‘అనంత’ ప్రభంజనం  | YSRCP Samajika Sadhikara Bus Yatra In Anantapur | Sakshi
Sakshi News home page

‘అనంత’ ప్రభంజనం 

Published Sat, Dec 30 2023 5:02 AM | Last Updated on Wed, Jan 24 2024 1:16 PM

YSRCP Samajika Sadhikara Bus Yatra In Anantapur - Sakshi

మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా

అనంతపురం: 76 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశ చరిత్రలో కేవలం నినాదంగా మాత్రమే ఉన్న ‘సామాజిక సాధికారత’ను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆచరణలో పెట్టి చూపించారని వైఎస్సార్‌సీపీ నేతలు కొనియాడారు. సామాజిక సాధికారత తమ నినాదం కాదు విధానమని నిరూపించారని ప్రశంసించారు. రాజ్యాధికార పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే పెద్దపీట వేయడమే ఇందుకు నిదర్శనమన్నారు.

మరోసారి వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు అనంతపురం నగరంలో శుక్రవారం వైఎస్సార్‌సీపీ చేపట్టిన ‘సామాజిక సాధికార బస్సు యాత్ర’కు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. దీంతో సభాప్రాంగణం కిటకిటలాడింది. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు చంద్రబాబుకు అధికారంలో ఉంటే అగ్రకులాలు, అధికారంలో లేకపోతే వెనుకబడిన కులాలు గుర్తుకొస్తాయని విమర్శించారు. 

సామాజిక విప్లవ సృష్టికర్త జగనన్న 
దేశ చరిత్రలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సామాజిక విప్లవాన్ని సృష్టించారని డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా తెలిపారు. సామాజిక న్యాయం అనేది ప్రభుత్వ విధానమని నిరూపించారన్నారు. ఐదుగురు ఉప ముఖ్యమంత్రులుంటే నలుగురు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలవారేనని గుర్తు చేశారు. గతంలో ఇంతటి గౌరవం ఏ ప్రభుత్వమైనా ఇచ్చిందా అని ప్రశ్నించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు ఏకమవుతున్నాయని, అణగారిన వర్గాలకు అండగా నిలిచిన సీఎం జగన్‌ను గుండెల్లో పెట్టుకుందామని పిలుపునిచ్చారు. 

బలహీనవర్గాలకే సింహభాగం పథకాలు
సీఎం వైఎస్‌ జగన్‌ పాలనలో సింహభాగం సంక్షేమ పథకాలు బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ వర్గాలకే అందుతున్నాయని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్‌ తెలిపారు. కలగా మారిన సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపిన అభినవ అంబేడ్కర్, అభినవ పూలే.. వైఎస్‌ జగన్‌ అని కొనియాడారు. ఆయనను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుంటే మనల్ని మనం గౌరవించుకున్నట్లేనన్నారు.   

ఆయా వర్గాల్లో చర్చ జరగాలి
గతంలో కంటే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఎంత మేలు జరిగిందనే విషయంపై ఆయా వర్గాల్లో చర్చ జరగాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. బీసీలే తమ పార్టీకి వెన్నెముక అంటూ ఊదరగొట్టే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఈ వర్గాలకు ఏమీ చేయలేదన్నారు. చంద్రబాబు తన ప్రభుత్వం కమ్మలకు 8, రెడ్లకు 6, కాపులకు 4, బీసీలకు 3, ఎస్సీలకు 2 మంత్రి పదవులు ఇచ్చారని, మైనార్టీ, గిరిజనులకు అసలే ఇవ్వలేదని విమర్శించారు. వైఎస్‌ జగన్‌ కేబినెట్‌లోని 25 మంది మంత్రుల్లో 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలేనని గుర్తు చేశారు.   

బాబును జీవితంలో నమ్మకూడదు 
చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు చేసిన మోసాలకు ఆయనను జీవితంలో నమ్మకూడదని సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకరరావు అన్నారు. పవన్‌ కళ్యాణ్‌ నిలకడ లేని వ్యక్తి అని తెలిపారు. మాటతప్పని, మడమ తిప్పని కుటుంబం నుంచి వచ్చిన వైఎస్‌ జగన్‌ అన్ని వర్గాలకు అండగా నిలిచారన్నారు. పేదల ఖాతాల్లో నేరుగా రూ.2.45 లక్షల కోట్లు జమ చేశారన్నారు. అందులో సింహభాగం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకే అందిందని జూపూడి అన్నారు.  

సామాజిక న్యాయానికి అర్థం చెప్పారు 
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆకాంక్షించిన సామాజిక న్యాయాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ నిజం చేశారని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకు సామాజిక సాధికారతను కల్పించారన్నారు. రూ.లక్షల కోట్లు ఖర్చు చేసి పేదల ఆర్థిక స్థితిగతులను మార్చేశారని కొనియాడారు. గత టీడీపీ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించిందన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ చొరవతో అనంతపురం నియోజకవర్గంలో రూ.800 కోట్లతో రోడ్లు, కాలువలు తదితర అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement