నేటి నుంచి 15 రోజుల పాటు ఇళ్ల పండగ: సీఎం జగన్‌ | YS Jagan Mohan Reddy Launch YSR Housing Scheme | Sakshi
Sakshi News home page

నేటి నుంచి 15 రోజుల పాటు ఇళ్ల పండగ: సీఎం జగన్‌

Published Fri, Dec 25 2020 2:59 PM | Last Updated on Fri, Dec 25 2020 9:22 PM

YS Jagan Mohan Reddy Launch YSR Housing Scheme - Sakshi

సాక్షి, తూర్పు గోదావరి: సొంతిల్లు లేని పేదల కష్టాలను పాదయాత్రలో కళ్లారా చూశానని, ఆ కారణం చేతనే ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. పేదల సొంతింటి కల నెరవేరుస్తానని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చే క్రమంలోనే  ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సీఎం జగన్‌ తెలిపారు. దీనిలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కొమరగిరిలో ఇళ్లు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. ఈ పథకం కింద మొదటి దశలో 15 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం చేపట్టనుండగా రెండు దశల్లో 28 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం ఉచితంగా పూర్తి చేసిస్తామని చెప్పారు. 175 నియోజకవర్గాల్లో నేటి నుంచి 15 రోజుల పాటు పండగలా పట్టాల పంపిణీ చేపడతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికిపైగా అక్కాచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలను ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. వైకుంఠ ఏకాదశి, క్రిస్‌మస్‌ పర్వదినాన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం​ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. (చదవండి: పేదలకు పట్టాభిషేకం)

పేదల కష్టాలను కళ్లారా చూశాను.
పాదయాత్రలో పేదల కష్టాలు దగ్గరుండి చూశానని, సొంతిల్లు లేని వారి కష్టాలను కళ్లారా చూశానని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. ఐదేళ్లలో 30.75 లక్షల మందికి ఇళ్లు కట్టిస్తామన్నారు. దీనివల్ల దాదాపు కోటి 24 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుందని వ్యాఖ్యానించారు. కుల, మత, రాజకీయాలకతీతంగా లబ్ధిదారుల ఎంపిక జరిగిందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు మొక్కుబడిగా ఇళ్ల నిర్మాణం ప్రారంభించిందని, మన ప్రభుత్వం కొత్త గ్రామాలను నిర్మించబోతుందన్నారు. ఇవాళ ఇళ్లు మాత్రమే కాకుండా ఊర్లు కడుతున్నామని చెప్పారు. 

పేదల కోసం సుప్రీం కోర్టులో పోరాడుతాం
"అమరావతిలో 54వేల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తామంటే సామాజిక అసమతుల్యం వస్తుందంటూ టీడీపీ కోర్టుకెళ్లింది. చంద్రబాబు, అనుచరుల పిటిషన్ల వల్ల 10% ఇళ్ల పట్టాల పంపిణీ నిలిచిపోయింది. నిన్న కూడా హైకోర్టులో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై పిల్ దాఖలు చేశారు. పేదల ఇళ్ల పట్టాల పంపిణీ కోసం ప్రభుత్వం సుప్రీం కోర్టులో పోరాడుతుంది. త్వరలోనే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఒక కులం ఉండకూడదని ఎవరైనా అంటారా? అందరూ కలిసి ఉండలేనప్పుడు అది రాజధాని ఎలా అవుతుంది? అందరికీ చోటు ఉంటేనే అది సమాజం అవుతుంది. అందరికీ మంచి చేస్తేనే అది ప్రభుత్వం అవుతుంది. 300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లలో జగనన్న స్కీమ్ కావాలా? చంద్రబాబు స్కీమ్ కావాలా? అని సర్వే చేశాం. 1.43 లక్షల మందిలో కేవలం ఒక్కరు మాత్రమే చంద్రబాబు స్కీమ్‌ అడిగారు. ఆ ఒక్కరికి చంద్రబాబు స్కీమ్‌లోనే ఇల్లు ఇస్తాం. మిగిలిన వారందరికీ జగనన్న స్కీమ్‌లో ఒక్క రూపాయికే ఇల్లు అందిస్తాం" అని సీఎం జగన్‌ అన్నారు. (చదవండి: ముందు లిమిటెడ్‌.. తరువాత రెగ్యులర్‌ డీఎస్సీ)

సీఎం వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

రాష్ట్ర వ్యాప్తంగా 2.62 లక్షల టిడ్కో ఇళ్లకు సేల్ అగ్రిమెంట్లు.
ఈరోజు 30లక్షల మందికి పైగా పేదలకు సొంతింటి కల నిజం చేశాం.
ఇళ్ల నిర్మాణం ద్వారా కోటి మందికిపైగా మేలు జరుగుతుంది.
కొత్తగా 17వేల వైఎస్ఆర్‌ జగనన్న కాలనీలు రాబోతున్నాయి.
కొత్త కాలనీల్లో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యం కల్పిస్తాం.
కాలనీల్లో పార్క్‌లు, కమ్యూనిటీహాల్స్‌, విలేజ్‌ క్లీనిక్‌లు, అంగన్‌వాడీలు ఏర్పాటు చేస్తాం.
224 చదరపు అడుగుల నుంచి 340 చదరపు అడుగులకు విస్తీర్ణం పెంచాం.
ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఇల్లు కూడా కట్టించి ఇస్తాం.
లబ్ధిదారుల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించాలని ఆశ పడ్డా కొంత మంది కోర్టుకెళ్లి రిజిస్ట్రేషన్ ప్రక్రియను అడ్డుకున్నారు
కోర్టు అడ్డంకులు తొలగగానే లబ్ధిదారుల పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తాం.
గత ప్రభుత్వంలో పెద్దలు ఏ రకంగా రాజకీయాలు చేశారో చూశాం.
ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదాలు పడటానికి రాజకీయ దురుద్దేశాలే కారణం.
పేదలకు మేలు జరుగుతుంటే పసుపు పార్టీల మొహాలు ఎరుపు రంగుకు మారుతున్నాయి.
44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును చట్టబద్ధ హక్కుగా మార్చారు.
పేదలకు ఆస్తి హక్కు కల్పించే ప్రయత్నం చేస్తుంటే కోర్టుకెళ్లి అడ్డుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement