సంప్రదాయం తోడుగా.. పాలకొల్లు పాగా  | Weaver on 50 looms in Palakollu area | Sakshi
Sakshi News home page

సంప్రదాయం తోడుగా.. పాలకొల్లు పాగా 

Published Mon, Jan 24 2022 6:03 AM | Last Updated on Mon, Jan 24 2022 6:03 AM

Weaver on 50 looms in Palakollu area - Sakshi

భగ్గేశ్వరంలో మగ్గంపై పాగా నేస్తున్న నేత కార్మికుడు

పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు ప్రాంతానికి చెందిన పాగాలు కర్ణాటక, మహారాష్ట్రలోని సంపన్న వర్గాల సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో సంపన్న కుటుంబాల్లో వివాహాది శుభకార్యాల సమయంలో ప్రతి పురుషుడు శిరస్సున పాగా ధరించడం ఆనవాయితీ. ఈ సాంప్రదాయ పాగా పాలకొల్లు ప్రాంతంలో తయారైనది కావడం విశేషం. పేట అంటే హిందీలో పాగా అని అర్థం. పాలకొల్లు పాగాను ఆయా రాష్ట్రాల్లో పాలకొల్లు పేటగా పిలుచుకుంటారు. శిరస్సున ధరించి రాజఠీవిగా భావిస్తారు. ప్రధానంగా పాలకొల్లు మండలంలోని భగ్గేశ్వరంలో ఈ పాగాల తయారీ ఎక్కువగా ఉంది.   
– పాలకొల్లు అర్బన్‌

15 ఏళ్ల క్రితం రూ.5 కోట్ల వ్యాపారం 
పాలకొల్లు మండలంలోని భగ్గేశ్వరం, చింతపర్రు, దగ్గులూరు, దిగమర్రు, వాలమర్రు, యలమంచిలి మండలం పెనుమర్రు గ్రామాల్లో 15 ఏళ్ల క్రితం సుమారు 300కి పైగా మగ్గాలపై పాగాలు నేసేవారు. ఏడాదికి రూ.5 కోట్ల వరకు వ్యాపారం జరిగేది. ప్రస్తుతం భగ్గేశ్వరం, చింతపర్రు గ్రామాల్లో 50 మగ్గాలపై మాత్రమే పాగాలు నేస్తున్నారు. ఏడాదికి రూ.50 లక్షల వ్యాపారం జరుగుతోంది.

బళ్లారి నుంచి ముడి సరుకు 
కర్ణాటకలోని బళ్లారి, అనంతపురం జిల్లా రాయదుర్గం, హిందూపురం నుంచి పాగా నేతకు అవసరమైన ముడి సరుకు (రా సిల్కు)ను దిగుమతి చేసుకుంటారు. ప్రస్తుతం కిలో ముడి సరుకు ధర రూ.4,500 ఉంది. దీనిని ఉడక బెట్టి, రంగులు వేసి, ఆరబెట్టి, ఆరుబయట పడుగు నేసి, అచ్చులు వేసి, హల్లులు దిద్ది, చిలకలు చుట్టి, మగ్గంపైకి పడుగు తీసుకురావడానికి ఆరు చేతులు మారుతాయి. చివరగా మగ్గంపై పాగా తయారవుతుంది. సుమారు 15 రోజులపాటు భార్యాభర్తలు కలిసి పనిచేస్తే 6 నుంచి 7 పాగాలు తయారవుతాయి.   

జనవరి నుంచి మే వరకు సీజన్‌ 
ఏటా జనవరి నుంచి మే వరకు పాగాల తయారీకి సీజన్‌. ఈ సమయంలో మహారాష్ట్ర, కర్ణాటకలో సంపన్న వర్గాల ఇంట వివాహాది శుభకార్యాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ముందుగా వారు పాలకొల్లు పాగాలు కొనుగోలు చేసి మిగిలిన పనులు ప్రారంభిస్తారు.

65 ఏళ్లు పైబడిన వారే.. 
పాగా నేయడం పండుగలా ఉండేది. ఊరంతా పడుగులే. ఏ వీధిలోకి వెళ్లినా మగ్గం నేత శబ్దం వినిపించేంది. ప్రస్తుతం పరిస్థితి మారింది. పాగా నేసే కార్మికులు వృద్ధులైపోయారు. యువత ఈ పని నేర్చుకోవడానికి ముందుకు రావడం లేదు. 65 ఏళ్లు పైబడిన వారే ఈ వృత్తిలో కొనసాగుతున్నారు. మరో ఐదేళ్లలో పాగా నేయడం కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.  
– రామలింగేశ్వరరావు, నేత కార్మికుడు 

ఏడాదికి రూ.50 లక్షలు 
పాగా వ్యాపారం బాగుండే రోజుల్లో ఈ ప్రాంతంలో ఎగుమతిదారులు ఉండేవారు. వ్యాపారం కోట్లలో సాగేది. ప్రస్తుతం ఏడాదికి రూ.50 లక్షలు వ్యాపారం జరగడం కష్టంగా ఉంది. పెద్ద వయసు వారు పాగాలు నేయడంపై జీవనం సాగిస్తున్నారు. ముడి సరుకుల ధరలు పెరగడం, నూలుపై జీఎస్‌టీ 12 శాతం పెంచడంతో పాగా తయారీ కష్టంగా మారింది.  
–విశ్వనాథం బాలాజీ, నేత కార్మికుడు 

రోజుకి రూ.200 కిరాయి 
ఒక పడుగు తయారీకి 15 రోజుల సమయం పడుతుంది. పడుగు మీద ఇద్దరం ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేస్తుంటాం. 9 గజాలు అయితే 6 పాగాలు, 8 గజాలు అయితే 7 పాగాలు తయారవుతాయి. పాగా ప్రస్తుతం రూ.2,500 నుంచి రూ.3 వేల వరకు ధర పలుకుతుంది. పడుగు లెక్కన కిరాయి లభిస్తుంది. రోజుకి రూ.200 కచ్చితంగా కిడుతుంది.   
–విశ్వనాథం కోట మల్లయ్య, నేత కార్మికుడు   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement