కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్‌తో వైఎస్సార్‌సీపీ ఎంపీల భేటీ | YSRCP MPs Meets Union Minister Giriraj Singh | Sakshi
Sakshi News home page

కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్‌తో వైఎస్సార్‌సీపీ ఎంపీల భేటీ

Published Tue, Jul 27 2021 5:10 PM | Last Updated on Tue, Jul 27 2021 9:14 PM

YSRCP MPs Meets Union Minister Giriraj Singh - Sakshi

సాక్షి, ఢిల్లీ: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి రావలసిన 6,750 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని వైఎస్సార్‌సీపీ ఎంపీలు మంగళవారం కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులు వి.విజయసాయి రెడ్డి, పార్టీ లోక్‌ సభాపక్ష నాయకులు మిథున్‌ రెడ్డి సారథ్యంలో ఎంపీల బృందం మంత్రితో సమావేశమయ్యారు. ఉపాధి పనుల బకాయిల విడుదలతో పాటు ఈ పథకం కింద పని దినాలను 100 నుంచి 150కి పెంచాలని కోరారు. ఈ మేరకు ఎంపీలందరూ సంతకాలు చేసిన వినతి పత్రాన్ని మంత్రికి అందచేశారు.

వైఎస్సార్‌సీపీ ఎంపీల బృందం మంత్రితో జరిపిన భేటీలో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 18.4 కోట్ల పని దినాలను కల్పించి దేశంలోనే అత్యధిక పని దినాలు కల్పించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ రికార్డు నెలకొల్పిందని తెలిపారు. కేవలం మూడు నెలల వ్యవధిలోనే 16.7 కోట్ల పని దినాలను కల్పించి కూలీల బడ్జెట్‌లో 83.5 శాతం వినియోగించుకుంది.

ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి అత్యధిక ఉపాధి కల్పించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచిందని ఆయన చెప్పారు. 2006లో దేశంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు ప్రారంభమైన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఈ పథకం కింద ఉపాధి కల్పించింది ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే. కోవిడ్‌ మహమ్మారి సృష్టించిన విలయం నేపథ్యంలో ఉపాధి పనులకు ఏర్పడిన డిమాండ్‌ దృష్ట్యా  రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పేదలకు కనీసం ఒక కోటి పని దినాలు కల్పించాలని గత ఏప్రిల్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్దేశించిన లక్ష్యాన్ని తొమ్మిది జిల్లాల్లో విజయవంతగా చేరుకోగలిగినట్లు చెప్పారు.

గ్రామీణ ఉపాధి పథకం అమలులో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఈ పథకాన్ని మరింత కట్టుదిట్టంగా అమలు చేయడంలో ఎదురవుతున్న సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి చొరవ తీసుకోవలసిందిగా విజయసాయి రెడ్డి మంత్రిని కోరారు. ఆ చర్యలలో భాగంగా పెండింగ్‌లో ఉన్న 6,750 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలి. పని దినాలను 100 నుంచి 150కి పెంచాలి. అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణ ఖర్చును 20 లక్షల రూపాయలకు పెంచాలి. దీని వలన ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలకు ఉపయుక్తంగా ఉండే టాయిలెట్లు, పరిశుభ్రమైన తాగు నీరు, క్రీడా సౌకర్యాల కల్పిన కోసం ఉపాధి పథకం కింద ఇచ్చే మొత్తాన్ని 15 లక్షలకు పెంచాలి. మిగిలిన 5 లక్షల రూపాయలు ఐసీడీఎస్‌ వాటా కింద చెల్లించడం జరుగుతుందని తెలిపారు.

అలాగే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిన భూముల రీసర్వే కార్యక్రమంలో భాగంగా సర్వే రాళ్ళు పాతే కూలీలకు వేతనాలను ఉపాధి పథకం కింద వినియోగించుకునేందుకు అనుమతించాలని విజయసాయి రెడ్డి కేంద్ర మంత్రిని కోరారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధి పథకం కింద లేబర్‌ బడ్జెట్‌ను సవరించాలని కోరారు.

కాఫీ తోటల పెంపకంతో గిరిజనులను ఆదుకోండి...
ఉపాధి హామీ పథకం కింద గిరిజనులు కాఫీ తోటల పెంపకాన్ని చేపట్టేందుకు అనుమతించాలని విజయసాయి రెడ్డి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. దీని వలన ప్రధానంగా విశాఖపట్నం జిల్లా పాడేరులోని నిరుపేద గిరిజనులకు ఎంతో మేలు చేసినట్లువుతుందని అన్నారు. ఇతర రాష్ట్రాలలో రబ్బర్‌ తోటల పెంపకాన్ని ఉపాధి హామీ కింద చేర్చినట్లుగానే విశాఖపట్నం మన్యం ప్రాంతంలో గిరిజనులకు ఉపాధి కల్పించేందుకు కాఫీ తోటల పెంపకాన్ని కూడా ఈ పథకం కింద చేర్చాలని కేంద్ర మంత్రికి విన్నవించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement