రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ, జనసేన శ్రేణులు పేట్రేగిపోతున్నాయి
వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నాయి
పార్టీ, ప్రభుత్వ కార్యాలయాల్లో విధ్వంసం సృష్టిస్తున్నాయి
శాంతిభద్రతలు క్షీణించాయి.. ప్రభుత్వం పట్టించుకోవడంలేదు
గవర్నర్‌కు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు
తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి
టీడీపీ అరాచకాలను అరికట్టాలని గవర్నర్‌కు వినతి
నిబంధనల ప్రకారమే పార్టీ ఆఫీసుల నిర్మాణం: వైవీ సుబ్బారెడ్డి
టీడీపీ దాడులపై సీఎం చంద్రబాబు స్పందించాలి : అయోధ్యరామిరెడ్డి
సాక్షి, అమరావతి: ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కూటమి శ్రేణులు చేస్తున్న దాడులు, విధ్వంసాలను అరికట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కోరింది. వైఎస్సార్‌సీపీ నేతలు, రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి నేతృత్వంలోని పార్టీ బృందం శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసి, ఈమేరకు వినతిపత్రం అందించింది. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి టీడీపీ, జనసేన శ్రేణులు పేట్రేగిపోతున్నాయని ఫిర్యాదు చేసింది.
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులపై టీడీపీ శ్రేణులు దాడులు చేస్తున్నాయని, పార్టీ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో విధ్వంసం సృష్టిస్తున్నాయని తెలిపింది. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని, అస్థిరత నెలకొందని వివరించింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని తెలిపింది. తక్షణమే జోక్యం చేసుకొని టీడీపీ అరాచకాలకు అడ్డకట్ట వేయాలని గవర్నర్‌ను వైఎస్సార్‌సీపీ బృందం కోరింది.
అనంతరం వైవీ సుబ్బారెడ్డి, అయోధ్యరామిరెడ్డి మీడియాతో మట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులు, పార్టీ కార్యాలయాలు, ప్రభుత్వ భవనాల ధ్వంసం జరుగుతున్నా సీఎం చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
ప్రధాని, రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాం : వైవీ సుబ్బారెడ్డి
రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో 26 రోజులుగా టీడీపీ, జనసేన శ్రేణులు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపైన, ఇళ్లపైన దాడులు చేస్తున్నారని, దారుణంగా అవమానిస్తున్నారని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ ఆస్తులపైనా దాడులు చేస్తున్నారని, పారీ్టకి చెందిన, వైఎస్సార్ పేరు ఉన్న శిలా ఫలకాలను ధ్వంసం చేస్తున్నారని తెలిపారు. అయినా పోలీసులు ఎటువంటి చర్యలూ తీసుకోవడంలేదన్నారు.
కనీసం కేసులు కూడా నమోదు చేయడంలేదని అన్నారు. దీంతో ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశామన్నారు. అయినా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి మెరుగు పడలేదన్నారు. దాడులు, విధ్వంసం కొనసాగుతూనే ఉందని అన్నారు.
వైఎస్సార్‌సీపీకి ఓట్లేసిన దళిత కుటుంబాలను కూడా దారుణంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ విగ్రహాలను కూడా తగలబెడుతున్నారని అన్నారు. పరిస్థితులు దారుణంగా ఉండటంతో తక్షణమే జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను కోరినట్టు చెప్పారు.
హింసాత్మక ధోరణి కొనసాగరాదు : ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి
ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, గెలిచిన వాళ్లు విజయాన్ని ఆస్వాదిస్తూ ఒక పద్ధతిలో ఓడిన వారికి షేక్ హ్యాండ్ ఇచ్చేలా ఉండాలని ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అన్నారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రతిపక్షంపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. 2014 –19లో చంద్రబాబు తెచ్చిన జీవో, నిబంధనల ప్రకారమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు కూడా ప్రభుత్వం స్థలాలు కేటాయించిందని తెలిపారు.
నిబంధనల ప్రకారమే పార్టీ ఆఫీసుల నిర్మాణం జరుగుతోందని, ఇవి అక్రమ నిర్మాణాలు కాదని స్పష్టం చేశారు. అయినా వేల కోట్ల ప్రజాధనం వృధా అయిందంటూ దు్రష్పచారం చేస్తున్నారన్నారు. ఒక్కో ఆఫీసు 10 వేల చదరపు అడుగులు ఉంటుందని, ఈరోజు నిర్మాణ ఖర్చు చదరపు అడుగుకు రూ.2,000 నుంచి రూ.2,500 వరకు ఉందన్నారు. అంటే ఒక్కో ఆఫీసు నిర్మాణానికి రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు ఖర్చవుతుందని, ఇలా ఇప్పటి వరకు 18 ఆఫీసులకు దాదాపు రూ.60 కోట్లు ఖర్చు పెట్టామని వివరించారు.
కానీ రూ.500 కోట్ల నుంచి రూ.5,000 కోట్లు ప్రజాధనం దురి్వనియోగమైనట్లు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమ కార్యకర్తలు, పార్టీ కార్యాలయాలపై దాడులను ప్రభుత్వం ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్,, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు.
మా పార్టీ ఆఫీసుల్లోకి ప్రవేశించి బెదిరింపులు
గతంలో టీడీపీ ప్రభుత్వంలో వాళ్ల పార్టీ భవనాలకు, బీజేపీ ఆఫీసులకు, కమ్యూనిస్టు పార్టీల ఆఫీసులకు స్థలాలు మంజూరు చేసిన విధంగానే, ఆ నిబంధనల ప్రకారమే వైఎస్సార్‌సీపీ ఆఫీసులకు స్థలాలు తీసుకున్నామని సుబ్బారెడ్డి తెలిపారు. అన్ని అనుమతులు తీసుకున్నాక భవనాలు నిర్మిస్తున్నామన్నారు.
నిర్మాణం పూర్తయ్యే వాటి వద్దకు వెళ్లి టీడీపీ, జనసేన కార్యకర్తలు అక్కడున్న తమ కార్యకర్తలు, సిబ్బందిని బెదిరించి భవనాలను కూలగొడతామంటున్నారని, వీటన్నింటినీ అడ్డుకోవాలని గవర్నర్‌ని కోరామని తెలిపారు. వీటికి సంబంధించి ఫొటోలను కూడా గవర్నర్‌కు చూపించామన్నారు. కొన్ని ఫొటోలను చూసి ‘ఇంత దారుణంగా పరిస్థితి ఉందా’ అని గవర్నర్ చాలా ఆశ్చర్యపోయారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment