
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం–కాకినాడలో పెట్రోలియం కెమికల్స్, పెట్రోకెమికల్ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (పీసీపీఐఆర్) ఏర్పాటు విషయంలో వయబిలిటీ గ్యాప్ ఫండ్ (వీజీఎఫ్)పై రాష్ట్రమే నిర్ణయం తీసుకోవాలని కేంద్ర పెట్రోలియం, సహజ వనరులశాఖ సహాయమంత్రి రామేశ్వర్ తేలి తెలిపారు. లోక్‌సభలో గురువారం వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. ఈ ప్రాజెక్టు ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం, హెచ్‌పీసీఎల్ 2017లోనే అవగాహన ఒప్పందం చేసుకున్నాయని చెప్పారు.
వివరణాత్మక అధ్యయనం తర్వాత ప్రాజెక్టు ఆచరణలోకి తీసుకురావడానికి వీజీఎఫ్ అవసరమని నిర్ధారించారని తెలిపారు. ప్రాజెక్టుకు భారీ మొత్తంలో పెట్టుబడి, రిఫైనరీ, పెట్రో కెమికల్ ప్రాజెక్టును పెంచే పెట్టుబడులు అవసరమని ఏపీ ప్రభుత్వానికి తెలిపామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ సమస్యపై రాష్ట్రమే తగిన నిర్ణయం తీసుకోవచ్చని చెప్పారు.
రూ.8,710.72 కోట్ల వినియోగం
ప్రధానమంత్రి ఆవాస్ యోజన–అర్బన్ (పీఎంఏవై–యు)కు 2019–20 నుంచి 2021–22 వరకు కేంద్ర సాయంగా రూ.5,800.90 కోట్లు విడుదల చేయగా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో రూ.8,710.72 కోట్లు వినియోగించారని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాలశాఖ సహాయమంత్రి కౌశల్ కిషోర్ తెలిపారు. డిసెంబర్ 12, 2022 వరకు మంజూరైన 20,74,770 ఇళ్లకుగాను 6,56,529 ఇళ్లు పూర్తిచేసి పంపిణీ కూడా చేసినట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, వల్లభనేని బాలశౌరి ప్రశ్నకు సమాధానమిచ్చారు.
విజయవాడ తూర్పు వైపు బైపాస్ నిర్మాణం
విజయవాడలో తూర్పువైపు బైపాస్ నిర్మించాలని ఏపీ ప్రభుత్వం కోరిందని కేంద్ర జాతీయ రహదారులు, రహదారి రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరీ తెలిపారు. ప్రతిపాదిత బైపాస్‌కు సంబంధించిన ప్రభుత్వ స్థలాన్ని ఎన్‌హెచ్‌ఏఐకు ఉచితంగా ఇవ్వాలని సూచించామని వైఎస్సార్‌సీపీ ఎంపీ మద్దిళ్ల గురుమూర్తి ప్రశ్నకు సమాధానమిచ్చారు. కృష్ణానదిపై ప్రధాన వంతెన నిర్మాణం సహా జాతీయ రహదారి–16లో 40 కిలోమీటర్ల పొడవుతో విజయవాడకు తూర్పు బైపాస్ నిర్మాణం నిమిత్తం వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక అధ్యయనం చేపట్టామన్నారు. విశాఖలో కంటైనర్ టెర్మినల్ నుంచి రుషికొండ, భీమిలి మీదుగా భోగాపురం వద్ద ఎన్‌హెచ్–16 వరకు రోడ్డుకు డీపీఆర్ తయారీ చేపట్టినట్లు తెలిపారు.
ఏపీలో 33,955 పబ్లిక్ టాయిలెట్లు
ఆంధ్రప్రదేశ్‌లో 2019 నుంచి నవంబర్ 2022 వరకు 33,955 పబ్లిక్ టాయిలెట్లు నిర్మించినట్లు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాలశాఖ సహాయమంత్రి కౌశల్ కిషోర్ తెలిపారు. స్వచ్ఛభారత్ మిషన్–అర్బన్‌లో భాగంగా ఏపీకి రూ.571.33 కోట్లు కేటాయించగా, రూ.559.26 కోట్లు వినియోగించిందని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రశ్నకు జవాబిచ్చారు. స్వచ్ఛభారత్–అర్బన్ 2.0లో రూ.1,413.30 కోట్లు కేటాయించగా, రూ.298.68 కోట్లు రాష్ట్రం క్లెయిమ్ చేసిందని తెలిపారు.
నాలుగు లేన్ల రహదారిగా అభివృద్ధి చేయండి
సబ్బవరం జంక్షన్ నుంచి నర్సీపట్నం మీదుగా తుని వరకు ఉన్న రాష్ట్ర రహదారిని నాలుగు లేన్ల జాతీయ రహదారిగా మార్చాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ బీవీ సత్యవతి కేంద్ర జాతీయ రహదారులు, రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్‌గడ్కరీకి వినతిపత్రం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment