జిల్లా అధికారి పరిధిలోకి పది ఆలయాలు | - | Sakshi
Sakshi News home page

జిల్లా అధికారి పరిధిలోకి పది ఆలయాలు

Published Thu, Feb 20 2025 12:18 AM | Last Updated on Thu, Feb 20 2025 12:14 AM

జిల్లా అధికారి పరిధిలోకి  పది ఆలయాలు

జిల్లా అధికారి పరిధిలోకి పది ఆలయాలు

బి.కొత్తకోట: జిల్లాలో 6–బి2 గ్రేడ్‌ కలిగిన పది ఆలయాలను దేవదాయ ధర్మాదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌ పరిధి నుంచి తొలగించి జిల్లా దేవదాయ ధర్మాదాయశాఖ అధికారి పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆలయాల పాలన ఇకపై జిల్లా అధికారి పరిధిలోకి వచ్చింది. జిల్లాలోని పీలేరు మండలం దొడ్డిపల్లిలోని చెన్నకేశవస్వామి ఆలయం, నిమ్మనపల్లి మండలం తవళంకు చెందిన నేల మల్లేశ్వరస్వామి ఆలయం, కురబలకోట మండలం తెట్టులోని సంతాన వేణుగోపాలస్వామి ఆలయం, మదనపల్లిలోని సోమేశ్వరస్వామి ఆలయం, బి.కొత్తకోటలోని చెన్నకేశవ, ఆంజనేయస్వామి ఆలయాలు, చిన్నమండెం మండలం మల్లూరులోని మల్లూరమ్మ దేవత ఆలయం, రాజంపేటలోని ఆంజనేయస్వామి ఆలయం, కోడూరులోని భుజంగేశ్వర స్వామి ఆలయాల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలు జిల్లా అధికారి పరిధిలోకి వచ్చాయి. ఈ ఆలయాలన్నింటిని కర్నూలు డిప్యూటీ కమిషనర్‌ పరిధి నుంచి తొలగించారు.

మైక్రో ఇరిగేషన్‌ను

సద్వినియోగం చేసుకోండి

రాయచోటి టౌన్‌: మైక్రో ఇరిగేషన్‌ పద్ధతి ద్వారా వ్యవసాయం చేసి అధిక దిగుబడులు సాధించాలని, ఏపీఎంఐపీ రాష్ట్ర స్థాయి ప్రత్యేక అధికారి ( ఓఎస్‌డీ) రమేష్‌ అన్నారు. బుధవారం రాయచోటి నియోజక వర్గ పరిధిలోని రాయచోటి, రామాపురం, వీరబల్లె మండలాల్లో పర్యటించి క్షేత్ర స్థాయిలో మైక్రో ఇరిగేషన్‌ వ్యవసాయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ఎక్కువ భూమిని సాగు చేసుకొనే విధానంలో మైక్రో ఇరిగేషన్‌ ఒకటన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి ఇప్పటి వరకు మొత్తం 15000 హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్‌ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. అయితే 9339 మంది రైతుల ద్వారా 9694 హెక్టార్లలో సాగు అవుతున్నట్లు తెలిపారు. మిగిలిన లక్ష్యాన్ని యుద్ధ ప్రాతిపదికన మార్చి ఆఖరులోగా పూర్తి చేయాలని మండల స్థాయి అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంఐఓ లక్ష్మీప్రసన్న, ఎంఐడీసీలు, ఎంఐఈ క్షేత్రస్థాయి అధికారులు పాల్గొన్నారు.

ఫర్నిచర్‌ సరఫరాకు

కొటేషన్లు ఆహ్వానం

కడప కోటిరెడ్డిసర్కిల్‌: కడప స్పెషల్‌ పోక్సో కోర్టు కోసం కొత్త ఫర్నిచర్‌ వస్తువుల సరఫరా కోసం సీల్డ్‌ కొటేషన్లు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి జి. శ్రీదేవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అన్ని టాక్స్‌లతో కలుపుకొని 7 ఐరన్‌ అల్మారాలు, 1 ఐరన్‌ ర్యాక్‌, 8 ఆఫీసు టేబుల్స్‌, 3 కుషన్‌ ఛైర్స్‌, 30 ‘ఎస్‌’ౖ టెప్‌ మార్క్‌ ఛైర్స్‌, ఒక క్రోన్‌ చైర్‌, 5 ఐరన్‌ స్టూల్స్‌, 2 కోట్‌ హాంగర్స్‌, 3 ఉడెన్‌ బెంచులు, ఒక సోఫా సెట్‌, 5 టీపాయి, ఒక డైనింగ్‌ టేబుల్‌, ఒక ప్లాస్టిక్‌ చైర్‌ మొత్తం 13 రకాల ఫర్నిచర్‌ వస్తువుల కోసం సీల్డ్‌ కొటేషన్లు ఆహ్వానిస్తున్నామన్నారు. టెండరుదారు సమర్పించే కొటేషన్‌ కవరు పైన ‘కొటేషన్‌ ఫర్‌ సప్లయ్‌ అండ్‌ ఇన్‌స్టాలేషన్‌ ఫర్‌ ఫర్నీచర్‌ ఐటమ్స్‌’అని నమోదు చేసిన సంబంధిత షీల్డు కొటేషన్లను ఈనెల 21వతేదీ సాయంత్రం 5 గంటల లోపు ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టు, కడపలో సమర్పించాలన్నారు.

మదనపల్లె సబ్‌ కలెక్టరేట్‌కు ఐఎస్‌ఓ గుర్తింపు

మదనపల్లె: వందేళ్లకు పైబడి ఘన చరిత్ర కలిగిన మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఐఎస్‌ఓ 9001:2015 సర్టిఫికేట్‌ను అందుకుంది. సబ్‌ కలెక్టరేట్‌ అగ్నిప్రమాద ఘటన తర్వాత ఆధునికీకరించిన భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌.పీ.సిసోడియా, జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ చామకూరి, జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శ రాజేంద్రన్‌, సబ్‌ కలెక్టర్‌ మేఘస్వరూప్‌తో కలిసి బుధవారం ప్రారంభించారు. నూతన కార్యాలయ భవనంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెవెన్యూ, సాధారణ పరిపాలన, విపత్తు నిర్వహణ తదితర పాలనా విషయాలకు సంబంధించి, ఐఎస్‌ఓ 9001:2015 ప్రమాణాలను అనుసరిస్తూ, నాణ్యతతో కూడిన సేవలు ప్రజలకు అందించడంపై హైదరాబాద్‌కు చెందిన గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌ సర్టిఫికెట్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఫిబ్రవరి 17న మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి అందించిన ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ను, రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌.పీ.సిసోడియాకు చూపించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ చామకూరి, సబ్‌ కలెక్టర్‌ మేఘస్వరూప్‌లను ప్రత్యేకంగా అభినందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement