50 పడకలు దాటితే.. ఆస్పత్రుల్లోనే ఆక్సిజన్‌ ప్లాంట్లు | CM Jagan Says Oxygen plants in hospitals If 50 beds are exceeded | Sakshi
Sakshi News home page

50 పడకలు దాటితే.. ఆస్పత్రుల్లోనే ఆక్సిజన్‌ ప్లాంట్లు

Published Sat, May 22 2021 3:00 AM | Last Updated on Mon, May 31 2021 8:25 PM

CM Jagan Says Oxygen plants in hospitals If 50 beds are exceeded - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 50 పడకలు దాటిన ఆస్పత్రుల్లో కచ్చితంగా ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో నెలకొల్పే పీఎస్‌ఏ ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లకు 30 శాతం ఇన్సెంటివ్‌ ఇవ్వాలని అధికారులకు సూచించారు. ముందస్తుగానే ఇన్సెంటివ్‌లు ఇవ్వడం ద్వారా చురుగ్గా ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేసేలా ప్రోత్సహించవచ్చన్నారు. 4 నెలల వ్యవధిలో అన్ని ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ బెడ్స్‌ కెపాసిటీకి అనుగుణంగా ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పిల్లల చికిత్స కోసం ప్రత్యేకంగా ఐసీయూ బెడ్స్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే కోవిడ్‌ నేపథ్యంలో ఆక్సిజన్‌ ఉత్పత్తి పెంచేందుకు 2021 పాలసీని కూడా ప్రకటించామని సీఎం గుర్తు చేశారు. కోవిడ్‌ నియంత్రణ, చికిత్స, ఆక్సిజన్‌ సరఫరా, వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి జగన్‌ శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ..

భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా...
రాష్ట్రంలో 300 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో ఆక్సిజన్‌ ఉత్పత్తిపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. భవిష్యత్తులో ఎలాంటి మహమ్మారినైనా ఎదుర్కొనేందుకు ఈ ఏర్పాట్లు ఉపయోగపడతాయన్నారు. రాష్ట్రంలో కంపెనీలు బయట ఏర్పాటు చేసే పెద్ద ప్లాంట్లకు 20 శాతం ఇన్సెంటివ్‌ ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న డిమాండ్‌కు తగినట్టుగా ఆక్సిజన్‌ ఉత్పత్తి జరగాలని, ఆ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆక్సిజన్‌ తయారీలో వినియోగించే జియోలైట్‌ కొరతను అధిగించేలా కడపలో త్వరలో ఆ పరిశ్రమ ఏర్పాటు కానుందని అధికారులు తెలిపారు.

వేగంగా వ్యాక్సిన్‌ టెండర్ల ప్రక్రియ
కోవిడ్‌ వ్యాక్సిన్లు సేకరించేందుకు వీలైనంత వేగంగా గ్లోబల్‌ టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో రెండు కోట్ల మంది ప్రజలకు సరిపడేలా 4 కోట్ల డోస్‌లు ప్రస్తుతం సేకరించనుండగా వీలుంటే ఇంకా ఎక్కువ అందేలా ప్రయత్నించాలని సూచించారు.
తొలుత 45 ఏళ్లు దాటిన వారందరికీ రెండు డోస్‌లూ ఇవ్వాలని, ఆ తర్వాత 18 – 45 ఏళ్ల వారికి కూడా తప్పనిసరిగా రెండు డోస్‌ల వ్యాక్సిన్లు ఇవ్వాలన్నారు. ఈ నేపథ్యంలో వీలైనన్ని ఎక్కువ వ్యాక్సిన్‌ డోస్‌లు  సేకరించాల్సిందిగా ముఖ్యమంత్రి సూచించారు.

ఆహారం, పారిశుద్ద్యం
కోవిడ్‌ ఆస్పత్రుల్లో రోగులకు మంచి ఆహారం అందించడంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణ మెరుగ్గా ఉండేలా అన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆస్పత్రులు, ప్రజారోగ్యంపై పెద్ద ఎత్తున వ్యయం చేస్తున్నామని, చిన్న చిన్న విషయాల్లో సమస్యలు తలెత్తకూడదని అధికారులకు స్పష్టం చేశారు. ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి ఆస్పత్రి నుంచి నివేదికలు తెప్పించుకుని చర్యలు తీసుకోవాలని, రోగులకు సౌకర్యంగా ఉండాలని, ఎక్కడా అపరిశుభ్ర వాతావరణం ఉండకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.  

అధికంగా వసూలు చేస్తే చర్యలు
ప్రభుత్వం నిర్ణయించిన ధరలకన్నా అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్ల విషయంలో అక్రమాలకు పాల్పడ్డ ఆస్పత్రులపైనా కచ్చితంగా చర్యలు తీసుకోవాలని, ఇంటెలిజెన్స్‌ అధికారులు నమోదు చేసిన కేసుల్లో తగిన  చర్యలుండాలని స్పష్టం చేశారు.

ఆ ఔషధంపై శాస్త్రీయ నిర్ధారణ చేయాలి
కోవిడ్‌ చికిత్సకు సంబంధించి నెల్లూరు ఆయుర్వేద వైద్యంపై శాస్త్రీయ నిర్ధారణ జరపాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. నెల్లూరు ఆయుర్వేద ఔషధంపై కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంబంధిత విభాగాల అధికారులతో పరీక్షలు చేయించాలని సూచించారు. 

బ్లాక్‌ ఫంగస్‌పై జాగ్రత్త..
కరోనా బాధితులు బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడుతున్న నేపథ్యంలో దీనిపై పూర్తి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆక్సిజన్‌ 
సేకరించేటప్పుడు వినియోగించే నీటి విషయంలో జాగ్తత్తలు తీసుకోవాలని కొత్తగా సమాచారం వస్తోందని, ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని పటిష్టమైన ప్రొటోకాల్‌ రూపొందించాలని సూచించారు. ఆక్సిజన్‌ సరఫరా పైపులు, మాస్క్‌లు.. అన్నీ నిర్ణీత ప్రమాణాలున్న వాటినే వినియోగించాలని స్పష్టం చేశారు. 

వారంలో మరో ఆక్సిజన్‌ రైలు...
రాష్ట్రంలో ఆక్సిజన్‌ సరఫరా, నిల్వలతో పాటు కోవిడ్‌ ప్రస్తుత పరిస్థితిని సమావేశంలో అధికారులు వివరించారు. ఆక్సిజన్‌ రవాణా కోసం రెండు  ఆక్సిజన్‌ రైళ్లు నడుస్తున్నాయని, ఈ వారంలో మరో ఆక్సిజన్‌ ట్రైన్‌ ప్రారంభం అవుతుందని వెల్లడించారు. దీంతోపాటు భువనేశ్వర్‌కు ప్రతిరోజూ 4 ట్యాంకర్లను ఎయిర్‌ లిఫ్ట్‌ చేస్తున్నామని  తెలిపారు. దేశంలో ఎక్కడ ఆక్సిజన్‌ కేటాయించినా సేకరించగలుగుతున్నామని వివరించారు. ఐఎస్‌ఓ ట్యాంకర్లను వినియోగించుకుని సమర్థవంతంగా ఆక్సిజన్‌ సేకరిస్తున్నామన్నారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ వినియోగంపై ఆడిట్‌ చేస్తున్నట్లు తెలిపారు.  అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఎక్కడా వృథా కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆక్సిజన్‌ సేకరణ, సరఫరా, పంపిణీ, ఆస్పత్రుల్లో వినియోగం అన్నింటినీ పూర్తిగా కంప్యూటరైజ్‌ చేశామని తెలిపారు.

9 పీఎస్‌ఏల పునరుద్ధరణతో 52.75 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌
రాష్ట్రంలో తొమ్మిది పీఎస్‌ఏ యూనిట్లను పునరుద్ధరించడం ద్వారా 52.75 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి కానుందని అధికారులు వెల్లడించారు. మరో 5 పీఎస్‌ఏ యూనిట్ల పునరుద్ధరణ పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. 12 నైట్రోజన్‌ యూనిట్లను కూడా మార్పిడి 
చేయడం ద్వారా మరో 11.41 మెట్రిక్‌ టన్నులు అదనంగా ఉత్పత్తి కానుందని, కొత్తగా నాలుగు కంపెనీలు ఆక్సిజన్‌ ఉత్పత్తికి ముందుకొస్తున్నాయని అధికారులు వివరించారు. 

కోవిడ్‌ ఆస్పత్రులు–బెడ్లు..
రాష్ట్రంలో ప్రస్తుతం 621 కోవిడ్‌ ఆస్పత్రులలో 45,611 బెడ్లు ఉండగా 38,763 బెడ్లు ఆక్యుపై కాగా 28,189 మంది ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. అన్ని కోవిడ్‌ ఆస్పత్రులలో 6,217 ఐసీయూ బెడ్లు, 22,756 నాన్‌ ఐసీయూ ఆక్సిజన్‌ బెడ్లు, 16,638 నాన్‌ ఐసీయూ నాన్‌ ఆక్సిజన్‌బెడ్లతో పాటు 3,407 వెంటిలేటర్లు ఉన్నాయని తెలిపారు.

గత సెప్టెంబరులో..
గత ఏడాది సెప్టెంబరులో 261 ఆస్పత్రులో 37,441 బెడ్లు, 2,279 వెంటిలేటర్లు మాత్రమే ఉండగా ఇప్పుడు వాటితో పాటు ఐసీయూ బెడ్లు, నాన్‌ ఐసీయూ ఆక్సిజన్‌బెడ్లు, నాన్‌ ఐసీయూ నాన్‌ ఆక్సిజన్‌ బెడ్లు గణనీయంగా పెరిగాయని అధికారులు చెప్పారు. 

గ్లోబల్‌ టెండర్లకు మంచి స్పందన..
రాష్ట్రంలో రెండు కోట్ల మందికి వ్యాక్సిన్లు (4 కోట్ల డోస్‌లు) ఇచ్చే విధంగా ఈనెల 13న గ్లోబల్‌ టెండర్లు పిలిచినట్లు అధికారులు తెలిపారు.  ప్రిబిడ్‌ సమావేశం ఈనెల 20న జరగగా, బిడ్ల దాఖలుకు జూన్‌ 3 చివరి తేదీగా నిర్ణయించామని, టెండర్లకు మంచి స్పందన వస్తోందని అధికారులు వివరించారు. 
– సమీక్షలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, పరిశ్రమల శాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవన్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎంటీ కృష్ణబాబు, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనేజ్‌మెంట్, వ్యాక్సినేషన్‌) ఎం.రవిచంద్ర, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, 104 కాల్‌ సెంటర్‌ ఇంఛార్జ్‌ ఎ.బాబు, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్‌ ఎ.మల్లికార్జున్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ వి.విజయరామరాజు, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్‌.గుల్జార్, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ జువ్వాది సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement