అనంతగిరి(అరకులోయ): మన్యంలోని ప్రకృతి రమణీయత పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఇక్కడి సహజసిద్ధ అందాలను ఆస్వాదించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు తరలివస్తుంటారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లో జలపాతాలు పొంగిపొర్లుతూ.. కొత్త సోయగాలను సంతరించుకుంటున్నాయి. ఆకాశం నుంచి నేలను తాకుతున్న మబ్బులతో కొత్తందాలు ఆవిష్కృతమవు తున్నాయి.
చదవండి: అమ్మ బాబోయ్ పులస.. అంత రేటా?
ఈ నేపథ్యంలో మన్యంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న జలపాతాల వద్దకు అధిక సంఖ్యలో పర్యాటకులు చేరుకుంటున్నారు. కొంత మంది సరదాకు ఈతకు దిగి, మరికొంతమంది ప్రమాదవశాత్తూ జారిపడి, మరికొంత మంది సెల్ఫీలు, ఫొటోలు అంటూ అజాగ్రత్త వ్యవహరిస్తూ.. మృత్యువాతపడుతున్నారు. కన్నవాళ్లకు అంతులేని విషాదాన్ని మిగులుస్తున్నారు. ఆకట్టుకునే జలపాతాల వెనుక అంతులేని విషాదగాథలెన్నో ఉన్నాయి.
సరియా జలపాతం(అనంతగిరి)
సరియా జలపాతం 2015లో బహ్య ప్రపంచానికి పరిచయం అయింది. ఈ జలపాతం వద్ద జరిగిన ప్రమాదాల్లో ఇప్పటివరకు 20 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇందులో 15 మందికి పైగా యువతే ఉన్నారు. కొంతమంది అజాగ్రత్త కారణంగా.. మరికొంతమంది ఈత రాక ప్రాణాలు పొగొట్టుకున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు సరియా జలపాతం ఉరకలేస్తూ.. ప్రవహిస్తోంది. ఇక్కడకు అధిక సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలోని స్థానికుల సూచనలు, పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను చదివి అవగాహన పెంపొదించుకోవాలి. అప్పుడే ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించవచ్చు.
డుడుమ (ఆంధ్రా–ఒడిశా సరిహద్దు)
ఆంధ్రా– ఒడిశా సరిహద్దు ప్రాంతమైన డుడుమ జలపాతం సుమారు 2,600 అడుగుల ఎత్తుల్లోంచి పరవళ్లు తొక్కుతోంది. ఇక్కడ జరిగిన ప్రమాదాల్లో సుమారు ఆరుగురు పర్యాటకులు ప్రమాదవశాత్తూ జారిపడి మృత్యువాత పడ్డారు. హెచ్చరిక బోర్డులను సైతం ఏర్పాటు చేసినా..
పర్యాటకులు పెడచెవిన పెడుతున్నారు.
పొల్లూరు(మోతుగూడెం)
పొల్లూరు జలపాతం సినిమా షూటింగ్‌లకు కేరాఫ్ అడ్రాస్. అల్లరి నరేష్ నటించిన దొంగలబండి, అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా షూటింగ్‌లు ఇక్కడే జరిగాయి. చూసేందుకు జలపాతం అందంగా కనిపిస్తుంది. ఇక్కడ జరిగిన ప్రమాదాల్లో సుమారు 30 మందికిపైగా మృత్యువాతపడ్డారు. ప్రమాదవశాత్తూ కొంత మంది, ఈతకు దిగి మరికొంత మంది మరణించారు.
గాదిగుమ్మి(కొయ్యూరు)
చూసేందుకు గాదిగుమ్మి జలపాతం అందంగా కనిపిస్తుంది. అందులో దిగితే ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లే. ఇక్కడ జరిగిన ప్రమాదాల్లో సుమారు 40 మందిపైగా పర్యాటకులు మృతి చెందారు. దూరం నుంచే జలపాతం అందాలను వీక్షిస్తే ప్రమాదాలు జరగావు.
యువతా.. జాగ్రత్త
జలపాతాలను తిలకించే క్రమంలో యువత ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. 18 నుంచి 35 ఏళ్లలోపు వాళ్లే దూకుడుగా వ్యవహరించి.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పోలీసుల హెచ్చరికలను సైతం పెడచెవిన పెట్టి.. ఈత సరదాలు.. సెలీ్ఫలు అంటూ అక్కడ పరిస్థితులపై అవగాహన లేక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కుటుంబానికి కన్నీరు మిగులుస్తున్నారు. కుటుంబం తమపై పెట్టుకున్న ఆశలను తుంచేసి.. తిరిగిరాని లోకాలకు వెళ్తున్నారు. వర్షాలకు రాళ్లు నాచుపట్టి ప్రమాదకరంగా ఉంటాయని.. ప్రస్తుత పరిస్థితుల్లో జలపాతాలకు దూరంగా ఉండడమే మంచిదని అధికారులు, స్థానికులు సూచిస్తున్నారు.
చాపరాయి(డుంబ్రిగుడ)
చాపరాయికి పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది. అరకు–పాడేరు ప్రధాన రహదారి అనుకుని ఉండడంతో పాటు అటువైపుగా రాకపోకలు సాగించే ప్రయాణికులు, పర్యాటకులు చాపరాయి అందాలను తిలకిస్తుంటారు. చాపరాయి వద్ద జరిగిన ప్రమాదాల్లో ఇప్పటివరకు సుమారు 25 మందిపైగా మృత్యువాత పడ్డారు. ఈతకు దిగి ప్రమాదవశాత్తూ సొరంగంలోకి వెళ్లడంతో మృత్యువాత పడేవారు. అధికారులు చొరవ.. టెండర్‌దారుల సహకారంతో సొరంగం రాయిని బ్లాస్టింగ్ చేయడంలో ప్రమాదాలు తప్పాయి. అయినప్పటికీ అప్రమత్తత అవసరం.
గుడ్డిగుమ్మి(హుకుంపేట)
హుకుంపేట మండలంలోని తీగలవలస పంచాయతీ జెండాకొండ మార్గమధ్యలో ఉన్న గుడ్డిగుమ్మి జలపాతం బహ్యప్రపంచానికి పరిచయమై ఏడాదే అయింది. ఇక్కడ జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు మత్యువాతపడ్డారు. సరదాగా ఈతకు దిగి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. వీళ్లంతా హుకుంపేట మండలానికి చెందిన వాళ్లే.
దాలమ్మతల్లి(సీలేరు)
సీలేరు దాలమ్మతల్లి జలపాతం 100 అడుగులు ఎత్తుల్లోంచి జాలువారుతుంది. గుడి బయట నుంచి జలపాతం తిలకిస్తే ప్రమాదాలు జరగవు. జలపాతం పక్కనున్న కొండపై సెలీ్ఫలు, ఫొటోలు దిగేందుకు వెళ్లి 20పైగా మృత్యువాతపడ్డారు. ఏటా ఇద్దరు, ముగ్గురు ఇక్కడ ప్రమాదాల బారిన పడి మరణిస్తున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..
►పర్యాటకులు ఎట్టి పరిస్థితిలోనూ జలపాతం కొండలపై ఎక్కడం చేయకూడదు. ఎందుకంటే ఆ బండరాళ్లపై నిరంతరం నీళ్లు ప్రవహిస్తూ ఉండటం వల్ల అవి నాచుపట్టి ఉంటాయి. వాటిపై ఎక్కితే జారిపడి పోయే ప్రమాదం ఉంది.
►సెల్ఫీల కోసం జలపాతం లోపల ఉన్నా ఎత్తైన బండలను ఎక్కకూడదు.
►నీళ్లు అధికంగా ప్రవహిస్తున్న ప్రదేశంలో స్నానాలు చేయకూడదు.
►జలపాతాలకు వెళ్తున్న సమయంలో ఆల్కాహాల్‌కు దూరంగా ఉండాలి.
►ఈత వస్తే తప్ప జలపాతంలో దిగడానికి సహసించద్దు.
►వర్షాలు అధికంగా పడుతున్న సమయంలో జలపాతాల వద్దకు వెళ్లకపోవడమే మేలు.
►జలపాతాలకు ఒక్కరుగా కాకుండా గుంపులుగానే వెళ్లాలి.
అప్రమత్తంగా ఉండాలి
ప్రస్తుతం జలపాతాల వద్ద ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి. యువత జలపాతాల వద్దకు వెళుతూ దూకుడుగా వ్యవహరించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. హెచ్చరికలు ఉన్నా పట్టించుకోవడం లేదు. దూరంగా జలపాతాల అందాలు వీక్షించడమే మేలు.
– కరక రాము, ఎస్‌ఐ, అనంతగిరి
Comments
Please login to add a commentAdd a comment