సాక్షి, అమరావతి: దేశ ఎన్నికల క్షేత్రంలో మహిళల పాత్ర పెరుగుతోంది. స్త్రీ శక్తి మద్దతు లేనిదే ఏ పార్టీ లేదా ఏ నాయకుడూ విజయం సాధించలేరన్నంతగా ఓటింగ్‌లో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మహిళా ఓటర్ల పాత్ర కీలకం కానుంది. ఆ తర్వాత 2029 నుంచి స్త్రీలదే ఆధిపత్యం. ఇది మహిళలు సాధించిన సాధికారత. ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించిన విషయమిది. 1951 నుంచి ఎన్నికల పోలింగ్ శాతం సరళితో 2047 వరకు పోలింగ్‌లో మహిళా ఓటర్ల సంఖ్య ఎలా పెరుగుతుందో ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక వివరించింది.
2014 లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో పురుషులకన్నా మహిళా ఓటర్లు తక్కువగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. ఈ ఎన్నికల పోలింగ్‌లో పురుష ఓటర్లు 67.01 శాతం ఓట్లేయగా, మహళా ఓటర్లు 67.18 శాతం పాల్గొన్నట్లు ఆ నివేదిక తెలిపింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పురుష ఓటర్లతో మహిళా ఓటర్లు దాదాపుగా సమానంగా ఉంటారని పేర్కొంది. 2029 లోక్‌సభ ఎన్నికల నుంచి 2047 ఎన్నికల వరకు మహిళా ఓటర్లదే హవా.
2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వినియోగించుకునే వారి సంఖ్య 68 కోట్లకు చేరుతుందని, అందులో 33 కోట్ల మహిళా ఓటర్లుంటారని అంచనా. ఇది మొత్తం పోలింగ్‌లో 49 శాతం. 2029 ఎన్నికల నుంచి పోలింగ్‌లో పాల్గొనే మహిళల సంఖ్య పెరుగుతూ పోతుందని, పురుష ఓటర్ల సంఖ్య తగ్గుతుందని నివేదిక వెల్లడించింది. 2024లో ప్రతి 100 మంది మహిళా ఓటర్లలో 67.6 శాతం ఓట్లు వేస్తారని, –2029లో ప్రతి 100 మంది మహిళా ఓటర్లలో 71.4 శాతం ఓట్లు వేస్తారని, 2047లో ప్రతి వంద మంది మహిళా ఓటర్లలో 86.3 శాతం ఓట్లు వేస్తారని నివేదిక తెలిపింది.
1951 ఎన్నికల్లో 8 కోట్ల మంది మాత్రమే ఓట్లు వేసినట్లు నివేదిక పేర్కొంది. 2009 ఎన్నికల్లో పోలింగ్‌లో పాల్గొన్న ఓటర్ల సంఖ్య 42 కోట్లకు పెరగ్గా, ఇందులో 19 కోట్ల మంది మహిళలున్నారు. 2014 ఎన్నికల్లో 55 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోగా అందులో 26 కోట్ల మంది మహిళలున్నారని నివేదిక తెలిపింది. 2019 ఎన్నికల్లో 62 కోట్ల మంది ఓట్లు వేయగా అందులో 30 కోట్ల మంది మహిళలని తెలిపింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 68 కోట్ల మంది ఓట్లు వేస్తారని, అందులో 33 కోట్ల మంది మహిళా ఓటర్లుంటారని నివేదిక పేర్కొంది.
ప్రస్తుత పోలింగ్ సరళిని పరిశీలిస్తే 2029 ఎన్నికల్లో 73 కోట్ల మంది ఓట్లు వేస్తారని, ఇందులో 37 కోట్లు మహిళలుంటారని అంచనా వేసింది. 2047 నాటికి 115 కోట్ల మంది ఓటర్లు నమోదవుతారని అంచనా వేయగా అందులో 80 శాతం మంది.. అంటే 92 కోట్ల మంది పోలింగ్‌లో పాల్గొంటారని అంచనా వేసింది. ఇందులో మహిళల ఓటింగ్ 55 శాతానికి పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది.
మహిళా ఓటర్లదే పెద్ద పాత్ర
భారత దేశ రాజకీయ రంగంలో మహిళల భాగస్వామ్యం పెరుగుతోందని, అలాగే లోక్‌సభ, రాష్ట్రాల ఎన్నికల్లో మహిళా ఓటర్ల పాత్ర గత దశాబ్దంలో అత్యంత ముఖ్యమైన ఘట్టంగా నివేదిక వ్యాఖ్యానించింది. గతంలోకంటే ఇప్పడు ఎన్నికల్లో మహిళా ఓటర్లు చాలా పెద్ద పాత్ర పోషిస్తారని నివేదిక పేర్కొంది. 1991 నుంచి పురుష, మహిళా ఓటర్ల మధ్య అంతరం తగ్గుతూ వస్తోందని తెలిపింది. 1991లో ఈ అంతరం పది శాతానికి పైగా ఉండగా 1996 నుంచి 2004 వరకు నాలుగు ఎన్నికల్లో 8.4 శాతానికి తగ్గిందని తెలిపింది.
గత ఐదేళ్లలో రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటింగ్ శాతం పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోందని నివేదిక పేర్కొంది. గత ఐదేళ్లలో 23 ప్రధాన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 18 రాష్ట్రాల్లో పురుష ఓట్ల పోలింగ్ శాతం కన్నా మహిళా ఓట్ల పోలింగ్ శాతం అత్యధికంగా ఉందని నివేదిక తెలిపింది. ఈ 18 రాష్ట్రాల్లో పది రాష్ట్రాల్లో అవే ప్రభుత్వాలు తిరిగి ఎన్నికయ్యాయని నివేదిక పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment