సాక్షి, విశాఖపట్నం: స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 20న స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ పోరాటయాత్ర పేరుతో పాదయాత్ర చేపడుతున్నామని, గాంధీ విగ్రహం నుంచి స్టీల్‌ప్లాంట్ వరకు పాదయాత్ర జరుగుతుందని ఆయన వెల్లడించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై ఇప్పటికే ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారని, అందులో అనేక సూచనలు చేశారని చెప్పారు. గనులు కూడా కేటాయించాలని ప్రధానిని కోరారని తెలిపారు. సుమారు 25 కి.మీ. మేర పాదయాత్ర జరుగుతుందన్నారు. 13 పార్టీల నేతలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశామని, అఖిలపక్ష సమావేశానికి టీడీపీ నేతలను పిలిచినా రాలేదని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
ఫేక్ మాటలు, ఫేక్ న్యూస్.. ఆయనకు అలవాటు: శ్రీకాంత్‌రెడ్డి
తాడేపల్లి: టీడీపీ ఒక ఫేక్ పార్టీగా మారిపోయిందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు ఓడిన ప్రతిసారీ ఈవీఎంల సమస్య అంటుంటారు.. డైవర్ట్ పాలిటిక్స్ చేయటం బాబు, లోకేష్‌కు అలవాటని ఆయన దుయ్యబట్టారు. ఫేక్ మాటలు, ఫేక్ న్యూస్ చంద్రబాబుకు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో నిమ్మగడ్డను పొగిడిన బాబు.. మున్సిపల్ ఎన్నికలు వచ్చేసరికి విమర్శించటం విచిత్రంగా ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా టీడీపీకి ఉనికి ఉండదని.. భవిష్యత్‌లో టీడీపీకి అభ్యర్థులు కూడా దొరకరని ఆయన విమర్శలు గుప్పించారు.
‘‘స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై టీడీపీ చిత్తశుద్ధి లేని దీక్షలు చేస్తోంది. స్టీల్ ప్లాంట్‌ను కాపాడేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖలు రాస్తుంటే.. ఎన్నికల కమిషనర్‌పై చంద్రబాబు లేఖలు రాస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, కేంద్రంపై టీడీపీ ఎందుకు పోరాటం చేయడం లేదు. ఈ విషయంలో కేంద్రాన్ని ఎందుకు నిలదీయట్లేదు. ప్రధాని మోదీకి ఎందుకు లేఖ రాయడం లేదంటూ’ శ్రీకాంత్‌రెడ్డి నిప్పులు చెరిగారు
చదవండి: ‘లోకేష్ పప్పులకే పప్పు’
అచ్చెన్నా ఒళ్లు దగ్గర పెట్టుకో..
Comments
Please login to add a commentAdd a comment