
అందరి నోట.. టమాట
● ఈ వేసవిలో అత్యధిక ధర లభిస్తుందనే నమ్మకం
● పెట్టుబడి భారం లెక్క చేయకుండా టమాట సాగు
● జిల్లా వ్యాప్తంగా 4,303 ఎకరాల్లో సాగు
● ప్రస్తుతం 2,791 ఎకరాల్లో పంట దిగుబడులు
బి.కొత్తకోట : టమాట పంటతో ఈ మారు తాడో పేడో తేల్చుకోవాలని రైతాంగం సిద్ధమైంది. రాష్ట్రంలో అత్యధికంగా సాగయ్యే తంబళ్లపల్లి నియోజకవర్గంలోనూ గత ఏడాది పంట సాగులో కష్టాలు, నష్టాలు, సమంగా చూస్తూ ఈ ఏడాది రైతాంగం సర్దుకుపోతోంది. ఎవరి నోట విన్నా టమాటా సాగు మాటే వినిపిస్తోంది. వేసవిలో టమాటా ధరలను దృష్టిలో పెట్టుకున్న రైతులు.. మళ్లీ తమ కష్టాలు తీరిపోతాయనే ఆశతో పంట సాగు చేసేందుకు సిద్ధమయ్యారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 4,303 ఎకరాల్లో టమాట పంట సాగైంది. ఈ పంట కాలం పూర్తి కావస్తోంది. ఇందులో 60 శాతం మేర తంబళ్లపల్లి నియోజకవర్గంలోనే సాగైంది. ప్రస్తుతం 2,791 ఎకరాల్లో దిగుబడులు తీయడమేగాక, గడచిన 15 రోజుల్లో కొత్తగా 812.5 ఎకరాల్లో మళ్లీ పంట సాగుచేసినట్లు అధికారిక లెక్క. అయితే ఇప్పటికే వేయి ఎకరాలకు పైగా దాటిపోయినట్టు అంచనా. పెద్దతిప్పసముద్రం, తంబళ్లపల్లి, కురబలకోట, సంబేపల్లి, పెద్దమండ్యం కలకడ, గుర్రకొండ మండలాల్లో 250 ఎకరాలకు పైగా, కలికిరి, రామసముద్రం, చిన్నమండెం, గాలివీడులో, మదనపల్లి, వీరబల్లి, రాయచోటి, కేవిపల్లి, రామాపురంలో, వాయల్పాడు, పీలేరు, టి.సుండుపల్లి, నిమ్మనపల్లి, లక్కిరెడ్డిపల్లి గ్రామాల్లో 740 ఎకరాల్లోనూ ఈ టమాటా పంట సాగు చేశారు.
ధరలపై అశతోనే
టమాట పంటకు గత ఏడాది పలికిన అత్యధిక ధరలను దృష్టిలో పెట్టుకుని రైతులు ఈ మారు అత్యధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. కొద్దిపాటి పొలం ఉన్న రైతు తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని సాగుచేసేందుకు మొగ్గు చూపుతున్నారు. 2024 మే నెలలో మార్కెట్‌లో కిలో టమాట రూ.48 నుంచి రూ.52 పలికింది. జూన్‌లో రూ.88 నుంచి రూ.100, జూలైలో రూ.88 నుంచి రూ.95 వరకు పెరిగింది. మార్కెట్‌లో రైతుల నుంచి వ్యాపారులు కొనుగోలు చేసిన ధర. బహిరంగ మార్కెట్‌లో మూడో రకం టమాట ధర కిలో సెంచురీ దాటింది. ఒక్క తంబళ్లపల్లి నియోజకవర్గం నుంచే రోజుకు 800 నుంచి వెయ్యి టన్నుల టమాట దిగుబడి వచ్చింది. ములకలచెరువు, మదనపల్లి, కర్నాటకలోని కోలారు మార్కెట్‌లలో విక్రయించారు. ఈ ధరలను దృష్టిలో పెట్టుకుని రైతులు మళ్లీ ఇవే ధరలు పలుకుతాయని భావిస్తున్నారు. తమ కష్టాలు తీరిపోతాయనే ఆశతో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యారు.
3 వేల ఎకరాల్లో సాగు
ప్రస్తుతం తంబళ్లపల్లి నియోజకవర్గంలో టమాటా సాగుపై నెలకొన్న పరిస్థితుల మేరకు ఈ నెలాఖరు, ఏప్రిల్ రెండో వారం వరకూ కనీసం మూడు వేల ఎకరాల్లో టమాట సాగయ్యే సూచనలు ఉన్నాయి. ఈ సాగంతా వ్యవసాయ బోర్ల కింద మాత్రమే. రైతులు పంట సాగుచేశాక భూగర్భ జలాలు నిలకడంగా ఉంటాయనే నమ్మకం లేదు. గత రెండేళ్లుగా సరైన వర్షాలు కురవలేదు. గత ఖరీఫ్‌లో కరవు నెలకొని పంటకు నష్టం వాటిల్లింది. తీవ్రమైన ఎండలు, భూగర్భజలాలు టమాట సాగు, దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. దీంతో ధరలు పలకడం మాట అటుంచితే.. పంటను కాపాడుకుని లాభాలు పొందడం కత్తిమీద సామే అవుతుంది. ఈ పరిస్థితుల్లో టమాట పంట రైతాంగాన్ని ముంచుతుందో.. తేల్చుతుందో దిగుబడులు మొదలయ్యాక తేలిపోతుంది.
తంబళ్లపల్లిలో టమాట సాగు (ఎకరాల్లో)
మండలం సాగులో కొత్త పంట
ములకలచెరువు 650 160
పెద్దతిప్పసముద్రం 578 125
తంబళ్లపల్లి 458 145
బి.కొత్తకోట 458 117.5
కురబలకోట 389 135
పెద్దమండ్యం 281 130
సంబేపల్లిలో ––– 286
కలకడలో ––– 254
గుర్రంకొండ ––– 245

అందరి నోట.. టమాట
Comments
Please login to add a commentAdd a comment