రాజమహేంద్రవరంలో వైఎస్సార్‌సీపీ కాపు ప్రజాప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతున్న నేతలు
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: గతంలో ఏ ప్రభుత్వం చేయని రీతిలో కాపుల సంక్షేమానికి సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేస్తున్నారని కాపు సామాజికవర్గ ప్రజా ప్రతినిధులు తెలిపారు. కాపులకు గత మూడేళ్లలో పలు పథకాల ద్వారా రూ.27 వేల కోట్ల మేర లబ్ధి చేకూర్చారని, గ్రామ గ్రామాన దీనిపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. కాపుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన అంశాలపై చర్చించేందుకు కాపు సామాజిక వర్గ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సమావేశమయ్యారు.
సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ భేటీలో ప్రధానంగా మూడు కీలక తీర్మానాలను ఆమోదించారు. త్వరలో విజయవాడలో కాపు సామాజికవర్గ ప్రజా ప్రతినిధులతో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. పవన్ కళ్యాణ్ తమకు పది సీట్లు ఇవ్వాలని ఎవరినో కోరారంటే పార్టీని తాకట్టు పెట్టేందుకే కదా? అని కాపు ప్రజాప్రతినిధులు ప్రశ్నించారు. పవన్‌కు ధైర్యం ఉంటే 175 సీట్లలో సింగిల్‌గా పోటీ చేస్తామని ప్రకటించాలన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న వైఎస్సార్‌సీపీనే వచ్చే ఎన్నికల్లో సైతం అధికారంలోకి రానుందని స్పష్టం చేశారు.
కాపు యువతకు వివరిద్దాం..
అధికారంలో ఉండగా కాపులను అణగదొక్కిన చంద్రబాబుకు తన సామాజిక వర్గాన్ని తాకట్టు పెడుతున్న పవన్‌కళ్యాణ్ రాజకీయ దిగజారుడుతనాన్ని కాపు ప్రజాప్రతినిధులు తూర్పారబట్టారు. వంగవీటి మోహన్‌రంగా హత్యకు కారకుడైన చంద్రబాబుతో పవన్ అంటకాగటాన్ని తప్పుబట్టారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని రోడ్డుపైకి ఈడ్చేసి వేలాది మంది కాపులపై పోలీసు కేసులతో వేధింపులకు గురిచేసిన చంద్రబాబును సీఎం చేసేందుకు పవన్ చేస్తోన్న కుట్రలను తిప్పికొట్టాలని నిర్ణయించారు.
ఈ విషయాన్ని కాపు యువతకు అర్థమయ్యేలా వివరించాలని తీర్మానించారు. ఇటీవల కాపు సామాజికవర్గ ప్రజాప్రతినిధులపై పవన్ చేసిన వ్యాఖ్యలను సమావేశం ముక్తకంఠంతో ఖండించింది. కార్యక్రమంలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్, మాజీ మంత్రులు పేర్ని నాని, అవంతి శ్రీనివాస్, ఎంపీలు వంగా గీత, బాలశౌరి, బి.చంద్రశేఖర్, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తోట త్రిమూర్తులు, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, పర్వత పూర్ణచంద్రప్రసాద్, పెండెం దొరబాబు, జ్యోతుల చంటిబాబు, గెడ్డం శ్రీనివాసనాయుడు, గ్రంధి శ్రీనివాస్, పుప్పాల శ్రీనివాసరావు, దూలం నాగేశ్వరరావు, సింహాద్రి రమేష్‌బాబు, సామినేని ఉదయభాను, కిలారి వెంకట రోశయ్య, ఆరాని శ్రీనివాసులు, బొత్స అప్పల నరసయ్య, మద్దిశెట్టి వేణుగోపాల్, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా నాగశేషు తదితరులు పాల్గొన్నారు. భేటీలో చర్చించిన అంశాలను ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మీడియాకు వివరించారు.
పవన్ కుమ్మక్కు రాజకీయాలు: కొట్టు
టీడీపీ కాపుల సంక్షేమానికి ఏటా రూ.వెయ్యి కోట్లిస్తామని హామీ ఇచ్చి ఐదేళ్లలో రూ.1,824 కోట్లు మాత్రమే విదిల్చింది. ముఖ్యమంత్రి జగన్ కాపులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతూ ఇప్పటిదాకా డీబీటీ ద్వారా రూ.16,485 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా రూ.10 వేల కోట్లతో మొత్తం రూ.27 వేల కోట్లు కాపులకు అందచేశారు. 70,83,377 మంది కాపులకు సాయం చేశారు. టికెట్లు, మంత్రి పదవులు ఇచ్చి గౌరవించారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కుమ్మక్కై కాపు సామాజిక వర్గాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్నారు. చెప్పులు చూపిస్తూ అసభ్యంగా మాట్లాడటం సిగ్గుచేటు. విచక్షణ కోల్పోయి ఉన్మాదిలా మాట్లాడుతున్నారు.
రంగాకు రక్షణ కల్పించని టీడీపీ సర్కారు:దాడిశెట్టి రాజా, మంత్రి
శాసనసభ సాక్షిగా తనకు ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించాలని నాడు వంగవీటి రంగా కోరితే టీడీపీ సర్కారు పట్టించుకోలేదు. నాడు మంత్రిగా ఉన్న హరిరామ జోగయ్య రంగా హత్యపై రాసిన పుస్తకాన్ని పవన్ చదవలేదా?
