సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. కోవిడ్ ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్య పెంచాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లాలోనూ కోవిడ్ కేర్ సెంటర్లలో 3 వేల బెడ్లు కేటాయించాలని.. అవసరమైన చోట అదనపు సిబ్బందిని తక్షణం నియమించాలని సూచించారు. కొత్తగా ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘కోవిడ్ కేర్ సెంటర్లలో విధిగా 1000 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ జాబితాలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్సకు రేట్లు పెంచండి. అవే రేట్లు కోవిడ్ చికిత్స అందిస్తున్న ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు కూడా వర్తింపచేయాలి’’ అని అధికారులను ఆదేశించారు.
‘‘ఏ ఆస్పత్రి కూడా కోవిడ్ చికిత్సకు నిరాకరించకుండా చూడాలి. కోవిడ్ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న ఎఫ్ఎన్‌ఓ, ఎంఎన్‌వో జీతాల పెంచుతాం. కోవిడ్ ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బందిని తక్షణం నియమించాలి. 42 పీఎస్‌ఏ ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. టీచింగ్ ఆస్పత్రి వద్ద 10 కేఎల్, ఇతర ఆస్పత్రుల వద్ద 1 కేఎల్ సామర్థ్యంతో కూడిన ఆక్సిజన్ ట్యాంకర్లు ఏర్పాటు చేయాలి’’ అని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment