● పిల్ల కాలువలతోనే సస్యశ్యామలం
ప్రాజెక్టు పరిధిలో ఆయకట్టు సాగు వివరాలు
ఉపకాలువ కి.మీ ఆయకట్టు
(ఎకరాల్లో)
తంబళ్లపల్లె ఉపకాలువ 30.750 15,000
పుంగనూరు ఉపకాలువ 224.5 85,900
వాయల్పాడు ఉపకాలువ 23.50 17,200
నీవా ఉపకాలువ 122.5 57,500
చింతపర్తి డిస్ట్రిబ్యూటరీ 42.30 22,400
ఎల్లుట్ల డిస్ట్రిబ్యూటరీ 25.17 15,400
సదుం డిస్ట్రిబ్యూటరీ 19.1 5,400
బి.కొత్తకోట : హంద్రీ–నీవా రెండో దశ సాగు, తాగునీటి ప్రాజెక్టు పనుల్లో కూటమి ప్రభుత్వం ఉపకాలువల లైనింగ్ పనులకు ప్రాధాన్యత ఇచ్చి పిల్ల కాల్వల తవ్వకం పనులు వదిలేసుకోవడంతో కరువు రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. 1994, 2005లో ప్రాజెక్టు పనులు చేపట్టేలా రూపొందించిన డీటైల్ ప్రాజెక్టు నివేదికల్లో ప్రాజెక్టు ఉపకాలువల నుంచి పిల్ల కాల్వలను తవ్వించి వాటి ద్వారా చివరి ఆయకట్టు భూమికి సాగునీరు అందించాలన్నది లక్ష్యం. ఒక ప్రాజెక్టు నుంచి చివరి ఆయకట్టు భూమి వరకు సాగునీరు వెళ్లాలంటే దాని ప్రధాన లేదా ఉపకాలువ నుంచి పిల్ల కాలువలను తవ్వించాలి. అయితే ఈ పనులను చేపట్టేందుకు కూటమి ప్రభుత్వం సుముఖంగా లేదు. కాంట్రాకర్లకు ప్రయోజనం చేకూర్చే పనులపైనే దృష్టి పెట్టింది. కరువుతో కష్టాలు పడుతున్న రైతాంగాన్ని ఇంకా కష్టాల్లోకి నెట్టేస్తోంది.
కిరణ్ పెంచగా..వద్దన్న బాబు
ప్రాజెక్టు పనులు చేపట్టిన కాంట్రాక్టర్ల ఒప్పందం మేరకు ఎకరాకు రూ.4,700తో పిల్లకాలువ పనులు చేయాలి. మధ్యలో కల్వర్టులు, రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం చేయాల్సివస్తే కాంట్రాక్టర్లే చేపట్టాలి. ఉమ్మడి రాష్ట్ర సీఎం కిరణ్ సర్కారులో ఎకరాకు అదనంగా రూ.5,800 పెంచి రూ.10,500గా నిర్ణయించారు. 2014లో అధికారం చేపట్టిన చంద్రబాబు పిల్ల కాలువల పనులు చేపట్టకుండా కాంట్రాక్టర్లకు మేలు చేకూర్చేలా 2015లో జీవో 22 జారీతో ఈ పనులను కాంట్రాక్టర్లు వదిలేసుకున్నారు. ఫలితంగా రైతాంగానికి తీవ్ర నష్టం కలుగుతున్నా చంద్రబాబు సర్కార్‌కు ఏమాత్రం పట్టలేదు. ఇదే కథ మళ్లీ పునరావృతమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనుల స్వరూపాన్నే మార్చేసి వారికి ఇష్టమైన పనులే చేపడుతున్నారు. కాగా చిత్తూరుజిల్లాకు సంబంధించి 60, 61 ప్యాకేజిల్లో పిల్ల కాలువల పనులు జరిగాయి.
లైనింగ్ పనులతో ముందుకే
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.1,217 కోట్లతో పుంగనూరు ఉపకాలువను వెడల్పు చేసి రైతులకు ప్రయోజనం కల్పించాలని నిర్ణయిస్తే కూటమి ప్రభుత్వం ఈ పనిపై కక్ష కట్టింది. గత సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని వెడల్పు పని రద్దు చేసి కాంక్రీట్ లైనింగ్ పని చేయిస్తున్నారు. దీనివల్ల కాంట్రాక్టర్‌కు తప్ప రైతులకు ప్రయోజనం లేదు. కాలువకు స్లూయిజ్‌ల నిర్మాణం చేపట్టకుండా కేవలం సమీపంలోని చెరువులకు మాత్రమే నీటిని అందించి చేతులు దులుపుకునే పరిస్థితులు నెలకొన్నాయి. పిల్ల కాలువలు తవ్వించి 2,18,800 ఎకరాల సాగుకు నీరివ్వకుండా కొన్ని చెరువులు నింపేందుకే ఆసక్తిగా ఉంది. పిల్ల కాలువలు వదిలేయడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. ఫలితంగా కాలువసాగే మార్గంలో ఒక్క ఎకరాకు సాగునీరు అందదు. ఫలితంగా ప్రాజెక్టు లక్ష్యం నీరుగారిపోతోంది.
28 మండలాలకు తీవ్ర నష్టం
పిల్ల కాలువ పనులు జరక్కపోవడంతో అన్నమయ్య, చిత్తూరుజిల్లాల్లోని 28 మండలాలు కరువు పరిస్థితుల నుంచి గట్టెక్కలేని పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. బి.కొత్తకోట, ములకలచెరువు, పెద్దతిప్పసముద్రం, తంబళ్లపల్లి, కురబలకోట, మదనపల్లి, పెద్దమండ్యం, పుంగనూరు, చౌడపల్లి, పులిచర్ల, సదుం, పలమనేరు, పెద్దపంజాణి, గంగవరం, చిత్తూరు, గుడిపాల, పాకాల, చంద్రగిరి, కేవి.పల్లి, వాయల్పాడు, కలకడ, కలికిరి, గుర్రంకొండ, పీలేరు, పెనుమూరు, పూతలపట్టు, ఐరాల, తవణంపల్లి మండలాలకు సాగునీరు అందక తీవ్రంగా నష్టపోతున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో ఈ మండలాలకు నిర్ణయించిన ఆయకట్టు భూమికి కృష్ణాజలాలతో పంట సాగు కలలో మాటగా మిగిలిపోవడం ఖాయం.
కుప్పానికి ఇదే పరిస్థితి
సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ రైతుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కుప్పం ఉపకాలువ నుంచి 6వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. ఇక్కడి 110 చెరువులకు కృష్ణా జలాలను తరలించి నీటిని అందిస్తారు. అయితే రెండుచోట్ల పిల్ల కాలువలను తవ్వించాల్సి ఉన్నప్పటికీ దీనిపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. కుప్పం నియోజకవర్గంలో 77, పలమనేరు నియోజకవర్గంలో 33 చెరువులకు కృష్ణా జలాలు అందించే ప్రణాళికపై చర్యలు తీసుకుంటారో లేదో స్పష్టత లేదు. కుప్పం కాలువకు లైనింగ్ పనులు చేస్తున్నందున ఆ ప్రభావం రెండు నియోజకవర్గాలపై పడనుంది.
పిల్ల కాలువలకు మంగళం
అన్నమయ్య, చిత్తూరుజిల్లాల్లో 2,18,800 ఎకరాలకు చుక్కనీరు అందదు
కుప్పం రైతాంగానికి ఇదే పరిస్థితి
కృష్ణా జలాల తరలింపు లక్ష్యం నెరవేరదు
కొత్తగా లైనింగ్ పనులతో
రైతులకు తీవ్ర నష్టం
ప్రస్తుత అన్నమయ్య, చిత్తూరుజిల్లాలో సాగే హంద్రీ–నీవా ప్రాజెక్టు ఉపకాలువల నుంచి రైతుల పొలాలకు నీళ్లు అందించేలా ప్రతి 40 నుంచి 100 ఎకరాలకు ఒక పిల్ల కాలువను తవ్వాలి. దీనికి నీటిని తరలించేలా ఉపకాలువ వద్ద స్లూయిజ్‌లను నిర్మించాలి. ఇలా చేయడం ద్వారా రెండు జిల్లాలకు చెందిన తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, పుంగనూరు, పలమనేరు, చిత్తూరు, పూతలపట్టు, చంద్రగిరి నియోజకవర్గాల్లోని 2,18,800 ఎకరాలకు శ్రీశైలం నుంచి ఇక్కడికి తరలించే కృష్ణా జలాలను సాగుకు అందించాలి. అయితే ప్రభుత్వం వీటిని తవ్వించేందుకు సుముఖంగా లేదు. రైతు ప్రయోజనాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా లైనింగ్ పనులపైనే శ్రద్ధ చూపుతోంది.
● పిల్ల కాలువలతోనే సస్యశ్యామలం
Comments
Please login to add a commentAdd a comment