నరేంద్రను భుజాలపై ఊరేగిస్తున్న గ్రామస్తులు
సాక్షి, విజయనగరం: మనిషి జీవితంలో తల్లితండ్రి తర్వాతి స్థానం గురువకే దక్కింది. అమ్మనాన్న మనకు జన్మనిస్తే.. గురువు జ్ఞానబోధ చేసి.. పుట్టుకకు సార్థకత చేకూర్చుకునేందుకు మార్గం చూపిస్తాడు. అలాంటి గురువు పట్ల ఎల్లప్పుడు భక్తిశ్రద్ధలు కనబర్చాలి. ప్రస్తుత కాలంలో గురువులను వేధించే పిల్లలు.. విద్యార్థుల పట్ల కీచకులుగా మారిన కొందరు గురువులను చూడాల్సి రావడం నిజంగా దురదృష్టం. అయితే మంచి విద్యాబుద్ధులు నేర్పిన గురువులను విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ఎంత బాగా గౌరవిస్తారో ఈ సంఘటన చూస్తే తెలుస్తుంది.
విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం మల్లుగూడ గ్రామంలో మండల పరిషత్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహించిన నరేంద్రకు వేరే ఊరికి బదిలి అయ్యింది. మల్లుగూడ మండల ప్రాథమిక పాఠశాలలో పదేళ్లపాటు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగి బదిలీపై వెళ్లిన నరేంద్రకు ఆ గ్రామ గిరిజనులు పెద్ద ఎత్తున వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయుడిని తమ భుజాలపై ఎత్తుకుని ఆనందోత్సాహాల నడుమ ఊరేగించారు. గతంలో ఇటువంటి సంఘటన ఈ చుట్టుపక్కల గిరిజన ప్రాంతాల్లో జరగలేదని అతడి తోటి ఉపాధ్యాయులు, మండల ప్రజలు అభినందించారు.
(చదవండి: స్కూల్ టీచర్.. ఒక్కరోజులోనే సెలబ్రిటీగా)
నరేంద్ర ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఈ పదేళ్ళకాలంలో క్రమశిక్షణతో మెలిగి రోజువారీ విధులకు హాజరై విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి ప్రజల ఆదరణ పొందారు. దీంతో ఆయన సేవలను గుర్తించిన గ్రామస్తులు ఘనంగా సన్మానించి ఊరేగింపుగా తీసుకు వెళుతూ ఆనందోత్సవాల మధ్య వీడ్కోలు పలికారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment