
ప్రసంగిస్తున్న మంత్రి మేరుగు. చిత్రంలో గంజి చిరంజీవి
సాక్షి ప్రతినిధి, గుంటూరు: బడుగు, బలహీన వర్గాల సాధికారతతో గుంటూరు జిల్లా మంగళగిరి మురిసింది. బుధవారం పట్టణంలో ఘనంగా నిర్వహించిన వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు వేలాదిగా పాల్గొన్నారు. సీఎం జగన్ నేతృత్వంలో తాము సాధించిన సాధికారతను సగర్వంగా ప్రదర్శించారు. యువత నుంచి వృద్ధుల వరకు ఈ యాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. జై జగన్ నినాదాలతో హోరెత్తించారు.
‘మళ్లీ నీవే ముఖ్యమంత్రివి కావాలి జగన్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త గంజి చిరంజీవి అధ్యక్షతన మిద్దె సెంటర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో వేలాదిగా ప్రజలు పాల్గొన్నారు. సభలో ప్రసంగించిన నేతలు సీఎం వైఎస్ జగన్ సారథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సాధించిన అభివృద్ధిని వివరించారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సామాజిక న్యాయానికి మంగళగిరే నిదర్శనమని చెప్పారు. మంగళగిరి సీటును అగ్రకులానికి చెందిన అభ్యర్థి నుంచి మార్చి బీసీలకు కేటాయించడమే బీసీలకు సీఎం జగన్ ఇస్తున్న ప్రాధాన్యతను తెలుపుతుందని అన్నారు.
సామాజిక విప్లవం తెచ్చిన తొలి సీఎం జగన్
దేశంలో సామాజిక కులాల గురించి ఆలోచించి, సామాజికి విప్లవాన్ని తెచ్చిన తొలి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డే అని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. సీఎం వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను అందలం ఎక్కించారని, ఈరోజు ఇలా తలెత్తుకొని తిరగడానికి సీఎం జగనే కారణమని చెప్పారు. చంద్రబాబు ఆణగారిన వర్గాలను అవమానించేవారని, ఈ వర్గాలను ఓటు బ్యాంకులా మాత్రమే తప్ప ఏనాడూ సాటి మనిషిగా చూడలేదని అన్నారు. మంగళగిరిలో స్థానికుడిగా ఉన్న గంజి చిరంజీవిని గెలిపించుకోవాలని, హైదరాబాదులో ఉండే టీడీపీ అభ్యర్థిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అగ్రస్థానం
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ అన్నింటా అగ్రస్థానం ఇస్తున్నారని మంత్రి జోగి రమేష్ చెప్పారు. మంత్రి పదవులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలుగా, నామినేటెడ్ పదవుల్లోనూ ఈ వర్గాలకే పెద్ద పీట వేసిన తొలి సీఎం వైఎస్ జగన్ అని తెలిపారు. అగ్రవర్ణ అభ్యర్థులు గెలిచిన మంగళగిరిలో బీసీ అభ్యర్థి గంజి చిరంజీవిని నిలబెడుతున్నారని, సీఎం జగన్ సామాజిక న్యాయానికి ఇదే నిదర్శనమని చెప్పారు. మంగళగిరి అని స్పష్టంగా పలకటం రాని లోకేశ్‌కి మంగళగిరి ఎందుకు అని ఎద్దేవా చేశారు.
సీఎం జగన్ పేదల పక్షపాతి అని, బడుగు వర్గాలకు ఆయన చేసిన మేలు మరెవరూ చేయలేరని పార్టీ నేత, ప్రభుత్వ సలహాదారు (సామాజిక న్యాయం) జూపూడి ప్రభాకర్ అన్నా రు. రెండుసార్లు రెడ్డి సామాజిక వర్గం గెలిచిన మంగళగిరిలో బీసీ అభ్యర్ధిని రంగంలోకి దింపే సాహసం ఒక్క జగన్ మాత్రమే చేయగలరని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. మంగళగిరిలో బీసీ నేతను గెలిపించుకొనే అవకాశాన్ని వదులుకోవద్దని పిలుపునిచ్చారు. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త, ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, బీసీ విభాగం ఉపాధ్యక్షులు చిల్లపల్లి మోహనరావు పాల్గొన్నారు.