కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలకు శ్రీవారి ప్రసాదం అందజేస్తున్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, అర్చకులు
సాక్షి, తిరుపతి/తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుని సేవలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరించారు. తిరుపతిలో నిర్వహిస్తున్న 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యేందుకు తిరుపతికి విచ్చేసిన అమిత్‌షాతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక కాన్వాయ్‌లలో రోడ్డు మార్గాన తిరుమల చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహం వద్ద అమిత్ షాను దిగబెట్టి.. అటునుంచి వైఎస్ జగన్.. శ్రీకృష్ణ అతిథి గృహానికి చేరుకున్నారు. ఆ తర్వాత సంప్రదాయ పంచకట్టుతో తిరిగి పద్మావతి అతిథి గృహానికి వచ్చారు. అనంతరం ఇద్దరూ కలిసి ఒకే కారులో ఆలయం వద్దకు చేరుకున్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె.ఎస్ జవహర్‌రెడ్డి, వేద పండితులు మహద్వారం వద్ద వారికి స్వాగతం పలికారు. «ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించుకుని వెండి వాకిలి ద్వారా ఆలయంలోనికి ప్రవేశించారు.
శ్రీవారిని దర్శించుకున్న అనంతరం విమాన వేంకటేశ్వరస్వామికి నమస్కరించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. భాష్యకార్లను, శ్రీ యోగ నరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వారికి వేద పండితులు ఆశీర్వచనాలు పలికి దీవించారు. ఆ తర్వాత వారికి టీటీడీ చైర్మన్, ఈవోలు శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలతో పాటు కాఫీ టేబుల్ బుక్, 2022 డైరీ, క్యాలెండర్, టీటీడీ అగరబత్తులను అందజేశారు. రాష్ట్రానికి అన్ని విధాలుగా మేలు జరగాలని, ప్రజా రంజక, సుపరిపాలన అందించేలా శక్తినివ్వాలని శ్రీవారిని వేడుకున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. దర్శన అనంతరం ఆలయం వెలుపల భక్తులకు చిరునవ్వుతో అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అంతకు ముందు పద్మావతి అతిథి గృహానికి చేరుకున్న అమిత్ షా, వైఎస్ జగన్‌లకు మంత్రి వెలంపల్లి, అధికారులు స్వాగతం పలికారు.
అమిత్ షాకు ఘన స్వాగతం
తిరుపతి సమీపంలోని రేణిగుంట విమానాశ్రయంలో శనివారం రాత్రి 7.50 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాత్రి 7.50 గంటలకు పుష్పగుచ్ఛం అందించి, దుశ్శాలువ కప్పి సాదర స్వాగతం పలికారు. ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం పలువురు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, సీఎస్, డీజీపీ, ఇతర అధికారులు పుష్పగుచ్ఛాలు అందించారు. కాగా, హోం మంత్రి రాకకు అరగంట ముందే ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్‌కు మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణ స్వామి, గౌతమ్‌రెడ్డి, ఎంపీ గురుమూర్తి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు స్వాగతం పలికారు. కేంద్ర హోం మంత్రికి స్వాగతం పలికిన వారిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, పార్టీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, సీఎం రమేష్, విష్ణువర్దన్‌రెడ్డి తదితరులు ఉన్నారు. కాగా, అమిత్ షా తిరుపతికి వెళ్లి తాజ్ హోటల్‌లో బస చేశారు. సీఎం వైఎస్ జగన్ తాడేపల్లికి బయలుదేరారు. ఆదివారం మధ్యాహ్నం తిరిగి తిరుపతికి వస్తారు.
ఆధ్యాత్మిక నగరికి అతిరథ మహారథులు
తిరుపతి తుడా (చిత్తూరు జిల్లా) : తిరుపతి వేదికగా ఆదివారం నిర్వహించనున్న 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు అతిరథ మహారథులు ఆధ్యాత్మిక నగరానికి చేరుకున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పుదుచ్చేరి సీఎంలు వైఎస్ జగన్, బసవరాజు బొమ్మై, ఎం.రంగస్వామి, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్, అండమాన్ నికోబార్ ఐల్యాండ్స్ లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మిరల్ డి.కులానంద్ జోషి, కేంద్ర ప్రభుత్వ సివిల్ ఏవియేషన్ మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ రుబీనా ఆలీలు తిరుపతి చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులుగా హోం మంత్రి మహమూద్ అలీ, సీఎస్ సోమేశ్ హాజరు కానున్నారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఆదివారం సీఎం షెడ్యూల్ ఇలా..
ఆదివారం మధ్యాహ్నం 1.15 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి తిరుపతి బయలుదేరుతారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి తిరుపతి తాజ్ హోటల్‌లో అమిత్ షా అధ్యక్షతన జరిగే సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు.
Comments
Please login to add a commentAdd a comment