మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం నుంచి పోలవరం నిధులొచ్చే వరకూ పార్లమెంట్‌లో పోరాటం కొనసాగిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు స్పష్టంచేశారు. ఏడేళ్లుగా పోలవరం నిరాదరణకు గురైందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. పార్టీ ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్, వంగా గీత, పోచ బ్రహ్మానందరెడ్డి, గురుమూర్తి సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. బెల్లాన మాట్లాడుతూ.. ప్రధాని, జలశక్తి మంత్రులకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నిసార్లు నిధుల కోసం విన్నవించినా కేంద్రం మాత్రం నిధులు విడుదల చేయడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తన నిధుల నుంచి వేల కోట్లు ఖర్చుపెడుతోందన్నారు. అలాగే, సవరించిన అంచనా మేరకు పునరావాసం, పరిహారం నిమిత్తం రూ.33వేల కోట్లు రావాల్సి ఉందన్నారు. రాష్ట్రం ఖర్చుచేసిన రూ.2వేల కోట్లకు పైగా కూడా విడుదల చేయలేదన్నారు. గతంలో చంద్రబాబు 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకొంటూ రైతుల ప్రయోజనాలు విస్మరించారని ఆరోపించారు. టీడీపీ ముగ్గురు ఎంపీలు వైఎస్సార్‌సీపీని విమర్శించడం తప్ప ఏ రోజూ కూడా బీజేపీని ప్రశ్నించడం లేదన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు పోలవరం నిధుల కోసం సభలో ఆందోళన చేస్తామన్నారు. కేంద్రం సకాలంలో విడుదల చేస్తే ప్రాజెక్టు వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి పూర్తవుతుందని బెల్లాన చంద్రశేఖర్ తెలిపారు.
సవరించిన అంచనాలపై తాత్సారం
ఎంపీ వంగా గీత మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైందని తెలిపారు. ఏపీ విభజన సమయంలో జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని ప్రకటించినప్పటికీ ఆ తర్వాత తగిన శ్రద్ధ లేకపోవడంవల్ల ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగాయన్నారు. సాంకేతిక కమిటీ ఆమోదించినా సవరించిన అంచనాలపై కేంద్రం ముందుకెళ్లడం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)ని హైదరాబాద్ నుంచి రాజమండ్రికి తరలించాలన్నారు. కార్యాలయం తరలించడానికే ఇంతకాలం పడుతోందంటే ప్రాజెక్టుపై కేంద్రానికున్న చిత్తశుద్ధి అర్ధంచేసుకోవచ్చన్నారు. ప్రాజెక్టుకు తగిన నిధులు వెంటనే కేటాయించాలని ఆమె డిమాండు చేశారు. ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. నిధులిచ్చే వరకూ తమ పార్టీ నిరసన కొనసాగుతుందని స్పష్టంచేశారు. నిధులు, విభజన హామీలపై సభలో రోజూ పోరాడతామని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment