సాక్షి, తాడేపల్లి: మహిళలను ఉద్దేశించి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేసినవి దుర్మార్గపు వ్యాఖ్యాలని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ కేడర్ సమావేశంలో ఆయన కూటమి పాలనలో మహిళలపై జరుగుతున్న అరాచకాలపై మరోసారి స్పందించారు.
వైఎస్సార్‌సీపీ శ్రేణుల భార్యల పట్ల ఇంత దుర్మార్గంగా మాట్లాడతారా?. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణవి దుర్మార్గంగా మాట్లాడారు. రాధాకృష్ణ మాట్లాడింది తప్పని చెప్పకుండా.. చంద్రబాబు, లోకేష్, పవన్‌లు సమర్థిస్తారా?. మహిళల పట్ల ఈ ప్రభుత్వానికి గౌరవం లేదు. కూటమి నేతలే మహిళల్ని వేధిస్తున్నారు.
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అరాచకాలను ప్రశ్నిస్తే.. బాధిత మహిళను పోలీసుల సమక్షంలోనే కొట్టారు. ఎస్పీ ఆఫీసులోకి ఎమ్మెల్యే చొరబడడం ఏంటి?. దానికి చంద్రబాబు పంచాయితీ చేశారు. కేజీబీవీ ప్రిన్సిపాల్‌ను వేధించిన కూన రవిపై చర్యలేవి?. మహిళలతో అశ్లీల వీడియో కాల్స్ మాట్లాడిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే అహ్మద్‌పై చర్యలేవి?. మంత్రి సంధ్యారాణి పీఏ మీద ఏం చర్యలు తీసుకున్నారు?. తిరిగి బాధిత మహిళపైనే కేసులు పెట్టారు. టీటీడీ చైర్మన్ ఒక మహిళ జీవితంతో ఆడుకుంటే చర్యలు లేవు. పైగా చంద్రబాబు ఆయన్ని తన వెంటేసుకుని తిరుగుతున్నారు. ఒకర్ని చూసుకుని ఇంకొకరు తయారయ్యారు’’ అని వైఎస్ జగన్ అన్నారు.