కాపుల్లో ఉద్వేగాన్ని రగిల్చే కుట్ర: కురసాల కన్నబాబు, మాజీ మంత్రి
టీడీపీ హయాంలో కాపు సామాజిక వర్గాన్ని సంఘ వ్యతిరేక శక్తిగా చూపించాలనుకున్న చంద్రబాబు పాలనలో కాపులపై కేసులు పెట్టడమే కాకుండా వృద్ధులు, మహిళలని కూడా చూడకుండా పోలీసు స్టేషన్లలో కూర్చోబెట్టారు. విశాఖలో సెక్షన్ 30 ఎలా అమలు చేస్తారని ప్రశ్నిస్తున్న చంద్రబాబుకు ఆయన అధికారంలో ఉండగా రాజమహేంద్రవరంలో మూడేళ్ల పాటు సెక్షన్ 30 అమలు చేసిన విషయం గుర్తు లేదా? రంగా హత్య కుట్రను వక్రీకరించి కాపుల్లో ఉద్వేగాన్ని రేపాలని కుట్రలు పన్నుతున్నారు. కాపులకు చంద్రబాబు కంటే సీఎం జగన్ లక్ష రెట్లు మేలు చేస్తున్నారన్నారు.
సీఎం దృష్టికి తెస్తాం: మంత్రి బొత్స
వైఎస్సార్‌సీపీలో ఎమ్మెల్యే టికెట్ల నుంచి మంత్రులు, నామినేటెడ్ పదవుల వరకు ముఖ్యమంత్రి జగన్ కాపులకు పెద్దపీట వేశారు. కాపులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో కాపు నేస్తం పథకాన్ని అమలు చేస్తున్నారు. అన్ని సామాజికవర్గాలతోపాటు కాపులకు సమాన ప్రాతినిధ్యం కల్పించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది. భేటీలో చర్చించిన అంశాలను క్రోడీకరించి కార్యాచరణతో సీఎం దృష్టికి తెస్తాం. ఇటీవల ఓ సెలబ్రిటీ పార్టీ అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడుతోంది. కాపు రిజర్వేషన్లపై ఆది నుంచి ప్రభుత్వం ఒకే విధానంతో ఉంది. వాస్తవాలను వక్రీకరించి అపోహలు కల్పించడం లేదు. రాజ్యాంగపరంగా ఎంతవరకు చేయగలమో అది చేస్తాం. కేంద్రం ఈడబ్లు్యఎస్‌కు ఇచ్చిన పది శాతం రిజర్వేషన్లలో రాష్ట్రానికి సౌలభ్యం కల్పిస్తే అత్యధికంగా 25 శాతానికి పైబడి ఉన్న కాపులకు మేలు చేయవచ్చు.
గంటలోనే బాబును కలసిన పవన్: మంత్రి అంబటి రాంబాబు
టీడీపీ కాపుల వ్యతిరేక పార్టీ. అధికారంలో ఉండగా కాపు నేత ముద్రగడ పద్మనాభం ఉద్యమాన్ని అణచివేసి ఆయన కుటుంబ సభ్యులను వేధించింది. కాపులను గౌరవించే పార్టీ వైఎస్సార్‌సీపీ. కాపు సామాజిక వర్గానికి చెందిన 26 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు, ఐదుగురు ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్, మేయర్లు పార్టీలో ఉన్నారు. ముద్రగడ పద్మనాభంపై చంద్రబాబు సర్కారు బనాయించిన అక్రమ కేసులను సీఎం జగన్ ఎత్తివేశారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు, కాపు ప్రజా ప్రతినిధులను దూషించిన విధానం గర్హనీయం. ఆయన రాజకీయాలకు అనర్హుడు. రంగా హత్య జరుగుతుందని తెలిసినప్పుడు ప్రతి గ్రామం నుంచి కాపులు వెళ్లి ఎందుకు కాపలా కాయలేదని ప్రశ్నించిన పవన్ అనంతరం గంటలోనే దీనికి కారకుడైన చంద్రబాబును కలవడం ఎంత వరకు సమంజసం?
3 తీర్మానాలకు ఆమోదం
1) జిల్లా పరిషత్ చైర్మన్లతో సహా అన్ని నామినేటెడ్ పదవుల్లో ఉన్న కాపు నేతలను ఆహ్వానించి కాపు సంక్షేమ రోడ్ మ్యాప్ రూపొందించేలా భారీ వేదిక ఏర్పాటు చేయాలని నిర్ణయం.
2) కాపుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి, సంక్షేమ పథకాల లబ్ధిని ఇంటింటికీ చేర్చే కార్యక్రమాన్ని చేపట్టేందుకు ఆమోదం.
3) సీనియర్ కాపు నేతలతో చర్చించి కాపుల సంక్షేమం, అభివృద్ధి, సంక్షేమం కోసం చేపట్టాల్సిన మరిన్ని కార్యక్రమాలు రూపొందించాలని నిర్ణయం.
Comments
Please login to add a commentAdd a comment