సాక్షి ప్రతినిధి గుంటూరు: గుంటూరు ప్రజల ఓట్లతో గెలుపొందిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ గుంటూరులో మాత్రం కనిపించడం లేదంటూ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో నిరసన వ్యక్తం చేశారు. ఎంపీ మిస్సింగ్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. శుక్రవారం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో తమ డివిజన్లలో పనులు జరగడం లేదంటూ తెలుగుదేశం కార్పొరేటర్లు ప్రస్తావిస్తుండగా మేయర్ కావటి మనోహర్‌నాయుడు జోక్యం చేసుకుని తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెబుతున్నట్లుగా తాము కూడా పారీ్టలకతీతంగా, కులాలు, ప్రాంతాలకతీతంగా నగరాభివృద్ధి చేపట్టామని, టీడీపీ వారు గెలిచిన డివిజన్లలో కూడా రూ.3 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
తెలుగుదేశం గెలిచిన 38వ డివిజన్‌లో నాలుగు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టగా, ఎంపీ కేవలం పది లక్షల రూపాయలు ఇచ్చారని అనడంతో తెలుగుదేశం సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. దీంతో తెలుగుదేశం సభ్యుడొకరు లేచి తాము నిధులు కావాలని అడుక్కుంటే ఇచ్చారని, మీరు కూడా వస్తే ఇస్తారంటూ వాదనకు దిగారు. దీనిపై అధికార పార్టీ కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గుంటూరు ఎంపీ అందరిని సమానంగా చూడాలని, కేవలం మీ పార్టీ సభ్యులకే నిధులు కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు.
తాము గెలిచి ఏడాదిన్నర కావస్తున్నా ఇప్పటి వరకూ ఎంపీని తాము చూడలేదని, ఎంపీ మిస్సింగ్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అసలు గుంటూరులో ఉండని వ్యక్తిని ఢిల్లీ వరకూ వెళ్లి నిధులు అడగాలా? అంటూ ప్రశ్నించారు. దీంతో మాటామాట పెరిగి తీవ్ర వాగి్వవాదానికి, తోపులాటకు దారితీసింది. టీడీపీ కార్పొరేటర్లు మహిళా కార్పొరేటర్లను సైతం తోసే ప్రయత్నం చేయడంతో ఎస్సీ మహిళ కార్పొరేటర్లు మల్లవరపు రమ్య, బూసి రాజలత టీడీపీ సభ్యులపై అట్రాసిటీ కేసు నమోదు చేయించాలని డిమాండ్ చేశారు. ఎంపీ గల్లాపై మిస్సింగ్ కేసు నమోదు చేయించాలని మేయర్‌ను కోరారు.
అనంతరం మేయర్ కావటి మనోహర్‌నాయుడు జోక్యం చేసుకుని ఎంపీ గల్లా జయదేవ్ తనకు రూ.2.50 కోట్ల దాకా ఎంపీ ల్యాండ్స్ నిధులు వస్తే దానిలో కేవలం రూ.1.20 కోట్లు ఖర్చు చేశారని, అది కూడా టీడీపీ వార్డు సభ్యులకు మాత్రమే మంజూరు చేశారని లెక్కలు చూపడంతో టీడీపీ నాయకులు మిన్నకుండిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment