ఏపీలో పురుషులకంటే ఓట్లు వేసిన మహిళల సంఖ్య 4.78 లక్షలు అధికం
పోస్టల్ బ్యాలెట్‌తో కలిపి మొత్తం పోలింగ్ శాతం 81.86 శాతం
అసెంబ్లీకి అత్యధికంగా దర్శిలో 90.91 శాతం.. అత్యల్పంగా తిరుపతిలో 63.62 శాతం
లోక్‌సభకు అత్యధికంగా ఒంగోలులో 87.06 శాతం.. విశాఖలో 71.11 శాతం ఓట్లు
దేశంలో ఇప్పటివరకు జరిగిన 4 దశల ఎన్నికల్లో అత్యధిక పోలింగ్ రాష్ట్రంలోనే
ఎన్నికల్లో ఈవీఎంలను ధ్వంసం చేసిన వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తాం
33 చోట్ల 350 స్ట్రాంగ్ రూముల్లో మూడంచెల భధ్రత నడుమ ఈవీఎంలు
హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిని రెండు రోజుల్లో అరెస్ట్ చేస్తాం
ఎన్నికల తర్వాత జరిగిన హింస అదుపులోకి వచ్చింది
హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు
715 పోలీస్ పికెట్స్‌తో గొడవలను అదుపులోకి తెచ్చాం
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సోమవారం జరిగిన ఎన్నికల్లో మహిళా ఓటర్ల చైతన్యం వెల్లి విరిసింది. పురుషులకంటే 4,78,535 మంది మహిళలు అధికంగా పోలింగ్‌లో పాల్గొన్నారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 81.86 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో పోలైన ఓట్ల తుది వివరాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనా బుధవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోమవారం జరిగిన పోలింగ్‌లో ఈవీఎంల ద్వారా 80.66 శాతం (3,33,340,333 ఓట్లు), పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1.2 శాతం ఓట్లు నమోదైనట్లు చెప్పారు. రాష్ట్ర చరిత్రలో ఇంత భారీ స్థాయిలో ఓట్లు నమోదవడం ఇదే తొలిసారన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో జరిగిన నాలుగు దశల పోలింగ్‌లో రాష్ట్రంలోనే అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైనట్లు చెప్పారు.
పోస్టల్ బ్యాలెట్‌లో ఉద్యోగులు, అత్యవసర సర్వీసు ఓటర్లు, 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు పాల్గొన్నారని తెలిపారు. 2019 ఎన్నికల్లో 2.62 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్లను వినియోగించుకోగా>, ఈసారి 4.97 లక్షల మంది వినియోగించుకున్నట్లు తెలిపారు. గత ఎన్నికల్లో 56 వేల పోస్టల్ బ్యాలెట్లు తిరస్కరణకు గురయ్యాయని, ఈసారి ఉద్యోగులు ఎంతో జాగ్రత్తగా ఉన్నందున అటువంటి పరిస్థితి తలెత్తలేదని చెప్పారు.
విశాఖలో ఎక్కువ ఓట్లు పోలవడం శుభపరిణామం
లోక్‌సభ నియోజకవర్గాల్లో ఒంగోలులో అత్యధికంగా 87.06 శాతం ఓట్లు రాగా, అత్యల్పంగా విశాఖపట్నంలో 71.11 శాతం వచ్చాయన్నారు. శాసన సభ నియోజకవర్గాల్లో అత్యధికంగా దర్శి నియోజకవర్గంలో 90.91 శాతం పోలింగ్ నమోదవగా, అత్యల్పంగా తిరుపతిలో 63.32 శాతం నమోదైనట్లు తెలిపారు.
గత ఎన్నికల్లో తిరుపతిలో 65.9 శాతం పోలింగ్ నమోదవగా, ఈసారి 63.32 శాతానికి తగ్గడానికి ఆ నియోజకవర్గంలో బోగస్ ఓట్లను నియంత్రించడమే ప్రధాన కారణమని తెలిపారు. విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో 67 శాతం పోలింగ్ నమోదుకాగా, ఈసారి ప్రత్యేకించి విశాఖ పట్టణ ప్రాంతంలో 71.11 శాతం పోలింగ్ జరగడం ఎంతో శుభపరిణామమని అన్నారు.
ఎవరూ రీపోలింగ్ కోరలేదు
దేశ, విదేశాల నుండి ఓటర్లు పెద్ద ఎత్తున ఓటింగ్‌కు తరలి రావడం, చివరి రెండు గంటల ముందు క్యూలలో ఓటర్లు ఎక్కువగా ఉండటం వల్ల అర్థరాత్రి వరకూ ఓటింగ్ కొనసాగిందని మీనా తెలిపారు. దీనికితోడు 5,600 పోలింగ్ స్టేషన్లలో 1,200కు పైబడి ఓటర్లు ఉండటం కూడా ఓటింగ్ ఆలస్యానికి కారణమైందన్నారు. దాదాపు 3,500 పోలింగ్ స్టేషన్లలో నిర్ణీత సమయమైన సాయంత్రం 6.00 గంటలు దాటి పోలింగ్ కొనసాగిందని, చివరి పోలింగ్ స్టేషన్‌లో అర్ధరాత్రి 2 గంటలకు పోలింగ్ ముగిసిందని చెప్పారు.
శ్రీకాకుళం, కోనసీమ, ఉదయగిరి తదితర ప్రాంతాల్లో వాతావరణం సహకరించకపోవడం వల్ల ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాత ఎలక్షన్ టీమ్‌లు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు, స్ట్రాంగ్ రూమ్‌ల వద్దకు వచ్చేసరికి ఆలస్యమైందన్నారు. ఎన్నికలు ముగిసిన తదుపరి రోజు పరిశీలకులు, అభ్యర్థులతో రిటర్నింగ్ అధికారి సమావేశం ఏర్పాటు చేసి ఎక్కడైనా రీపోలింగ్‌కు అవసరం ఉందా లేదా అనే విషయాన్ని సమీక్షిస్తారన్నారు.
ఈ సమీక్షల్లో ఒక్క పరిశీలకుడు కూడా రీపోలింగ్‌కు సిఫార్సు చేయకపోవడంవల్ల 25 లోక్‌సభ నియోజకవర్గాలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను అన్నింటినీ మంగళవారం రాత్రి 33 ప్రాంతాల్లో నున్న 350 స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచినట్లు తెలిపారు. ఈ స్ట్రాంగ్ రూమ్‌లకు మూడంచెల భద్రత కల్పించామని చెప్పారు. ఈ ప్రక్రియ మొత్తం ముగిసిన తరువాతే అసలైన పోలింగ్ శాతాన్ని ఖరారు చేస్తామని, అందువల్లే పోలింగ్ శాతాన్ని ప్రకటించడంలో కొంత ఆలస్యం జరిగిందని వివరించారు.
హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్
ఎన్నికల అనంతరం ప్రత్యేకించి తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, నర్సరావుపేట ప్రాంతాల్లో పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయని మీనా చెప్పారు. ఈ ఘటనలను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించి, వెంటనే డీజీపీతో చర్చించిందని తెలిపారు. మంగళవారం నుంచి పోలీస్ యంత్రాంగం ప్రత్యేకమైన చర్యలు చేపట్టిందని, అయా ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నదని తెలిపారు.
ఈ నాలుగు ప్రాంతాలకు సీనియర్ అధికారులు, అదనపు పోలీసు బలగాలను పంపినట్లు చెప్పారు. స్థానికంగా జన సంచారాన్ని నియంత్రించడమే కాకుండా సంబంధిత పార్టీల అభ్యర్థులను గృహ నిర్బంధం చేశామన్నారు. తదుపరి విచారణ జరిపి పోలిస్ కేసులను కూడా పెట్టడం జరుగుతుందన్నారు. 715 ప్రాంతాల్లో పోలీస్ పికెట్లను కూడా ఏర్పాటు చేశామని, అన్ని చోట్లా పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని ఆయన తెలిపారు.
పోలింగ్ ఇలా..
రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 4,13,33,702
లోక్‌సభకు పోలైన ఓట్లు 3,33,40,560
అసెంబ్లీకి పోలైన ఓట్లు 3,33,40,333
ఈవీఎంల ద్వారా పోలైన ఓట్లు
పురుషులు 1,64,30,359
మహిళలు 1,69,08,684
ఇతరులు 1,517 మంది
పోస్టల్ బ్యాలెట్ ద్వారా మొత్తం వచ్చిన ఓట్లు 4.97 లక్షలు
ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగుల ఓట్లు 4.44 లక్షలు
85 ఏళ్ల పైబడిన వృద్ధులు 13,700
దివ్యాంగులు 12,700
అత్యవసర సర్వీసు ఓటర్లు 27,100
Comments
Please login to add a commentAdd a comment