Huge Demand For IIIT Seats In Andhra Pradesh - Sakshi
Sakshi News home page

Andhra Pradesh : ట్రిపుల్‌ ఐటీ.. చదువుల దివిటీ

Published Fri, Jun 30 2023 1:00 AM | Last Updated on Fri, Jun 30 2023 1:06 PM

- - Sakshi

వేంపల్లె : రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని ఇడుపులపాయ, నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ ఐటీలు చదువులో మేటిగా నిలుస్తున్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణం, క్రమశిక్షణ, నాణ్యమైన ఉత్తమ విద్యా బోధనను అందిస్తున్నాయి.

సీట్లు ఎన్ని ఉన్నాయంటే.?

ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్‌ విద్యా బోధనకు నిలయమైన ట్రిపుల్‌ ఐటీల్లో చదువుతోపాటు విద్యార్థుల మానసిక, శారీరక వికాసానికి ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌, క్రీడలు, శాస్త్రీయ సంగీతం, నాట్యం, యోగా వంటి వాటిలో శిక్షణ కూడా ఇస్తున్నారు. 2023–24 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో నాలుగు ట్రిపుల్‌ ఐటీలలో 4000సీట్లతోపాటు ఈడబ్ల్యూసీ కోటాలో మరో 400 కలిపి మొత్తం 4400 సీట్లు ఉన్నాయి.

ఎంత మంది దరఖాస్తు?

ట్రిపుల్‌ ఐటీల ప్రవేశాలకు సోమవారంతో దరఖాస్తుల గడువు ముగిసింది. ఇప్పటివరకు ట్రిపుల్‌ ఐటీలలో 4400సీట్లకు గానూ 38,490 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు.

ఎలా కేటాయిస్తారు?

వీటిని రోస్టర్‌ ప్రకారం భర్తీ చేయడంతోపాటు ప్రత్యేక కేటగిరీ కింద స్పోర్ట్స్‌, స్కౌట్‌ అండ్‌గైడ్స్‌, సీఏపీ, ఎన్‌సీసీ దివ్యాంగుల కోటా కింద సీట్లు కేటాయిస్తారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్రార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉంటే 4శాతం డిప్రివేషన్‌ మార్కులు కలిపి మెరిట్‌ ఆధారంగా సీట్లను ఎంపిక చేస్తారు.

ఫీజుల సంగతేంటీ? 

ఆర్జీయూకేటీ పరిధిలోని నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లో ఆరేళ్ల సమీకృత ఇంటిగ్రేటెడ్‌ కోర్సును చదివేందుకు మొదటి రెండేళ్లు ఏడాదికి రూ.40వేలు, తర్వాత నాలుగేళ్లు ఏడాదికి రూ.50వేల చొప్పున ఫీజు చెల్లించాలి.

ఏపీ కాకుండా ఇతర రాష్ట్రాల విద్యార్థులకు 5 శాతం సూపర్‌ న్యూమరరీ సీట్లు అందుబాటులో ఉంటాయి. ఈ కోటాలో చేరిన వారు ఏడాదికి రూ.1.50లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అర్హత ఉన్న విద్యార్థులకు ప్రభుత్వమే చెల్లిస్తుంది.

సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఇలా

2023–24 విద్యా సంవత్సరానికి ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు పదవ తరగతి రీవాల్యుయేషన్‌ లో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి జూలై 5 లోపల మార్కుల మెమోను స్కాన్‌ చేసి యూనివర్సిటీ వైబ్సెట్‌ కు పంపించాలని ఆర్జీయూకేటీ చాన్స్లర్‌ కె.చెంచు రెడ్డి తెలిపారు. అలాగే ప్రత్యేక కేటగిరీ విద్యార్థులు జూన్‌ 30వ తేదీన యూనివర్సిటీ వెబ్‌ సైట్‌ నుంచి కాల్‌ లెటర్లను డౌన్లోడ్‌ చేసుకోవాలని సూచించారు. వీరికి ఏలూరు జిల్లా నూజివీడు క్యాంపస్‌లో జూలై 5 నుంచి 9వ తేదీ వరకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ జరుగుతాయని చెప్పారు.

విద్యా బోధన ఇలా.. :

ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్‌లో మొదటి రెండేళ్లు ఇంటర్‌కు సమానమైన పీయూసీ కోర్సు, తర్వాత నాలుగేళ్ల ఇంజినీరింగ్‌ విద్యను బోధిస్తారు. ప్రతినెలా పరీక్షలు నిర్వహిస్తారు. ఆగస్ట్‌ మొదటి వారం నుంచి తరగతులు ప్రారంభమై నవంబర్‌ 30 వరకు కొనసాగుతాయి. అనంతరం సెమిస్టర్‌ పరీక్షలు ఉంటాయి.

హస్టల్ నిబంధనలు ఇవి

సెలవు రోజుల్లో తల్లిదండ్రులు వచ్చి పిల్లలతో గడపడానికి అవకాశం ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో పిల్లలను ఇళ్లకు పంపుతారు. అయితే ఇచ్చిన గడువులోగా తిరిగి రాకపోతే ఫైన్‌ విధిస్తారు. విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తారు. ట్రిపుల్‌ ఐటీ ఆవరణాల్లోనే 30పడకల ఆసుపత్రి ఉండగా.. 24గంటలు వైద్యులు అందుబాటులో ఉంటారు.

రోజు వారీ కార్యక్రమాలు :

ఉదయం అల్పాహారం, అనంతరం అసెంబుల్‌, 8 నుంచి 12గంటలవరకు తరగతులు, 12 నుంచి 1గంట వరకు భోజన విరాం, మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5గంటలవరకు తరగతులు, అనంతరం టీ, స్నాక్స్‌, 6గంటల వరకు ఆటలు, రాత్రి 7గంటలకు భోజనం, అనంతరం రాత్రి 10గంటల వరకు స్టడీ అవర్స్‌, ఇది ట్రిపుల్‌ ఐటీలలో రోజువారీ

జులై 13న అర్హుల జాబితా..

వచ్చేనెల జులై 13న ట్రిపుల్‌ ఐటీలో సీటు కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల అర్హుల జాబితాను విడుదల చేస్తారు. ఈనెల 30వ తేదీన దరఖాస్తు చేసుకున్న వారికి కాల్‌ లెటర్లు, మెసేజ్‌ రూపంలో తెలియజేస్తారు. ప్రత్యేక కేటగిరీ విద్యార్థులకు జులై 5వ తేదీ నుంచి 9వ తేదీవరకు నూజివీడు క్యాంపస్‌లో సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు.

కౌన్సిలింగ్ ప్రక్రియ ఇలా..

జులై 21, 22వ తేదీలలో నూజివీడు, ఇడుపులపాయ, 24, 25వ తేదీలలో ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలలో కౌన్సిలింగ్‌ పక్రియ నిర్వహిస్తారు. ఏ క్యాంపస్‌లో సీటు వస్తే అక్కడే చదవాల్సి ఉంటుంది.

కౌన్సెలింగ్‌కు ఇవి తప్పనిసరి.. :

  • పదో తరగతి హాల్‌ టిక్కెట్‌,
  • టెన్త్‌ మార్కుల జాబితా,
  • టీసీ, కాండక్ట్‌ సర్టిఫికెట్‌,
  • స్టడీ సర్టిఫికెట్‌(4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు),
  • కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు,
  • అభ్యర్థి, అతని తండ్రి లేదా తల్లివి రెండు పాస్‌పోర్ట్‌ ఫొటోలు,
  • రేషన్‌ కార్డు,
  • అభ్యర్థి ఆధార్‌ కార్డు,
  • విద్యార్థులకు ఎవరికై నా బ్యాంకు రుణం అవసరమైతే పైన పేర్కొన్న సర్టిఫికెట్లన్నీ నాలుగు సెట్లు,
  • అభ్యర్థి తండ్రి ఉద్యోగి అయితే ఎంప్లాయి ఇడెంటిటీ కార్డు, శాలరీ సర్టిఫికెట్‌,
  • అభ్యర్థి తండ్రి పాన్‌ కార్డు, ఆధార్‌ కార్డు, ఓటరు ఐడీతో కౌన్సిలింగ్‌కు హాజరు కావాలి.

ప్రతిభ ఆధారంగా సీట్ల కేటాయింపు

ట్రిపుల్‌ ఐటీ సీట్లు ప్రతిభ ఆధారంగానే కేటాయిస్తాం. గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతోనే ట్రిపుల్‌ ఐటీలను ఏర్పాటు చేశారు. ఇక్కడ సీటు లభిస్తే ఆరేళ్ల సమీకృత సాంకేతిక ఉచిత విద్యనభ్యసించి ఇంజినీరింగ్‌ డిగ్రీతో బయటకు వెళ్లవచ్చు. ఈ ఏడాది అన్ని జిల్లాలకు సమానంగా సీట్లు కేటాయిస్తాం.

– కె.చెంచురెడ్డి(ఆర్జీయూకేటీ చాన్సులర్‌), ఇడుపులపాయ

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

2
2/2

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement