సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి వేదికపై ప్రసంగిస్తున్న సినీ నటుడు అలీ
సాక్షి, నరసరావుపేట: రాష్ట్ర కేబినెట్‌లో 25 మంత్రులకుగాను 17 పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించి, వారికి పెద్దపీట వేసిన జగనన్నకు అండగా నిలవాల్సిన ఆవశ్యకత తెలిపేందుకే ఈ బస్సు యాత్ర అని మంత్రి విడదల రజిని తెలిపారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా మంగళవారం సాయంత్రం పల్నాడు జిల్లా వినుకొండ పట్టణం శివయ్య స్థూపం సెంటర్‌లో జరిగిన భారీ బహిరంగసభలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
నాలుగున్నరేళ్లలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు ఎలా మేలు చేసిందో వారు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. ఎంపీ, ఎమ్మెల్సీ, కార్పొరేషన్, నామినేటెడ్ పదవుల్లో సైతం చరిత్రలో మరే సీఎం ఇవ్వని విధంగా పదవులు అందించిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. ఈ ప్రభుత్వంలో నలుగురు బీసీ నేతలను రాజ్యసభకు పంపడం విశేషమన్నారు.
బడుగు, బలహీన వర్గాలకు డీబీటీ ద్వారా సుమారు రూ.2.4 లక్షల కోట్లకు పైగా లబ్ధిచేకూర్చిన ప్రభుత్వం ఇదేనన్నారు. పథకాల అమలులో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. రాష్ట్రంలో 90 శాతం ఆడపడుచులకు ఏదో ఒక ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధిచేకూరిందన్నారు. బీసీల తోకలు కత్తిరిస్తానన్న చంద్రబాబు తోకను రానున్న ఎన్నికల్లో బీసీలు తమ ఓటు ద్వారా కత్తిరించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇంత చేస్తున్న ప్రభుత్వాన్ని మరోసారి అధికారంలోకి తెచ్చే బాధ్యత మనందరి మీద ఉందని రజిని పిలుపునిచ్చారు.
ఆచరణలో సామాజిక విప్లవం చూపిన జగన్..
మరో మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. దేశంలో ఎందరో మహనీయులు సామాజిక విప్లవం రావాలి, దేశం బాగుపడాలి, పేదవారు బాగుండాలని కోరుకున్నారని.. కానీ, దాన్ని ఆచరణలో చూపిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని కితాబిచ్చారు. చంద్రబాబు పాలనలో అవమానాలు ఎదుర్కొన్నామని.. ఎస్సీ కులంలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్న చంద్రబాబు పాలనలో దళితులపై పెద్ద సంఖ్యలో దాడులు జరిగాయని గుర్తుచేశారు. జగనన్న మాత్రం అలా చూడలేదన్నారు.
రాష్ట్రంలో పేదరికం 12 శాతం నుంచి 6 శాతానికి తెచ్చారంటే మన జీవన విధానం పెరిగిందా? తగ్గిందా? అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. సినీ నటుడు, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను ముందు వరుసలో నిలబెట్టిన ఘనత జగనన్నకు దక్కుతుందన్నారు. ‘నువ్వు నాతో ఉండాలని జగనన్న అన్నారు. మీకోసం ఎంతదూరమైనా వెళ్తా అని నేను మాటిచ్చా’నన్నారు. మైనార్టీలు త్వరలోనే శుభవార్త వింటారని అలీ చెప్పారు.
నా వాళ్లంటూ అక్కున చేర్చుకున్నారు
తరతరాలుగా ద్వితీయశ్రేణి మనుషులుగా బతుకుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను నా వాళ్లు అంటూ ఆప్యాయంగా పిలిచి రాజకీయ, ఆర్థిక, సామాజికంగా వారిని ఎంతో ప్రోత్సహిస్తున్న వ్యక్తి జగన్ అని ఎమ్మెల్సీ కుంభా రవిబాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబు సీఎంగా ఉండగా ఎస్టీలకు ఒక్క మంత్రి పదవీ ఇవ్వలేదన్నారు. జగన్ మాత్రం డిప్యూటీ సీఎం ఇవ్వడంతోపాటు, ట్రైబల్ కమిషన్ ఏర్పాటు, ఎస్టీలకు ఎమ్మెల్సీ పదవీ ఇచ్చారన్నారు. అటవీ హక్కుల చట్టం ద్వారా రాష్ట్రంలో 3.26 లక్షల ఎకరాల భూమిని ఈ ప్రభుత్వం గిరిజనులకు అందజేసిందన్నారు.
17న ‘వరికపూడిసెల’ పనులు ప్రారంభం
నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో జగనన్న వినుకొండలో వరికపూడిసెల ప్రాజెక్టు నిర్మిస్తామని ఇచ్చిన హామీని అమలుచేస్తున్న ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఈనెల 17న మాచర్లలో సీఎం పర్యటనలో పనులు ప్రారంభిస్తామన్నారు.
ఈ ప్రభుత్వ హయాంలో పల్నాడుకు మెడికల్ కళాశాల, వరికపూడిసెల ప్రాజెక్టుకు అన్ని అనుమతులు, రూ.3 వేల కోట్లతో హైవేలు, జేజేఎం పనులు, కేంద్రీయ విద్యాలయాలు తెచ్చామని, మరోసారి అవకాశమిస్తే పల్నాడు రూపురేఖలే మారుస్తామన్నారు. గతంలో అధికారంలో ఉన్న వారు ఏమిచేయలేదని.. వినుకొండ అభివృద్ధి గురించి మాట్లాడే దమ్ము టీడీపీకి ఉంటే ముందుకు రావాలని ‘లావు’ సవాలు విసిరారు.
ఆచరణలో గుర్రం జాషువా ఆశయాలు
బడుగు, బలహీన వర్గాలను ఉన్నత స్థాయివైపు చేయి పట్టుకుని తీసుకెళ్లిన ఘనత జగన్‌కే దక్కిందని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. నిజమైన సామాజిక సాధికారత ఫలితాలెలా ఉంటాయో చేతల్లో చూపించింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమన్నారు. సామాజిక సాధికారత ఏంటో ఈ సభావేదిక చూస్తే ఆర్థమవుతుందని.. మాలాంటి ఎంతోమందిని మంత్రులుగా, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలుగా చేసి చట్టసభల్లో మాకు సముచిత స్థానం కల్పించారన్నారు.
గుర్రం జాషువా ఆశయాలు, ఆలోచనలను ఆచరణలో పెడుతున్న వ్యక్తి జగన్ అన్నారు. బడుగువర్గాలకు మేలు చేసే గట్టున ఉంటారా, పెత్తందార్ల గట్టున ఉంటారా అన్నది ప్రజలు నిర్ణయం తీసుకోవాలన్నారు. 2019లో ఇచ్చిన తీర్పు మరోసారి 2024లో సైతం ఇచ్చి జగనన్నను గెలిపించాలని కోరారు.
సాధికారత యాత్రకు జేజేలు
స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నేతృత్వంలో జరిగిన ఈ యాత్రకు జనం బ్రహ్మరథం పట్టారు. వేలాది మంది ప్రజలు, పార్టీ నేతలు యాత్రకు పూలవర్షం, గజమాలలతో స్వాగతం పలికారు. ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నేతల ప్రసంగాల్లో జననేత జగనన్న పేరు వినగానే ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ముఖ్యంగా ‘‘మా నమ్మకం నువ్వే జగన్’’.. ‘‘జగన్ రావాలి–జగనే కావాలి’’.. ‘‘వై నాట్ 175’’ అంటూ జనం ప్రతిస్పందించారు.
రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్‌సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ వి. విజయసాయిరెడ్డి, ఎమ్మెల్సీలు చంద్రగిరి ఏసురత్నం, పోతుల సునీత, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, ఇతర నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జ్యోతిరావు ఫూలే, బాబు జగజ్జీవన్‌రామ్, కొమురం భీం, భారతరత్న అబ్దుల్ కలాం చిత్రపటాలు, మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని ఉంచి నేతలు నివాళులు అర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment