
సుందరకాండ పారాయణాన్ని ఆలకిస్తున్న ఏపీ, కర్ణాటక సీఎంలు వైఎస్ జగన్, యడియూరప్ప
సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం కర్ణాటక సీఎం బీఎస్ యడియూరప్పతో కలిసి తిరుమలలో సుందరకాండ పారాయణంలో పాల్గొన్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలపించిన తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన గీతాన్ని భక్తి శ్రద్ధలతో ఆలకించారు. నాద నీరాజనం వేదికపై సుమారు గంటకు పైగా సాగిన ఈ కార్యక్రమంలో ఆద్యంతం వారు భక్తి పారవశ్యంలో తన్మయం చెందారు. సుందరకాండలోని ముఖ్యమైన ఘట్టాల గురించి శ్రద్ధగా విన్నారు. ‘శ్రీ హనుమా.. జయ హనుమా..’ అనే సంకీర్తనను కళాకారులు ఆలపిస్తున్నప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు సైతం పెదవి విప్పి మాట కలుపుతూ పరవశించిపోయారు.
భక్తి శ్రద్ధలతో శ్రీవారి దర్శనం
ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, బీఎస్ యడియూరప్పలు గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం 6.20 గంటలకు సీఎం వైఎస్ జగన్ తొలుత ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆయనకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అంతలో అక్కడికి చేరుకున్న కర్ణాటక సీఎం యడియూరప్పకు అందరూ కలిసి స్వాగతం పలికారు. అనంతరం మహాద్వారం మీదుగా ఇద్దరు సీఎంలు ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకు ముందు ధ్వజస్తంభానికి నమస్కరించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వారు వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు. టీటీడీ చైర్మన్, ఈవోలు వారికి తీర్థ ప్రసాదాలు, స్వామి వారి చిత్రపటాన్ని అందించారు.
వైఎస్ జగన్‌ను కలిసిన డీకే శ్రీనివాస్
► చిత్తూరు మాజీ పార్లమెంట్ సభ్యుడు డీకే ఆదికేశవులు నాయుడు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే డీకే సత్యప్రభ దంపతుల కుమారుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త డీకే శ్రీనివాస్ గురువారం తిరుమలలో సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు.
► తన తండ్రి టీటీడీ చైర్మన్‌గా ఉన్నప్పుడు ప్రారంభించిన ‘ఆనంద నిలయం అనంత స్వర్ణమయం’ ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరానని శ్రీనివాస్ చెప్పారు.
నూతన వసతి సముదాయానికి భూమి పూజ
► 2008లో టీటీడీ తిరుమలలోని కర్ణాటక చారిటీస్‌కు 7.05 ఎకరాల భూమిని 50 ఏళ్లకు లీజుకు ఇచ్చింది. ఈ స్థలంలో రూ.200 కోట్లతో నూతన వసతి సముదాయాల నిర్మాణం చేపట్టడానికి జూలైలో కర్ణాటక ప్రభుత్వం, టీటీడీ మధ్య అంగీకారం కుదిరింది.
► ఈ నేపథ్యంలో నూతనంగా నిర్మించనున్న వసతి సముదాయాలకు గురువారం కర్ణాటక సీఎం యడియూరప్ప ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో కలిసి భూమి పూజ చేశారు. ఇందులో 242 వసతి గదులు, 32 సూట్ రూములు, 12 డార్మిటరీలు, కల్యాణమండపం, డైనింగ్ హాల్ నిర్మిస్తారు. పుష్కరిణిని పునరుద్ధరిస్తారు. టీటీడీ ఈ నిర్మాణాలు పూర్తి చేసి కర్ణాటక ప్రభుత్వానికి అప్పగించనుంది. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
► ఉదయం 10.40 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్‌కు ప్రజాప్రతినిధులు, అధికారులు వీడ్కోలు పలికారు. అనంతరం ఆయన హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లారు. 11 గంటలకు యడియూరప్పకు వీడ్కోలు పలుకగా, ప్రత్యేక విమానంలో ఆయన బెంగళూరుకు బయల్దేరి వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment