వు రాంసింగ్‌ సార్‌ ఎలా చెబితే అలా చేయాలి. లేకపోతే ఇబ్బందుల్లో పడతావు, నువ్వు సహకరిస్తే నిన్ను సేవ్‌ చేస్తాం. ఇదొక్కటే మార్గం’ అని చెప్పారు. మధ్యమద్యలో నర్రెడ్డి రాజశేఖరరెడ్డి.. అవినాశ్‌ మ్యానేజ్‌ చేశాడని చెప్పమన్నారు. 

నిజం చెబితే కొడతారేంటి?
‘దస్తగిరి, రంగన్నలు మేము చెప్పినట్లు విన్నారు. నువ్వు కూడా చెప్పినట్లు వింటే సేవ్‌ చేస్తా’ అని రాంసింగ్‌ తెలిపారు. తెల్లవారగానే నీ ఇద్దరు కుమారులతో కలిసి కడపలోని కేంద్ర కారాగార గెస్ట్‌హౌస్‌కు రావాలని సూచించారు. నేను ఈ విషయం నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి చెప్పగా, వెళ్లాలని సూచించాడు. హైదరాబాదులోని పిల్లలను పిలిచించి ఉదయం 11 గంటలకు వారితో కలిసి వెళ్లాను. మేము చెప్పినట్లుగా సహకరించాలని కోరారు.

ఇందుకు నేను మరోమారు అభ్యంతరం చెబుతూ.. నాకు తెలిసిన విషయాలన్నీ చెబుతానని చెప్పాను.  దాంతో ఆయన కట్టె తీసుకుని నన్ను కొట్టాడు. నిజం చెబితే కొడతారా? అంటూ మా పిల్లలు అడ్డుతగిలారు. సాయంత్రం వరకు నన్ను అక్కడే పెట్టుకుని బూతులు తిట్టి పంపారు. మళ్లీ పిలిచి నప్పుడు కూడా ఇలాగే మాట్లాడితే నీ కథ ఉంటాదని హెచ్చరించారు. 

చెప్పినట్లు వినలేదని పెళ్లి ఆపించేశారు
అప్పటికి వారం రోజుల్లో నా చిన్న కుమారుడి పెళ్లి. సీబీఐ వాళ్లకు నేను సహకరించలేదని నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, సునీతకు కోపం వచ్చింది. వారు పెళ్లి కుమార్తె వారికి ఫోన్‌ చేసి ‘కృష్ణారెడ్డి హత్య కేసులో ఉన్నాడు. వైఎస్‌ అవినాష్‌రెడ్డికి సహకరించాడు. త్వరలో ఆస్తులు స్వాధీనం చేసుకుంటారు. ఈ పెళ్లి క్యాన్సిల్‌ చేసుకోండి’ అని ఫోన్‌ చేసి చెప్పారు. నాకు విషయం తెలిసి నేను నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి వద్దకు వెళ్లగా సరైన స్పందన లేదు. పెళ్లి క్యాన్సిల్‌ అయితే కానీ అని నేను నిజాన్ని నిర్భయంగా చెప్పాలని భావించాను. ఆ తర్వాత నా కుమారుడు అమెరికా వెళ్లాడు.

నేను ప్రాణ రక్షణ కల్పించాలని ఎస్పీకి వినతి పత్రం ఇవ్వబోతే ఆయన తీసుకోలేదు. అందుకే పులివెందుల కోర్టులో ప్రైవేటు కంప్‌లైంట్‌ వేశాను. దాని గురించి ఇప్పటివరకు అతీగతీ లేదు. నా పాస్‌పోర్టు రెన్యూవల్‌ కాకుండా ఆగిపోయింది. నా ప్రమోషన్‌ ఆగిపోయింది., నా కుమారుడు పెళ్లి ఆగిపోయింది. నేను వివేకాకు సేవ చేసినందుకు ఇస్తామన్న ఐదు ఎకరాల భూమి ఇవ్వలేదు.

ఇలా అన్ని విధాలా నాకు అన్యాయం జరిగింది. ఇప్పుడు సీబీఐ కొత్త బృందం వచ్చింది. వారికి నాకు తెలిసిన విషయాలన్నీ చెప్పాను. పారదర్శకంగా విచారణ జరిగితే అసలు దోషులెవరన్నది తెలుస్తుంది. వివేకాకు హైదరాబాద్, పులివెందుల, కడపల 200 ఎకరాలకు పైగా భూమి ఉంది. ఆ ఆస్తులన్నీ దాదాపు కంపెనీ పేరుపైనే ఉండేవి.   
  
అలాగైతే జైలుకెళ్లేది నువ్వేనని భర్తకు సునీత హెచ్చరిక

అవినాశ్‌ నన్ను మేనేజ్‌ చేయడం ఏమిటని అప్పుడే గట్టిగా వ్యతిరేకించాను. అప్పుడు సునీత నాపై ఫైర్‌ అవుతూ ‘నువ్వు ఏమ­నుకుంటున్నావు.. నిన్ను ఎవ్వరూ కాపా­డలేరు’ అని హెచ్చరించారు. రాజశేఖరరెడ్డి నన్ను సముదా­యించేలా భుజం తట్టాడు. నేను ఉన్నది ఉన్నట్లు చెబుతానన్నాను. ఆ సమయంలో సునీత.. రాజశేఖర­రెడ్డిని ఉద్దేశించి నేను సహక­రించకపోతే నర్రెడ్డి జైలుకు వెళ్తాడని చెప్పింది.

ఆయనతో ఆమె అలా ఎందుకు అన్నాదో నాకు అప్పట్లో అర్థం కాలేదు. తర్వాత కొద్ది రోజులకు రాత్రి వేళ సీబీఐ అధికారి రాంసింగ్‌ నా సెల్‌కు మిస్డ్‌ కాల్‌ ఇచ్చారు. తర్వాత మా అబ్బాయితో ఫోన్‌ చేయించి (రాంసింగ్‌కు తెలుగు రానందున) మాట్లాడించాను.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement