
వైఎస్సార్ జగనన్న భూరక్ష కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ధర్మాన కృష్ణదాస్, చిత్రంలో హోంమంత్రి సుచరిత, ఎమ్మెల్యేలు ఆర్కే, శివకుమార్ తదితరులు
మంగళగిరి (దుగ్గిరాల): రాష్ట్రంలో ఎక్కడా భూవివాదాలు లేకుండా పరిష్కరించేందుకే వైఎస్సార్ జగనన్న భూరక్ష రీసర్వే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం దేవరపల్లి అగ్రహారంలో భూరక్ష రీసర్వే పైలట్ ప్రాజెక్టు ప్రారంభ కార్యక్రమంలో ఆయన సోమవారం పాల్గొన్నారు. ఇందులో భాగంగా హోం శాఖ మంత్రి మేకతోటి సుచరితతో కలిసి భూములకు సరిహద్దుల సర్వే రాయిని పాతారు. ఈ సందర్భంగా సర్వేపై రైతుల అభిప్రాయాలను తెలుసుకోగా వారు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ధర్మాన మాట్లాడుతూ.. 114 ఏళ్ల క్రితం భూముల సర్వే జరిగిందని, నాటి నుంచి ఇప్పటివరకు సర్వే నిర్వహించకపోవడంతో భూముల వివాదాలు అధికమయ్యాయన్నారు. రూ.1,000 కోట్లతో మూడు విడతలుగా రాష్ట్రం మొత్తం సర్వే నిర్వహిస్తామన్నారు. తద్వారా స్పష్టమైన రికార్డులు తయారుచేయడమే భూరక్ష లక్ష్యమన్నారు.
సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి.. ఎక్కడా వివాదాలు లేకుండా సుశిక్షితులైన అధికార యంత్రాంగంతో సర్వే నిర్వహించనున్నట్టు తెలిపారు. ముఖ్యంగా భూవివాదాల్లో సరిహద్దులే వివాదాలుగా ఉంటాయని, వాటిని పూర్తిగా పరిష్కరించడం, ప్రభుత్వ ఖర్చుతోనే వివాదాలు లేకుండా చేయడం ఒక చరిత్రగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), అన్నాబత్తుని శివకుమార్, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషారాణి, ల్యాండ్ రికార్డ్స్, సర్వే సెటిల్‌మెంట్ కమిషనర్ సిద్ధార్థ్ జైన్, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, జేసీ దినేష్‌కుమార్, ఆర్డీవో భాస్కరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment