పోలీస్ స్టేషన్ ఎదుట ప్రియురాలు బైఠాయింపు
పెనగలూరు : తన ప్రియుడి కోసం ఓ ప్రేమికురాలు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. స్థానికుల వివరాల మేరకు.. అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం ఈటమాపురం గ్రామానికి చెందిన బైరిరాజు వెంకటసాయి, లావణ్య నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల లావణ్యను కాదని.. మరో అమ్మాయిని వెంకటసాయి వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ గ్రామస్థులతో కలిసి ఎస్‌ఐ రవిప్రకాష్‌రెడ్డిని లావణ్య కోరారు.
అనంతరం వారిని పిలిపించి మాట్లాడగా.. లావణ్యతో వివాహానికి వెంకట సాయి వెనుకంజ వేశారు. స్టేషన్ గేటు బయట మండుటెండలో గ్రామస్థులతో కలిసి లావణ్య బైఠాయించి నిరసనకు దిగారు. చావైనా, బ్రతుకై నా వెంకటసాయితోనేనని భీష్మించారు. అనంతరం ఎస్సై ఇరువురు ప్రేమికుల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చినా ప్రయోజనం కనిపించక పోవడంతో రాజంపేట రూరల్ సీఐ వద్దకు వెళ్లాలని సూచించారు.
శ్రీవెంకటసాయిపై కేసు నమోదు చేయవద్దు.. తనతో వివాహం చేయించాలని లావణ్య విలేకరుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణంగా ప్రేమించిన వెంకటసాయి దక్కకుంటే విషంతాగి చనిపోతానని స్టేషన్ ఎదుట హల్‌చల్ చేశారు. ఎస్‌ఐ వివరణ ఇస్తూ నాలుగేళ్లుగా వెంకటసాయిని ప్రేమిస్తున్నానని లావణ్య తెలపడంతో ఇద్దరినీ పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చానని తెలిపారు. లావణ్య రాత పూర్వకంగా అర్జీ ఇస్తే కేసు నమోదు చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment