పెద్దతిప్పసముద్రం: మండలంలోని పలు సచివాలయాల్లో పని చేస్తూ డీడీఓ అధికారాలు ఉన్న పంచాయతీ కార్యదర్శులు సోమవారం ఎంపీడీఓ అబ్దుల్ కలాం ఆజాద్ ఎదుట అసంతృప్తి గళం విప్పారు. ఈ సర్వే , ఆ సర్వే అంటూ మొత్తం 41 సర్వేల భారం అంతా తమపైనే రుద్దుతారా, మిగిలిన శాఖల అధికారుల గురించి మీరెందుకు పట్టించుకోవడం లేదు సార్ అంటూ ఎంపీడీఓను ప్రశ్నించారు. వీఆర్‌ఓ, సర్వేయర్ చూస్తే రీసర్వే అంటారు, ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్‌ను అడిగితే ఫార్మర్ రిజిస్ట్రీ అంటారు. వెటర్నరీ, ఏఎన్‌ఎంలను సర్వే చేయమంటే సీజనల్ వ్యాధులని ఈ వ్యాక్సిన్, ఆ వ్యాక్సిన్ అంటారు. కొంత మంది గ్రేడ్–5 కార్యదర్శులు చూస్తే నెలల తరబడి సెలవులో వెళ్లిపోతారు. కొన్ని చోట్ల డీఏ, వెల్ఫేర్ పోస్టులు ఖాళీగా ఉన్నా ఆ పని భారం కూడా తమపైనే రుద్దుతారా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని సర్వేలు తామే చేయడమే గాక మిగిలిన వారికంతా 1వ తేదీలోగా జీతాలు వచ్చేలా చూడాలి. ఇంత గొడ్డు చాకిరి చేసే తమకు మాత్రం 1వ తేదీ కాకుండా 20వ తేదీ జీతాలు ఎలా వస్తాయి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. డీడీఓల ఆవేదనపై స్పందించిన ఎంపీడీఓ పక్కనే ఉన్న తహసీల్దార్ శ్రీరాములు నాయక్‌తో చర్చించారు. సర్వేకు వీఆర్‌ఓలు, సర్వేయర్లు సహకరించేలా చూడాలని ఎంపీడీఓ సూచించారు. తహసీల్దార్ కూడా సానుకూలంగా స్పందించడంతో డీడీఓలు శాంతించారు.
ఎంపీడీఓ ఎదుట డీడీఓల అసంతృప్తి
Comments
Please login to add a commentAdd a comment