వివాహ ‘వేడుకంబు’.. జూన్‌ వరకు పెళ్లి ముహూర్తాలు ఇవే  | Wedding Ceremony Starts Auspicious Dates Shubh Muhurat | Sakshi
Sakshi News home page

వివాహ ‘వేడుకంబు’.. జూన్‌ వరకు పెళ్లి ముహూర్తాలు ఇవే 

Published Wed, Apr 20 2022 7:50 AM | Last Updated on Wed, Apr 20 2022 11:15 AM

Wedding Ceremony Starts Auspicious Dates Shubh Muhurat - Sakshi

కొవ్వూరు(తూర్పుగోదావరి): శ్రీరస్తు.. శుభమస్తు.. కల్యాణమస్తు.. ఆకాశ పందిళ్లు.. భూలోక సందళ్లు.. జీవించు నూరేళ్లు.. ఇలా ఊరూరా పెళ్లి సందడి నెలకొంటోంది. కల్యాణ మంటపాలు, ప్రముఖ పుణ్యక్షేత్రాలు, గుళ్లు, ఇలా వివాహవేడుకలతో కనువిందు చేస్తున్నాయి. కరోనా కారణంగా గడిచిన రెండేళ్లలో కోవిడ్‌ మార్గదర్శకాలను పాటిస్తూ.. నామమాత్రంగానే వివాహాలు చేసుకున్నారు కొందరు. అయితే కోవిడ్‌ ఆంక్షల సడలింపు, మరోవైపు శుభముహూర్తాలు అధికంగా ఉండడంతో పెళ్లిళ్లు జోరందుకున్నాయి. వందలాది జంటలు ఒక్కటవుతున్నాయి. జూన్‌ 29 నుంచి జూలై 30 వరకు ఆషాఢమాసం ఉంది.

చదవండి: ఫస్ట్‌నైట్‌ అంటే భయపడ్డాడు.. అందుకే ఇలా చేశాడు: వరుడి తల్లి

భాద్రపదం, ఆశ్వీయుజం, కార్తికమాసాల్లో (ఆగస్టు 23 నుంచి నవంబర్‌ 27 వరకు శుక్ర మౌఢ్యమి(మూఢం) కావడంతో మరో నాలుగు నెలలు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు విరామం రానుంది. పెళ్లిళ్లే కాకుండా ఉపనయనాలు, గృహా ప్రవేశాలు, దేవతా ప్రతిష్ఠ మహోత్సవాలు, అన్ని రకాల శుభకార్యాలకు జూన్‌ 23 వరకు అనువైన మంచి శుభ ముహూర్తాలున్నాయని పండితులు చెబుతున్నారు. ఏప్రిల్‌లో ఇప్పటికే 13, 14, 15, 16 తేదీల్లో వేలాది మందికి వివాహాలయ్యాయి.  ద్వారకాతిరుమల, అన్నవరం, శ్రీనివాసపురం వేంకటేశ్వరస్వామి సన్నిధిలో వందలాది వివాహాలయ్యాయి. 

పెళ్లిళ్లపై కరోనా ప్రభావం 
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల దేవస్థానంలో ఏటా వేల సంఖ్యలో వివాహాలవుతున్నాయి. కరోనా ప్రభావంతో గడిచిన రెండేళ్లలో నామమాత్రం సంఖ్యలో పెళ్లిళ్లు అయ్యాయి. 2020లో కేవలం 120 పెళ్లిళ్లు మాత్రమే అయ్యాయి. కోవిడ్‌ ఆంక్షలకు కొంత మేర సడలింపులు ఇవ్వడం, నిర్దిష్టమైన సంఖ్యలో వివాహాలకు అనుమతులు ఇవ్వడంతో 2021లో 603 వివాహాలయ్యాయి. ఇప్పుడు కరోనా ఆంక్షలు తొలగించడంతో  గడచిన ఐదు రోజుల్లోనే 311 పెళ్లిళ్లయ్యాయి. రానున్న రెండు నెలల్లో మంచి ముహూర్తాలు ఉండడంతో ఇక్కడ వేల సంఖ్యలో జంటలు ఒక్కటి కానున్నాయి.

శుభకార్యాలతో వందల మందికి ఉపాధి 
పెళ్లిళ్లు ఊపందుకోవడంతో పాటు ఇతర అన్ని రకాల శుభకార్యాలకు అనువైన రోజులు కావడంతో వేలాది మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. కల్యాణ మంటపాలు, కేటరింగ్, వంటవాళ్లు, పురోహితులు, ఫొటో, వీడియో గ్రాఫర్లకు, ట్రావెల్స్‌ కార్లు, బస్సులు, ఐస్‌క్రీమ్, మినరల్‌ వాటర్, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్లు, పూలు, డెకరేషన్, లైటింగ్, కూరగాయలు, కిరాణా, కిళ్లీ, వస్త్ర దుకాణాలు, బంగారు, వెండి ఆభరణాల షాపులు, మాంసపు దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, లాడ్జీలు, సాంస్కృతిక కళాకారులతో పాటు పలు విభాగాల్లో పనిచేసే కార్మికులకు ఉపాధి లభించనుంది.

ఇప్పటికే పెళ్లిళ్లు కుదిరిన వారందరూ  ముందస్తు బుకింగ్‌లు చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. పరోక్షంగా వీటికి అనుబంధంగా ఉన్న రంగాల్లోని వేలాది మందికి శుభకార్యాల ద్వారా ఉపాధి లభించనుంది. రెండేళ్ల నుంచి అంతంతమాత్రంగా శుభ కార్యాలు చేశారు. ఇప్పుడు వరుస ఫంక్షన్లు రావడంతో అన్నీ రకాల వాళ్లకు ఉపాధి చేకూరిందని చెప్పొచ్చు.

జూన్‌ 23 వరకు మంచి ముహూర్తాలు 
పెళ్లిళ్లతో పాటు ఉపనయనాలు, గృహా ప్రవేశాలు, దేవతా విగ్రహాల ప్రతిష్ఠ వంటి శుభకార్యాల నిర్వహణకు జూన్‌ 23వ తేదీ వరకు మంచి ముహుర్తాలున్నాయి. జూన్‌ 29 నుంచి జూలై 30వ తేదీ వరకు ఆషాఢమాసం, ఆగస్టు 23 నుంచి నవంబర్‌ 27వ తేదీ వరకు భాద్రపద, ఆశ్వీయుజ, కార్తిక మాసాల్లో  శుక్ర మౌఢ్యమి(మూఢం) కారణంగా నాలుగు నెలల పాటు శుభ కార్యాలకు మంచి రోజుల్లేవు. 
–వారణాసి సీతారామ హనుమంత శర్మ, రాష్ట్ర పురోహిత సంఘం అధ్యక్షుడు, కొవ్వూరు 

జూన్‌ వరకు పెళ్లి ముహూర్తాలు ఇవే.. 
ఈ నెల 21, 22, 24 తేదీలు  
మే నెలలో తేదీలు: 3, 4, 12, 14, 18, 20, 21, 22, 25   
జూన్‌లో తేదీలు: 1, 3, 5, 6, 8, 9, 10, 15, 17, 18, 19, 22, 23   
ఇతర శుభ ముహూర్తాలు 
మేలో 4 నుంచి 9వ తేదీ వరకు, 11 నుంచి 15 వరకు, తిరిగి 18, 20, 21, 22, 23, 25 తేదీల్లో ఇతర శుభ ముహూర్తాలు ఉన్నాయి. 
జూన్‌లో 1 నుంచి ఆరోతేదీ వరకు, 8 నుంచి 11వ తేదీ వరకు, 13, 15, 16, 17, 18, 19, 22, 23 తేదీలు ఇతర శుభ ముçహూర్తాలున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement