వ్యూహం.. ఒక వాస్తవం | Vyuham pre release as a celebration in Vijayawada | Sakshi
Sakshi News home page

వ్యూహం.. ఒక వాస్తవం

Published Sun, Dec 24 2023 5:44 AM | Last Updated on Sun, Dec 24 2023 8:46 AM

Vyuham pre release as a celebration in Vijayawada - Sakshi

సాక్షి, అమరావతి/ విజయవాడ స్పోర్ట్స్‌: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009 నుంచి 2019 వరకు కుట్రలు– ఆలోచనల మధ్య జరిగిన రాజకీయమే ‘వ్యూహం’ చిత్రమని ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ చెప్పారు. రాజకీయాలను ప్రజలు చూసే కోణం నుంచే ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, ఈ చిత్రంలో ఎలాంటి కల్పితాలు లేవని, పాత్రల పేర్లు సైతం రాజకీయ నాయకుల వాస్తవ పేర్లతోనే తెరకెక్కించామని స్పష్టం చేశారు. విడుదలను ఆపేందుకు పన్నిన కుట్రలను సైతం ఛేదించుకుని ఈ నెల 29న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని ప్రకటించారు. రామదూత క్రియేషన్స్‌ బ్యానర్‌పై దాసరి కిరణ్‌కుమార్‌ నిర్మించిన ‘వ్యూహం’ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ‘జగ గర్జన’ పేరుతో విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో శనివారం రాత్రి అట్టహాసంగా జరిగింది.

వ్యూహం సినిమాలో షాట్‌ వన్‌ను ఎంపీ నంది­గం సురేష్‌ రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ వెన్నుపోటుతోనే ఫేమస్‌ అయిన చంద్రబాబునాయుడు ఇప్పటికీ తన రాజకీయ సౌలభ్యం కోసం ఎన్టీఆర్‌ అభిమానులను వాడుకుంటున్నారని చెప్పారు. ఈ చిత్రం ద్వారా తన పరువు పోతుందని, విడుదల ఆపాలని లోకేశ్‌ కోర్టుకెళ్లడం పెద్ద జోక్‌ అన్నారు. తెల్లారి లేస్తే  లోకేశ్‌ అందర్నీ పచ్చి బూతులు తిడుతూ అవమానించడం ఇతరుల పరువు తీయడం కాదా.. అని ప్రశ్నించారు. పవన్‌కల్యాణ్‌ను రంగుల రాజాగా అభివర్ణించారు.

తెలంగాణ ఎన్నికల్లో బర్రెలక్కకు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా పవన్‌కల్యాణ్‌కు లేదని, ఆంధ్రాలో చంద్రబాబు, లోకేశ్‌లకు ప్రస్తుతం బర్రె ‘లెక్క’ పవన్‌కల్యాణ్‌ మారాడని ఎద్దేవా చేశారు. బట్టలూడదీస్తాం.. రోడ్డు మీద ఈడ్చి తంతాం.. కోస్తాం.. అంటూ పవన్‌కల్యాణ్, చంద్రబాబు, లోకేశ్‌  ప్రతిరోజూ మాట్లాడుతుంటారని, ఇలాంటి వ్యాఖ్యలు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ సైతం మాట్లాడరని ఆయన చెప్పారు. మంత్రులు రోజా, అంబటి రాంబాబు, జోగి రమేష్‌ మాట్లాడుతూ వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణించిన తరువాత రాష్ట్రంలో జరిగిన కుట్ర రాజకీయాలను, కాంగ్రెస్‌తో చేతులు కలిపి చంద్రబాబు పన్నిన పన్నాగాలను, బాబు హయాంలో జరిగిన ప్రజాధనం దోపిడీని ఈ చిత్రంలో తెరకెక్కించారని తెలిపారు.

ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరు ఆదరించాలని కోరారు. నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ మంచి మనసున్న ప్రజానేత సీఎం జగన్‌ జీవిత చరిత్రను తెరకెక్కించడం తనకు దక్కిన అదృష్టమన్నారు. స్టార్‌ క్రికెటర్‌ అంబటి రాయుడు మాట్లాడుతూ మంచి ప్రజానాయకుల జీవిత చరిత్రను ప్రముఖ దర్శకుడు తెరకెక్కించడం మంచి పరిణామమన్నారు. 2024 ఎన్నికల్లో గెలిచి వైఎస్‌ జగన్‌ మళ్లీ ముఖ్యమంత్రి అవడం ఖాయమని చెప్పారు. ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, శివకుమార్, అదీప్‌రాజు, ఏపీ ఫైబర్‌నెట్‌ చైర్మన్‌ గౌతంరెడ్డి ప్రసంగించారు. సంగీత దర్శకురాలు కీర్తన, పలువురు ప్రజాప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, రాజకీయ, సినీరంగ ప్రముఖులు, అభిమానులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement