ఏయూక్యాంపస్(విశాఖ తూర్పు): ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. దాదాపు 40 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అకాల వర్షాలు.. తుపాన్లు ఇలా ప్రకృతి మానవునిపై కన్నెర్ర చేస్తోంది. దీనికి కారణం ఎవరు? మొదట్లో మానవుడు తన చర్యల ద్వారా పర్యావరణానికి ఏ ఇబ్బంది కలగని విధంగా జీవించాడు. కాలక్రమేణా మానవుడి జీవన శైలిని మారింది. తన ఆశలు, అవసరాలు తీర్చుకునేందుకు.. వాటి కోసం ప్రకృతిలోని సహజ వనరులను విపరీతంగా వాడుకోవడం మొదలు పెట్టాడు. తన మనుగడకే ప్రమాదం కొనితెచ్చుకుంటున్నాడు.
ఆగ్నేయ ఆసియాలో తొలిసారిగా..
ఆగ్నేయ ఆసియాలో తొలిసారిగా వాతావరణం, సముద్ర శాస్త్రాలను బోధించే విభాగాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 1948లో ప్రారంభించారు. వాతావరణ, సముద్ర శాస్త్ర రంగాల్లో సుశిక్షితులైన మానవ వనరులను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో జాతీయ, అంతర్జాతీయ సంస్థల సహకారం, సమన్వయంతో ఈ విభాగం ఏర్పాటైంది. ఇస్రో, ఎన్‌ఐవో, ఐఐటీఎం, ఐఎండీ, ఎస్‌ఏసీ, ఇన్‌కాయిస్, డీఆర్‌డీవో వంటి పరిశోధన సంస్థలు ఏయూలోని వాతావరణ శాస్త్ర విభాగంతో కలసి పనిచేస్తున్నాయి.
బంగాళాఖాతం, హిందూ మహా సముద్రాల్లో ఏర్పడే తుపానుల రియల్ టైమ్ ప్రిడిక్షన్, కాలానుగుణంగా వర్షపాతం, గణాంక నమూనాలు, రుతుపవనాల అంచనా, గమనం, తీరుతెన్నులు తదితర అంశాలపై ఇక్కడ లోతైన పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం విభాగంలో ఎమ్మెస్సీ(మెటియోరాలజీ), ఎమ్మెస్సీ(ఫిజికల్ ఓషనోగ్రఫీ), ఎమ్మెస్సీ (అట్మాస్ఫియరిక్ సైన్స్), ఎమ్మెస్సీ (ఓషన్ సైన్స్)లతో పాటు ఎంఫిఎల్, పీహెచ్‌డీ కోర్సులను అందిస్తున్నారు.
రొక్కం రామనాథం ఆలోచనలతో..
మెటియోరాలజీ విభాగాన్ని స్థాపించడానికి అవసరమైన అవగాహన, జ్ఞానం పొందడానికి ఏయూ భౌతిక శాస్త్ర విభాగం ఆచార్యులైన రొక్కం రామనాథంను వర్సిటీ యాజమాన్యం లండన్ పంపింది. అక్కడ ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్త బి.జె మేసన్ వద్ద ఆయన శిక్షణ తీసుకున్నారు. ఆచార్య రామనాథం ప్రత్యేకంగా రాడార్‌ను డిజైన్ చేశారు. పుణేలో నిరుపయోగంగా ఉన్న రాడార్‌లను తీసుకువచ్చి.. అవసరమైన మరమ్మతులు చేసి విభాగంలో వినియోగించేవారు. దీని సహాయంతో విభాగంలో రిసీవింగ్ స్టేషన్ ఏర్పాటు చేసి, వాతావరణ మార్పులకు సంబంధించిన సమాచారం తెలుసుకునేవారు.
తర్వాత కాలంలో ఆచార్య రామనాథం యూఎన్‌డీపీ సహకారంతో కెనడాలో ప్రపంచ వాతావరణ సంస్థకు సేవలు అందించారు. ఆయన తర్వాత ఆచార్య వి.పి.సుబ్రహ్మణ్యం, ఐ.సుబ్బరామయ్యలు కూడా ప్రపంచ వాతావరణ సంస్థకు సేవలు అందించారు. వీరంతా ఏయూలో చదువుకుని, ఇక్కడే ఆచార్యులుగా పనిచేసి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. అంతర్జాతీయ సంస్థల్లో పనిచేసే సామర్థ్యాలు కలిగిన ఎంతో మంది నిపుణులను ఏయూలోని ఈ కేంద్రం అందించింది. వ్యవసాయం, కాలుష్యం, క్లైమేట్ చేంజ్, రుతుపవనాలు, తుపానులు తదితర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తోంది. ఇక శాటిలైట్ల రాకతో వాతావరణ సమాచారం అందించే విధానాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. ప్రస్తుతం ప్రతి అర గంటకు వాతావరణ మార్పులు తెలుసుకునే సాంకేతిక వ్యవస్థ అందుబాటులో ఉంది.
ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే.?
ప్రపంచ వాతావరణ సంస్థ 1950 నుంచి ఏటా మార్చి 23న ప్రపంచ వాతావరణ దినోత్సవం నిర్వహిస్తోంది. సమాజ భద్రత, శ్రేయస్సుకు జాతీయ వాతావరణ, హైడ్రాలజీ(నీటి సంబంధ) సేవల ప్రాధాన్యాన్ని తెలియజేయడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ప్రతి సంవత్సరం వాతావరణ దినోత్సవాన్ని ఓ ప్రత్యేకమైన అంశాన్ని ఆధారంగా చేసుకుని నిర్వహిస్తోంది. సమయోచితంగా వాతావరణం, నీటి సమస్యలను ప్రతిబింబించే విధంగా ఇవి ఉంటాయి.
ఈ సంవత్సరం ‘ఎర్లీ వార్నింగ్ అండ్ ఎర్లీ యాక్షన్’ అంశంపై కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. పర్యావరణ మార్పుల ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా వాతావరణం, నీరు తీవ్రమైన ప్రభావానికి లోనవుతున్నాయి. జనాభా పెరుగుదల, పట్టణీకరణ, పర్యావరణ క్షీణత ఫలితంగా విపత్తుల సంఖ్య పెరిగిపోతోంది. వాతావరణం ఎలా ఉంటుంది అని చెప్పడం కంటే.. కచ్చితమైన వివరాలతో ప్రజల జీవితాలను, జీవనోపాధిని పరిరక్షించడానికి వాతావరణం ఎలా ఉపకరిస్తుందో తెలియజేయాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
విశాఖది మారిటైం క్లైమేట్
విశాఖ నగరంలో మారిటైం క్లైమేట్ మనకు దర్శనమిస్తుంది. సముద్ర మట్టానికి కొంత ఎత్తులో ఉండటం వలన కొంత చల్లని వాతావరణం ఉంటుంది. సెప్టెంబర్‌లో వర్షపాతం అధికంగా ఉంటుంది. వేసవిలో ఎండలు 38–42 డిగ్రీల వరకు ఉంటాయి. గతంతో పోల్చితే క్యుములో నింబస్ మేఘాలు బాగా తగ్గాయి. తేమ అధికంగా ఉంది.
– ఆచార్య ఒ.ఎస్.ఆర్.యు భానుకుమార్, వాతావరణ శాస్త్ర విభాగం
పరిశోధన కేంద్రంగా నిలుస్తోంది
ఆంధ్ర విశ్వవిద్యాలయం మెటియోరాలజీ విభా గం విలువైన సమాచారాన్ని అందించే పరిశోధన కేంద్రంగా నిలుస్తోంది. డీఎస్‌టీకి సంబంధించిన క్లైమేట్ ప్రాజెక్ట్‌లు, పిడుగులు పడటాన్ని గుర్తించే లైటెనింగ్ సెన్సార్ వంటి ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహిస్తున్నాం.
– ఆచార్య ఎస్.వి.ఎస్.ఎస్ రామకృష్ణ, వాతావరణ శాస్త్ర విభాగం
మానవ వనరులు అందిస్తోంది
ఏయూ వాతావరణ శాస్త్ర విభాగం దేశానికి అవసరమైన విలువైన వాతావరణ శాస్త్ర నిపుణులను తయారు చేసి అందించే బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తోంది. వాతావరణ మార్పులు, గాలి కాలుష్యం, తుపానులు, రుతుపవనాలు, సముద్రాలపై అధ్యయనం చేసే కేంద్రంగా విభాగాన్ని తీర్చిదిద్దారు. ఇటీవల సెర్బ్ నుంచి పరిశోధన ప్రాజెక్టులను సాధించాం.
– ఆచార్య సి.వి నాయుడు, విభాగాధిపతి, వాతావరణ శాస్త్ర విభాగం
Comments
Please login to add a commentAdd a comment